ప్రాణం తీసిన అతివేగం
Published Wed, Dec 25 2013 2:45 AM | Last Updated on Sat, Sep 15 2018 8:43 PM
శృంగవరపుకోట రూరల్ / ఎల్.కోట, న్యూస్‌లైన్: ఎల్.కోటలోని స్టీల్ ఎక్స్ఛేంజ్ కంపెనీలో సెక్యూరిటీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న కంటిమహంతి గణేష్(38)ను ఇసుక లారీ ఢీకొనడంతో మృతి చెందాడు. ప్రమాద సంఘటనపై ఎల్.కోట హెచ్‌సీ ఎల్.గోవిందరావు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. మంగళవారం తెల్లవారుజామున 4.45 సమయంలో విధులు ముగించుకుని కంపెనీ నుంచి ఎస్.కోట వైపు వస్తున్న గణేశ్ ద్విచక్రవాహనాన్ని ఎల్.కోట మండలంలోని సోంపురం జంక్షన్ సమీపంలో ఎదురుగా అతివేగంగా వస్తున్న ఇసుక లారీ ఢీకొంది. ఆ వేగానికి ద్విచక్రవాహనం లారీ కింద చక్రాల్లో ఇరుక్కుపోగా.. గణేశ్ కొద్ది దూరంలో తుళ్లిపడ్డాడు.
ఈ ప్రమాదంలో గణేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద స్థలంలో పడి ఉన్న ఆయనను అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి 108కు సమాచారమందించి, ఎస్.కోట కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ హరి పరిశీలించి ఆయన అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య శోభారాణి, భరత్ అనే కుమారుడు ఉన్నారు. శోభారాణి విశాఖలోని పోర్టులో ఉద్యోగం చేస్తూ అక్కడి క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ప్రమాదానికి కారణమైన లారీని పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు హెచ్‌సీ తెలిపారు. కాగా గణేశ్ గతంలో ఆర్‌పీఎఫ్‌లో విధులు నిర్వహించి రిజైన్ చేశారు. ప్రస్తుతం స్టీల్ ఎక్స్ఛేంజ్ కంపెనీలో సెక్యూరిటీ అధికారిగా విధులు నిర్వహిస్తూ కంపెనీ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
Advertisement
Advertisement