పోలీసునని బెదిరించి యువతిపై అత్యాచారం
సూళ్లూరుపేట: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో శనివారం రాత్రి వేనాటి రాజశేఖర్‌రెడ్డి అనే యువకుడు తాను పోలీసునని బెదిరించి యువతిపై అత్యాచారం చేశాడు. బాధితురాలు పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసింది. నిందితుడు రాజశేఖర్‌రెడ్డి విద్యార్థి సంఘ నాయకుడిగా, పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరించేవాడు. లాఠీ పట్టుకుని వలంటీర్‌గా పోలీసులకు సహకరిస్తుండేవాడు.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన కొమ్మల శ్రీనివాసులు, అతడితో పరిచయం ఉన్న సూళ్లూరుపేట మండలం జంగాలగుంటకు చెందిన యువతి శనివారం రాత్రి చెంగాళమ్మ ఆలయానికి వెళ్లారు. వారు ఆలయం పక్కనే ఉన్న కట్టమీదకు వెళ్లడాన్ని గమనించిన రాజశేఖర్‌రెడ్డి వెంబడించాడు. తాను పోలీసునని చెప్పి లాఠీతో శ్రీనివాసులును కొట్టి బెదిరించి పంపి ఆ యువతిపై అత్యాచారం చేశాడు.
తర్వాత బాధితురాలు బీట్ తిరుగుతున్న ఏఆర్ పోలీసులను గమనించి వారిని ఆశ్రయించింది. బాధితురాలిని గూడూరు డీఎస్పీ చౌడేశ్వరి విచారించారు. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడు రాజశేఖర్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.