జాతీయ పార్టీగా తీర్చిదిద్దుకుందాం
టీడీపీ మహానాడు ఏకగ్రీవ తీర్మానం పోలవరంపై కేసీఆర్ రాద్ధాంతం చేస్తున్నారని బాబు వ్యాఖ్య
హైదరాబాద్: ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ నిర్వహించిన మహానాడు ఏకగ్రీవంగా తీర్మానించింది. హైదరాబాద్ శివారు గండిపేటలో జరిగిన టీడీపీ 33వ మహానాడులో బుధవారం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఈ మేరకు తీర్మానం ప్రవేశ పెట్టగా ప్రతి నిధులు ఆమోదం తెలిపారు. దేశంలో 30 శాతం తెలుగువారు ఉన్నారని, వారందరూ టీడీపీని ఎప్పుడు జాతీయ పార్టీగా ఏర్పాటు చేస్తారని ఎదురుచూస్తున్నారని ఈ సందర్భంగా యనమల పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్డీయేలో భాగస్వామ్యంగా కొనసాగుతున్న మనం ఒక పక్క జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్రమోడీకి సహకరిస్తూనే టీడీపీని జాతీయ పార్టీగా తీర్చిదిద్దుకోవలసిన అవసరం ఉందన్నారు. భవిష్యత్‌లో దేశ రాజకీయాల్లో టీడీపీ పాత్ర కీలకంగా ఉంటుందని భావిస్తున్నామన్నారు.
రాష్ట్ర విభజన సమస్యపై రెండు ప్రాంతాల్లో జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్న వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని మహానాడులో మరో తీర్మానాన్ని ఆమోదించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అనువుగా ఖమ్మం జిల్లాలోని ఏడు ముంపు మండలాలను సీమాంధ్రలో కలపాలనికే ంద్రం ప్రతిపాదించినప్పుడు నోరు మెదపని కేసీఆర్ ఇప్పుడు కావాలని రాద్ధాంతం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అప్పట్లోనే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రక టించిందని.. ఈ విషయంలో అనవసర అపోహలు సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రాంత ంలో సీమాంధ్ర వారి పెట్టుబడులు వద్దంటే ఈ ప్రాంత ప్రజలు నష్టపోతారని చెప్పారు. సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు కొత్తగా ఏర్పడుతున్న నేపథ్యంలో పరస్పరం సహకరించుకోవాల్సింది పోయి రెచ్చగొట్టడం సరికాదన్నారు. సీమాంధ్రలో టీడీపీ ప్రకటించిన ప్రణాళికను తాము అమలు చేస్తామని, తెలంగాణలో టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రణాళిక అమలు కోసం పోరాటం చేస్తామని చెప్పారు. రెండు రాష్ట్రాల్లోని ఉద్యోగులకు తాను అండగా ఉంటానన్నారు. సమైక్యాంధ్రప్రదేశ్ కోసం ఉద్యమించిన వారిపై పెట్టిన కేసులను ఎత్తి వేస్తామని.. తెలంగాణ ప్రభుత్వం కూడా కేసులు ఎత్తి వేయాలని, అమరవీరులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
బుల్లెట్‌లా దూసుకుపోతా.. అందుకే గెలిచా...
అధైర్యం అనేది తన డిక్షనరీలో లేదని, తనది బండ, మొండి ధైర్యమని చంద్రబాబు అన్నారు. బుల్లెట్‌లా దూసుకుపోతానని, అందుకే ఈ ఎన్నికల్లో విజయం సాధించానని చెప్పారు. బీజేపీతో పొత్తు వద్దని పలువురు చెప్పారని.. దేశం, తెలుగుజాతి ప్రయోజనాల కోసం, కాంగ్రెస్‌ను ఓడించి భూస్థాపితం చేసేందుకు ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నానని పేర్కొన్నారు.
8న సీఎంగా ప్రమాణం...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తాను జూన్ ఎనిమిదో తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు బాబు ప్రకటించారు. ఆ రోజు ఉదయం 11.45 గంటలకు విజయవాడ, గుంటూరు మధ్య ప్రాంతంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు. అంతకుముందు తిరుపతిలో తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశం ఉంటుందని, ఈ తేదీని ఒకటి, రెండురోజుల్లో ప్రకటిస్తామని చెప్పారు. రెండు రోజుల మహానాడుకు 75 వేల మందికి పైగా హాజరయ్యారన్నారు.
కార్యకర్తల కోసం ప్రత్యేక నిధి: లోకేష్ సూచన
పార్టీ కార్యకర్తలను ఆదుకునేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని చంద్రబాబు కుమారుడు లోకేష్ సూచించారు. ఒక కమిటీని ఏర్పాటు చేసి దీని నిర్వహణ బాధ్యతను అప్పగించాలన్నారు. పార్టీ కార్యకర్తల కోసం ఇప్పటికే సిద్ధంగా ఉన్న ఆరు కోట్లతో పాటు మహానాడులో విరాళంగా వచ్చిన రూ.14 కోట్లను కలిపి రూ.20 కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. మహానాడులో పార్టీకి.. నేతలు రాయపాటి, గల్లా జయదేవ్, చైతన్యరాజు, పేరం హరిబాబు, ప్రత్తిపాటి పుల్లారావులు రూ.50 లక్షల చొప్పున, జీవీఎస్ ఆంజనేయులు రూ.60 లక్షలు, గంటా శ్రీనివాసరావు రూ.20 లక్షలు, చామకూర మల్లారెడ్డి రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు.
బాబు లేఖ వల్లే తెలంగాణ వచ్చింది: మోత్కుపల్లి
సీనియర్ నేత మోత్కుపల్లి ప్రసంగిస్తూ చంద్రబాబు ఇచ్చిన లేఖ వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. చదువుకున్న యువతకు టికెట్లు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్‌దేనని అన్నారు.
ప్రముఖులకు సన్మానం
మహానాడు పురస్కరించుకుని వివిధ రంగాలకు చెందిన ప్ర ముఖులు అంపశయ్య నవీన్ (సామాజిక విశ్లేషకులు), తిరునగరి (కవి, విమర్శకులు), చంద్రబోస్ (సినీ గీత రచయిత), మంతెన వెంకట రామరాజు (వసుధా ఫౌండేషన్), రాజేంద్రప్రసాద్ (సినీ నటుడు), పర్వతనేని వెంకటకృష్ణ (పాత్రికేయుడు) తదితరులకు ఎన్టీఆర్ పురస్కారాలను అందజేశారు.
ఎన్‌టీఆర్‌కు ఘన నివాళి
ఎన్టీఆర్‌కు ఆయన జయంతి సందర్భంగా కుటుంబసభ్యులు ఎన్టీఆర్ ఘాట్‌లో విడివిడిగా నివాళులుర్పించారు. చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, వియ్యంకుడు బాలకృష్ణ వెంటరాగా ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చారు. సర్వమత ప్రార్థనల్లో పాల్గొనటంతో పాటు కేక్ కట్ చేశారు. ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ.. తన సోదరులు, సోదరీమణులతో పాటు కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రాంతో కలిసి వచ్చి నివాళులర్పించారు. ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి.. భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మనవడు, మనవరాలితో వచ్చి నివాళులర్పించారు.
సాక్షిని అనుమతించని నేతలు
మహానాడు రెండోరోజు విశేషాలను కవర్ చేయడానికి కూడా తెలుగుదేశం నేతలు సాక్షిని ఆహ్వానించలేదు. అయినప్పటికీ ఆ వివరాలను కవర్ చేయడానికి వెళ్లిన సాక్షి ప్రతినిధులను సమావేశ ప్రాంగణంలోకి నేతలు అనుమతించలేదు. వివిధ రూపాల్లో సేకరించిన సమాచారం మేరకు పాఠకులకు ఈ వార్త అందిస్తున్నాం.