మంచం పట్టిన మహిమలూరు
-విషజ్వరాలతో బాధపడుతున్న గ్రామస్తులు
ఆత్మకూరురూరల్ : మండలంలోని మహిమలూరులో 20 రోజులుగా విషజ్వరాలు ప్రబలి 250 మందికి పైగా ప్రజలు మంచాన పడ్డారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నా అక్కడ వైద్య సేవలు సక్రమంగా అందకపోవడంతో రోగులు చికిత్స కోసం ఆత్మకూరు, నెల్లూరు, చెన్నైకు వెళ్తున్నారు. ఇంటికి ఒకరు చొప్పున జ్వరాల బారిన పడినట్లు తెలిసింది. కొన్ని ఇళ్లలో ముగ్గురికి పైగా జ్వరంతో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. తాగునీటి సమస్య తలెత్తడంతో దొరికిన నీటిని తాగుతున్నామని, దీంతో జ్వరాల ప్రభావం అధికమైందని గ్రామస్తులు చెబుతున్నారు.
ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో డాక్టర్లు రోగులకు అందుబాటులో లేకపోవడంతో సిబ్బందే మందులు ఇస్తున్నారు. దీంతో పూర్తిస్థాయిలో జ్వరాలు తగ్గకపోగా మరింత పెరగడంతో భయపడిన రోగులు చికిత్స నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. తాగునీటి విషయమై మండల అభివృద్ధి అధికారిని వివరణ కోరగా భూగర్భజలాలు అడుగంటడంతో కొంత కలుషిత జలాలు సరఫరా అయి ఉంటాయని, తాగునీటి పథకాలను క్లోరినేషన్ చేయాలని గ్రామసర్పంచ్, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించినట్లు తెలిపారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి జ్వరాలు మరింత ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని, ఆరోగ్యకేంద్రంలో సేవలు సక్రమంగా అందేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.