హైదరాబాద్ సభను జయప్రదం చేయండి
Published Thu, Oct 24 2013 3:06 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
ఆత్రేయపురం, న్యూస్‌లైన్ :సమైక్యాంధ్రకు మద్దతుగా ఈనెల 26న హైదరాబాద్‌లో జరగనున్న సమైక్య శంఖారావం సభకు సమైక్యవాదులందరూ భారీగా తరలిరావాలని కొత్తపేట నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పిలుపునిచ్చారు. సమైక్య శంఖారావం సభ విజయవంతానికి బుధవారం ఆత్రేయపురంలో పార్టీ నాయకుడు చిలువూరి నాగరామ సత్యనారాయణరాజు (బాబి) స్వగృహంలో మండల పార్టీ కన్వీనర్ కనుమూరి శ్రీనివాసరాజు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఆ సమావేశంలో జగ్గిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విడదీయాలని చూస్తున్నారన్నారు. విభజనను అడ్డుకునేందుకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే అనేక ఉద్యమాలు చేశారని, ఈనెల 26న హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో సమైక్య శంఖారావం నిర్వహిస్తున్నారన్నారు.
సమైక్యాంధ్ర ప్రకటన వచ్చే వరుకు వైఎస్సార్ సీపీ పోరాటం సాగిస్తుందన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వల్లే రాష్ట్ర విభజనకు యూపీఏ ప్రభుత్వం పూనుకుందన్నారు. రాష్ట్ర విభజన ప్రకటన వచ్చినప్పుడే కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్ల మెంట్ సభ్యులు రాజీనామాలు చేసి రాజ్యాంగ సంక్షోభం సృష్టించి ఉంటే విభజన ప్రక్రియపై కేంద్రం వెనకడుగు వేసేదని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగితే సంక్షేమ కార్యక్రమాల అమలు సాధ్యం కాదని, నీరు, ఆర్థిక సమస్యలు అధికమవుతాయని అన్నారు. సమైక్య శంఖారావ సభకు వచ్చే వారు 25వ తేదీన మండల కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. వైఎస్సార్ సీపీ నాయకులు మాజీ ఎంపీపీ పీఎస్‌రాజు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ చిలువూరి దుర్గరాజు, బోనం సాయిబాబా, సరిపెల్ల రంగరాజు పాల్గొన్నారు.
Advertisement
Advertisement