మచిలీపట్నం: ఇద్దరి వ్యక్తుల మధ్య చోటుచేసుకున్న స్వల్ప వివాదం ఓ యువకుడి ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలో శనివారం జరిగింది. వివరాలు... ఘంటసాలకు చెందిన రాంబాబు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. శుక్రవారం రాత్రి ఘంటసాల సెంటర్‌లో శేషగిరి అనే వ్యక్తిని ఆకారణంగా దూషించాడు. అతడు ఇదేమిటని ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. అప్పుడే అటుగా వెళుతున్న శేషగిరి కుమారుడు వంశీ(20), గొడవను సద్దుమణిగించేందుకు ప్రయత్నించాడు.
కోపంతో రాంబాబు వంశీపై కర్రతో దాడి చేశాడు. కిందపడిన అతడిని విచక్షణా రహితంగా బాదాడు. తీవ్రంగా గాయపడిన వంశీ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దరాప్తు ప్రారంభించారు. కాగా, శేషగిరికి వంశీ ఏకైక సంతానం. పదో తరగతి వరకు చదువుకుని తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. వంశీ మృతితో కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.
(ఘంటసాల)