కలెక్టరేట్ ఆవరణలో ఒంటిపై పెట్రోల్ పోసుకుంటున్న నాగార్జున, అడ్డుకుంటున్న పోలీసులు
నెల్లూరు (పొగతోట) : కలెక్టరేట్‌కు బుధవారం కుటుంబంతో కలిసి వచ్చిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. జిల్లాలోని సూళ్లూరుపేటకు చెందిన అరిగెల నాగార్జున రెవెన్యూ అధికారులు తనకు న్యాయం చేయడం లేదని కుటుంబం సహా కలెక్టరేట్‌కు వచ్చి ఆత్మహత్య చేసుకుంటున్నానని అధికారులకు ముందస్తు సమాచారం ఇచ్చాడు. అన్నట్లుగానే భార్య భవానీ, ఇద్దరు కుమార్తెలతో కలిసి కారులో కలెక్టరేట్‌కు వచ్చి ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పటించుకునే ప్రయత్నం చేశాడు. పెట్రోలు బాటిల్, అగ్గిపెట్ట స్వాధీనం చేసుకునే సమయంలో పోలీసులకు అతనికి మధ్య తోపులాట జరిగింది. పోలీసులు, చుట్టుపక్కల ఉన్న వారు నాగార్జునపై నీళ్లు పోశారు. డీఆర్‌ఓ, పోలీసు అధికారులు ఘటన స్థలానికి చేరుకుని నాగార్జునను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
నాగార్జున ఏం చెబుతున్నాడంటే..
మాది చిట్టమూరు మండలం చిల్లమూరు. 110 ఎకరాల ప్రభుత్వ భూమిని పట్టాలు మంజూరు చేయించేందుకు రైతుల నుంచి రూ.1.20 కోట్లు డబ్బులు వసూలు చేసి అప్పటి తహసీల్దార్ చంద్రశేఖర్‌కు విడతల వారీగా అటెండర్, వీఆర్‌ఓల ద్వారా ఇచ్చాను. నగదు ఇచ్చినట్లు నా వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి. 2019 ఎన్నికల సమయంలో గుంటూరు జిల్లాలకు బదిలీపై వెళ్లి తిరిగి వచ్చి సైదాపురంలో పని చేస్తున్నాడు. ఈ విషయమై అనేక పర్యాయాలు అడిగిన సరైన సమాధానం చెప్పలేదు. ఇంటిపైకి ఇతర వ్యక్తులను పంపించి దౌర్జన్యం చేయించాడు. ఈ విషయంపై జిల్లా అధికారులకు వినతి పత్రం సమర్పించినా ఫలితం లేదు. గత్యంతరంలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాను.
విచారిస్తాం: డీఆర్‌ఓ
దీనిపై డీఆర్‌ఓ మాట్లాడుతూ నాగార్జున ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తాన్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన నాగార్జునపై కేసు నమోదు చేస్తామన్నారు. కాగా నాగార్జున చేస్తున్నవి నిరాధార ఆరోపణలని సైదాపురం తహసీల్దార్ చంద్రశేఖర్ ఖండించారు. గతంలో ఇదే విధంగా బెదిరిస్తే సబ్‌కలెక్టర్‌కు విషయం చెప్పి 15 రోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment