ఒక ప్రమాదం జీవితాన్ని అంధకారం చేసింది!
► రైల్లోంచి జారిపడి రెండుకాళ్లూ కోల్పోయిన అభాగ్యుడు
► పరిహారం కోసం వేడుకొన్నా స్పందన లేదు
► ఆశలు ఆవిరై ఇంటికే పరిమితమైన చాంద్‌బాషా
► బిడ్డను చూస్తూ కుమిలిపోతున్న తల్లిదండ్రులు
ఓ ప్రమాదం ఒక యువకుడి ఆశలను ఆవిరిచేసింది. అవిటివాడిగా మార్చేసింది. ఎవరోఒకరు ఎత్తుకుని తీసుకువెళ్తేనే అడుగుపడేది. నేలపై చేతులతో పాక్కొంటూ వెళ్లాల్సిన దుస్థితి. ఉన్నత చదువులు చదివి ఇంటికి ఆసరాగా ఉంటాడనుకొన్న ఒక్కగానొక్క కొడుకు ఇంటికే పరిమితం కావడం కన్నవారు తట్టుకోలేకపోతున్నారు. ప్రమాదం జరిగి ఐదేళ్లయినా ఎవరూ స్పందించని వైనమిది.
బి.కొత్తకోట(చిత్తూరు): రైలు నుంచి జారిపడిన సంఘటన ఓ యువకుడి జీవితాన్ని అంధకారంలోకి నెట్టేసిన వైనమిది. గోళ్లపల్లెకు చెందిన ఎన్.బాషాఖాన్‌కు ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరు కుమార్తెలు. ఎన్.చాంద్‌బాషా కుమారుడు. 2012 జనవరిలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు పుస్తకాల కోసం తిరుపతికి వెళ్లాడు. అక్కడి నుంచిగుంతకల్లు ప్యాసింజర్ రైలులో తిరుగు ప్రయాణమయ్యాడు. గోళ్లపల్లెకు సమీపంలోని తుమ్మనగుట్ట రైల్వే స్టేషన్‌లో దిగేందుకు తలుపువద్దకు వచ్చాడు. నీరసం అనిపించడంతో వాష్‌బేసిన్‌లో నీళ్లతో ముఖం కడుక్కొని బయటకు వస్తుండగా ప్రమాదవశాత్తూ రైలునుంచి కిందకు పడిపోయాడు. రెండుకాళ్లు తొడలపై భాగం వరకు తెగిపోయాయి.
చికిత్సకోసం మదనపల్లెకు అక్కడి నుంచి తిరుపతి రుయా తరలించారు. అనంతరం చెన్నైలోని రైల్వే ఆస్పత్రికి తరలించగా ఉచిత వైద్యం అందించారు. చాంద్‌బాషా రెండుకాళ్లను పూర్తిగా కోల్పోయాడు. అప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. నడవాలన్న ఆశతో ఉచితంగా ఇచ్చిన కత్రిమ కాలి భాగాలను తెచ్చుకొన్నాడు. వాటితో మట్టిరోడ్లపై నడిచేందుకు వీలుపడలేదు. అయినా సాహసించడంతో ఆ కత్రిమ కాళ్లూ దెబ్బతిన్నాయి. వీటిని కూడా వినియోగించే వీలులేకపోయింది.
పరిహారం వస్తుందని..
ఇలాంటి ప్రమాదాల సందర్భంలో రైల్వేశాఖ పరిహారం ఇస్తుందని బాషా కుటుంబానికి తెలిసింది. దీంతో ఆశలు చిగురించాయి. అయితే సమస్య అప్పుడే మొదౖలైంది. ప్రమాద సంఘటనపై అనంతపురం జిల్లా కదిరి రైల్వే పోలీసులు కేసు నమోదు చేయాల్సి ఉంది. ప్రమాదంపై కేసు వివరాలు ఇవ్వాలని వీరు రైల్వే పోలీసులను కోరారు. అసలు కేసే నమోదు చేయలేదని వారు చెప్పారు. అయినా వదలకుండా తెలిసిన వారి సహాయంతో పలుమార్లు వెళ్లాడు. ఫలితం లేకపోయింది. కేసు నమోదు చేయనప్పుడు చెన్నై రైల్వే ఆస్పత్రిలో చాంద్‌బాషాకు ఉచితంగా వైద్యం ఎలా అందిస్తారు అన్నది ప్రశ్నార్థకం. కనీసం తనకు రైల్వే పోలీసులు ఎఫ్‌ఐఆర్ కాపీని ఇస్తే పరిహారం కోసం అర్ధిస్తామంటున్నారు ఈ కుటుంబ సభ్యులు. బి.కొత్తకోట మండల పర్యటకు వచ్చిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును చాంద్‌బాషా కలిసి విన్నవిం చాడు. విజయవాడకు రావాలని కోరారు. కష్టపడి వెళ్లిన చాంద్‌బాషా నిరాశతో వెనుదిరిగి వచ్చాడు.
తండ్రి ఉద్యోగం కోసం
చాంద్‌బాషా తండ్రి బాషాఖాన్ రైల్వేలో గ్యాంగ్‌మన్‌గా పనిచేస్తూ రిటైర్డ్ అయ్యాడు. అంతకుముందు కొడుక్కి ఈ ఉద్యోగం ఇప్పించేందుకు వాలంటరీ రిటైర్‌మెంట్ ఇచ్చేందుకు ముందుకొచ్చినా ఉన్నతాధికారులు కాళ్లులేని వ్యక్తి ఈ ఉద్యోగం చేయలేడని నిరాకరించారు. పూర్వ కలెక్టర్ సిద్ధార్థజైన్ బదిలీకి ముందు చాంద్‌బాషా చిత్తూరు వెళ్లి కలిశాడు. ఏదైనా ఉద్యోగం ఇవ్వాలని వేడుకోగా న్యాయం చేస్తానని అభయమిచ్చారు. అయితే మరుసటిరోజే బదిలీ అయ్యారు. ప్రస్తుతం రిటైరైన తండ్రి బాషాఖాన్‌కు వచ్చే పింఛన్ సొమ్మే కుటుంబానికి ఆధారమైంది. ప్రమాదం జరగకుండా ఉంటే బిడ్డ ప్రయోజకుడయ్యేవాడని తండ్రి బాషాఖాన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఉద్యోగం సంపాదించాలన్న బలమైన కోరికతో చాంద్‌బాషా డిగ్రీ పరీక్షలు రాస్తున్నాడు.