గద్వాల రూరల్/ జనగామ/ జనగామరూరల్/ దురాజ్‌పల్లి (సూర్యాపేట)/ కరీంనగర్ అర్బన్: అవి జిల్లా పరిపాలనకు కీలకమైన కలెక్టరేట్లు.. జనం సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమం జరుగుతోంది.. ఇంతలో కలకలం.. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ ఓ రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. మరోచోట ఇంకో రైతు కలెక్టరేట్ భవనం ఎక్కి దూకేందుకు సిద్ధమయ్యాడు.. ఇంకోచోట ఓ యువతి, మరో యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేశారు. తమ చావుతోనైనా అధికారులు కళ్లుతెరుస్తారేమోనని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే రోజున 3 జిల్లా కలెక్టరేట్లలో జరిగిన ఘటనలు కలకలం రేపుతున్నాయి.
భూమిని వేరేవారి పేరిట మార్చారంటూ
‘‘మా పెద్దల నుంచి వచ్చిన భూమిని గ్రామానికి చెందిన కొందరు కాజేశారు. దీనిపై కలెక్టర్‌కు ఎనిమిది సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. నేను చనిపోయాక అయినా కళ్లు తెరవండి..’’అంటూ జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ ఎదుట లోకేశ్ అనే రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. అక్కడే ఉన్న పోలీసులు అతడిని అడ్డుకుని అగ్గిపెట్టె లాక్కున్నారు.నీళ్లు చల్లి, దుస్తులు మార్చారు. జిల్లాలోని మానవపాడు మండలం కలుకుంట్లకు చెందిన లోకేశ్‌కు వారసత్వంగా ఐదు ఎకరాల భూమి వచ్చింది.
కానీ అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి, కొందరు అధికారులు కుమ్మక్కై ఆ వ్యక్తి పేరిట పట్టా చేశారని లోకేశ్ పేర్కొన్నారు. తహసీల్దార్‌కు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఈ సమయంలో కలెక్టరేట్‌లోనే ఉన్న మానవపాడు తహసీల్దార్ యాదగిరి వచ్చి బాధిత రైతుతో మాట్లాడారు. లోకేశ్ భూమి పొరపాటున మరొకరి పేరు మీద మారిందని.. ధరణిలో మార్చే ఆప్షన్ రాగానే భూమిని లోకేశ్ పేరిట నమోదు చేసి పాస్‌బుక్ ఇస్తామని చెప్పారు.
ఎనిమిది సార్లు ఫిర్యాదు చేసినా..
తన తాత పేరిట ఉన్న భూమిని రెవెన్యూ అధికారులు వేరే వ్యక్తుల పేరిట అక్రమంగా పట్టా చేశారని.. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని.. నిమ్మల నర్సింగరావు అనే రైతు జనగామ కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యాయత్నం చేశారు. జనగామ మండలం పసరమడ్లకు చెందిన నర్సింగరావు తాత నిమ్మల మైసయ్య పేరిట 8 ఎకరాల 16 గుంటల భూమి ఉంది. కొన్నేళ్ల కింద నర్సింగరావు బతుకుదెరువు కోసం ములుగు జిల్లా ఎల్బాకకు వలస వెళ్లారు. దీన్ని అలుసుగా తీసుకుని 2017లో అప్పటి తహసీల్దార్ జె.రమేశ్, వీఆర్వో క్రాంతికుమార్, అదే గ్రామానికి చెందిన ఇద్దరు కుమ్మక్కై తమ భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నారని నర్సింగరావు ఆరోపించారు.
అప్పటి నుంచీ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదన్నారు. దీనిపై సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే.. అది తమ పరిధిలో లేదని, కోర్టుకు వెళ్లాలని సూచించారు. ఆందోళన చెందిన నర్సింగరావు.. కలెక్టరేట్‌పైకి ఎక్కి ఒంటిపై డీజిల్ పోసుకున్నారు. ఆర్డీవో మధుమోహన్, ఇతర అధికారులు నచ్చజెప్పడంతో సుమారు రెండు గంటల తర్వాత కిందికి దిగాడు. నర్సింగరావు దగ్గర ఉన్న పత్రాలను పరిశీలించిన అధికారులు.. దీనిపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. అయితే భూమి సమస్యపై నర్సింగరావు 2021 డిసెంబర్‌లో కూడా ఇదే కలెక్టరేట్‌పై ఆత్మహత్యాయత్నం చేశాడని.. అయినా సమస్య పరిష్కారం కాలేదని రైతులు చెబుతున్నారు.
కరీంనగర్ ప్రజావాణికి గట్టి బందోబస్తు
ప్రజావాణి సందర్భంగా రైతులు, ప్రజలు పురుగుల మందు, పెట్రోల్ వంటి వాటితో ఆందోళనలకు దిగుతుండటంతో.. కరీంనగర్ జిల్లాలో ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణి సందర్భంగా ప్రధాన ద్వారంతోపాటు ఆడిటోరియం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. అర్జీదారులను తనిఖీ చేశాకే లోపలికి పంపారు.
సూర్యాపేట కలెక్టరేట్‌లో ఇద్దరి ఆత్మహత్యాయత్నం
అధికారులు తమ భూసమస్యలు పరిష్కరించడం లేదని, పైగా తమపైనే అక్రమ కేసులు పెడుతున్నారని సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో ఇద్దరు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కల్మలచెర్వుకు చెందిన మీసాల అన్నపూర్ణ, ఆమె కుమార్తె స్వాతి కలిసి ప్రజావాణి కార్యక్రమానికి వచ్చారు. తన భర్త జానయ్య పేరిట ఉన్న 5 గుంటల భూమిని బెజ్జం వెంకన్న అనే వ్యక్తి ఆక్రమించారని.. తన పేరిట ఉన్న 34 గుంటల భూమిని, కుమార్తె స్వాతి పేరిట ఉన్న 25 గుంటల భూమిని సైదులు అనే వ్యక్తి కబ్జా చేశారని అన్నపూర్ణ ఆరోపించారు. రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, పైగా తమపైనే అక్రమ కేసులు బనాయించారని వాపోయారు.
ఇక ఇదే గ్రామానికి చెందిన పున్న వీరమ్మ తన కుమారుడు పున్న సైదులుతో కలిసి ప్రజావాణికి వచ్చారు. తమకు 2 ఎకరాల 20 గుంటల భూమి ఉందని.. అందులో సాగు చేయకుండా బెజ్జం పిచ్చయ్య, బెజ్జం దాసు, శెట్టిపల్లి కృష్ణ, శెట్టిపల్లి రాముడు అనే వ్యక్తులు అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. అయితే ఈ రెండు ఫిర్యాదుల విషయంలో పోలీసులను ఆశ్రయించాలని అదనపు కలెక్టర్ సూచించారు. దీనితో ఆవేదన చెందిన మీసాల స్వాతి తొలుత ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. సిబ్బంది ఆమెను అడ్డుకోగా.. పక్కనే ఉన్న పున్న సైదులు ఆ పెట్రోల్ బాటిల్‌ను తీసుకుని ఒంటిపై పోసుకున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. వారిని కోదాడ డీఎస్పీ వద్దకు పంపారు.
Comments
Please login to add a commentAdd a comment