సాక్షి ప్రతినిధి, కాకినాడ/అమలాపురం: ‘మేనిఫెస్టో అంటే కులానికొక పేజీ కాదు. వెబ్‌సైట్‌లో ఎప్పుడూ ఉండాలి. దానిని కనిపించకుండా తీసేస్తే మోసం చేసినట్టే. గత మేనిఫెస్టోలో 650 హామీలిచ్చి టీడీపీ మోసం చేసింది. వెబ్‌సైట్‌లో మేనిఫెస్టోను కూడా తీసేసింది. దానిలోని అంశాలను ఎందుకు అమలు చేయలేదని ప్రజలు అడగాలి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సమయంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజల్ని ఆలోచింపజేశాయి. ఉగాది పండగ నాడు ఆయన విడుదల చేసిన మేనిఫెస్టోపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ఇది అన్ని వర్గాలకూ మేలు చేసేదిగా ఉందని పలువురు కితాబు ఇస్తున్నారు. ‘మేనిఫెస్టో విడుదల చేయడమే కాకుండా దానిలో పెట్టిన అంశాలు అమలు చేసినప్పుడే విలువ ఉంటుంది. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేసి చూపించి ప్రజలను ఓట్లు అడిగే పరిస్థితి రావాలి’ అని జగన్ చెప్పడం మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. వైఎస్ ఫ్యామిలీ మాట ఇస్తే నిలబడుతుందని, తమ బతుకులకు భరోసా వచ్చిందని అన్నీ వర్గాల వారూ అంటున్నారు.
రైతుకు వరాలు
రైతు భరోసా పథకం కింద రైతుకు పెట్టుబడి సహాయం కల్పిస్తారు. తొలి ఏడాది మినహా మిగిలిన నాలుగేళ్లూ ఏటా మే నెలలో రూ.12,500 చొప్పున రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. దీనివల్ల తొలకరి వరి సాగుతో పాటు ఉద్యాన, వాణిజ్య పంటల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. దీనివల్ల జిల్లాలో 4.50 లక్షల మంది వరి, 80 వేల మంది కొబ్బరి, 25 వేల మంది ఆయిల్‌పామ్, మరో 30 వేల మంది ఉద్యాన పంటల రైతులు, 29 వేల మంది కూరగాయలు పండించే రైతులకు, ఏజెన్సీలో కొండపోడు వ్యవసాయం చేసే రైతులకు.. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలో కనీసం 6.50 లక్షల మంది రైతులకు రైతు భరోసా వల్ల మేలు కలగనుంది. వీరందరూ ఏటా రూ.812.50 కోట్ల మేర పెట్టుబడి సహాయం పొందనున్నారు. వరిసాగుకు ఎకరాకు రూ.35 వేల వరకూ పెట్టుబడి అవుతుంది. డెల్టాలో రెండు పంటలు పండిస్తుండగా, మెట్ట, ఏజెన్సీల్లో ఒక పంట పండుతోంది. రైతుకు రూ.12,500 అంటే ఎకరం, అరెకరం ఉన్న చిన్న, సన్నకారు రైతులకు సాగుకు అయ్యే పెట్టుబడిలో మూడో వంతు అందినట్టే.
- పంటల బీమా కోసం ఖరీఫ్‌లో రైతు చెల్లించే 2 శాతం, రబీలో 1.50 శాతాన్ని ప్రభుత్వమే నేరుగా చెల్లిస్తుంది. బ్యాంకుల నుంచి రుణాలు పొందిన రైతులకు బ్యాంకులే బీమా చేయిస్తాయి. కౌలుదారులు, రుణాలు పొందలేని జిల్లాలోని సుమారు 1.80 లక్షల మంది రైతులు కూడా బీమా పరిధిలోకి రానున్నారు. దీనివల్ల రైతులకు ఖరీఫ్‌లో రూ.720, రబీలో రూ.540 చొప్పున కలిసిరానుంది.
- రైతులకు ఉచితంగా బోర్లు వేయడం వల్ల మెట్ట, ఏజెన్సీ రైతులకు మేలు జరగనుంది. మెట్టలో ప్రాంతాలనుబట్టి బోరు వేసేందుకు రూ.50 వేల నుంచి రూ.1.50 లక్షల వరకూ ఖర్చవుతుంది. ఆ మేరకు రైతులకు ప్రయోజనం కలగనుంది.
- వ్యవసాయానికి పగటి పూట తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా వల్ల జిల్లాలో సుమారు 2.50 లక్షల మంది రైతులకు మేలు జరగనుంది. మెట్ట, ఏజెన్సీలో వరితో పాటు వాణిజ్య పంటల రైతులు, కోనసీమలో కొబ్బరి రైతులకు దీనివల్ల ప్రయోజనం కలగనుంది. ఇప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఏడు గంటల పాటు అది కూడా విడతల వారీగా మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తోంది.
- ఆక్వా రైతులు వినియోగించే విద్యుత్‌కు యూనిట్‌కు రూ.1.50 చొప్పున మాత్రమే వసూలు చేస్తామని జగన్ ప్రకటించారు. గడచిన ఆరు నెలల నుంచి ఇది రూ.2గా ఉంది. అంతకుముందు రూ.4 ఉండేది. యూనిట్‌కు అర్ధరూపాయి తగ్గడం వల్ల జిల్లాలోని 16 వేల మంది ఆక్వా రైతులకు మేలు జరగనుంది.
- రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని ప్రకటించడం వల్ల జిల్లాలోని అన్ని పంటల రైతులకూ భరోసా లభించింది. పంటల కనీస మద్దతు ధరలు తగ్గే అవకాశం లేనందున వ్యవసాయంలో నష్టాలు చూసే అవకాశం ఉండదని రైతులు భావిస్తున్నారు. మొత్తం మీద సుమారు 6.50 లక్షల మంది రైతులకు దీనివలన మేలు జరగనుంది.
- ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రూ.4 వేల కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తమవుతోంది. దీనివలన తూర్పు, మధ్య డెల్టాలతో పాటు పిఠాపురం బ్రాంచ్ కెనాల్(పీబీసీ)లో 2.80 లక్షల ఎకరాల మేర ముంపు బారిన పడి నష్టపోయే రైతులకు అన్నివిధాలా మేలు జరగనుంది. ప్రకృతి వైపరీత్యాలకు భయపడి తీరంలో ఏటా ఐదు వేల ఎకరాల్లో వరి సాగు చేయని విషయం తెలిసిందే.
- నియోజకవర్గ కేంద్రాల్లో గోదాములు, శీతల గిడ్డంగుల ఏర్పాటు వల్ల రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను వాటిల్లో నిల్వ చేసుకునే సౌలభ్యం కలుగుతుంది.
- రెండో ఏడాది నుంచి సహకార డైరీకి పాలు పోసే రైతులకు లీటరుకు రూ.4 బోనస్ ఇవ్వనున్నారు. దీనివల్ల జిల్లాలో సుమారు 3.50 లక్షల మంది పాడిరైతులకు ప్రయోజనం కలగనుంది.
- ప్రమాదవశాత్తూ లేదా ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు వైఎస్సార్బీమా ద్వారా రూ.7 లక్షల పరిహారం అందించనున్నారు.
- వీటితో పాటు రైతు ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ రద్దు, నకిలీ విత్తనాలు, కల్తీ పురుగు మందుల నివారణకు చట్టం చేయడం, దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లోనే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ మంజూరు, కౌలు రైతులకు, భూ యజమానులకు ఇబ్బందులు లేకుండా పంటపై హక్కు, పంట రుణాలు, కౌలు రైతులకు పంట కాల వ్యవధిలో అన్ని రాయితీలు, సబ్సిడీలు అందిస్తామనడం వంటివన్నీ మేలు చేసేవిగా ఉన్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇతర విశేషాలివీ..
- అన్ని రకాల వ్యాధులూ ఆరోగ్యశ్రీ పరిధిలోకి. రెండేళ్లలో కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపర్చడం.
- బీసీ సంక్షేమానికి ఏటా రూ.15 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.75 వేల కోట్ల కేటాయింపు.
- రాజకీయ ఎదుగుదల కోసం నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్.
- నామినేటెడ్ కాంట్రాక్ట్ పనుల్లో 50 శాతం కేటాయింపు.
- బీసీ చెల్లెమ్మల వివాహానికి ప్రస్తుతం ఇస్తున్న రూ.35 వేలు రూ.50 వేలకు పెంపు.
- ప్రమాదవశాత్తూ మరణించిన బీసీ కులాల వారికి రూ.5 లక్షల పరిహారం
- నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం.
- మత్స్యకారులకు వేట భృతి రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంపు
- ప్రమాదవశాత్తూ మరణించిన మత్స్యకారుల కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం.
- మగ్గం ఉన్న చేనేత కుటుంబానికి ఏటా రూ.24 వేలు
- కులవృత్తిదారులు, తోపుడు బండ్లతో ఫుట్‌పాత్‌లపై వ్యాపారం చేసుకునేవారికి సున్నా వడ్డీకే రూ.10 వేల రుణం.
- కాపులకు ఏడాదికి రూ.2 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.10 వేల కోట్ల కేటాయింపు.
- ఇంకా వివిధ మతాల వారు, ఉద్యోగులు, ఇతర వర్గాల వారికి కూడా మేలు చేసే విధంగా రూపొందించిన వైఎస్సార్ సీపీ మేనిఫెస్టో పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
అన్ని వర్గాలకూ ఆమోదయోగ్యమైనదిగా..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టో అన్ని వర్గాలకూ ఆమోదయోగ్యంగా ఉంది. రైతులకు రూ.50 వేలు, వడ్డీలేని రుణాలు, ఉచితంగా బోర్లు వేయడం మంచి నిర్ణయం. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడం వల్ల రైతులకు ఎంతో ఉపయోగం. ఆరోగ్యశ్రీకి పూర్వవైభవం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి రూ.10 వేలు ఫించన్ వంటి పథకాలు బాగున్నాయి.
– గొల్ల చిన్ని, రాజోలు
మహిళలకు, విద్యార్థులకు భరోసా మేనిఫెస్టో
మహిళలకు, విద్యార్థులకు మేనిఫెస్టోలో జగన్‌మోహన్ రెడ్డి వెల్లడించిన అమ్మ ఒడి పథకం, మహిళలకు దశలవారీగా రూ.75 వేలు రుణం, పేదలందరికీ పక్కా ఇళ్లు, ఆ ఇళ్లను అక్కచెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేయడం బాగున్నాయి. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు, గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి ఉద్యోగ కల్పన వంటివి ఆకట్టుకుంటున్నాయి.
– వీరా బుజ్జి, మెరకపాలెం
Comments
Please login to add a commentAdd a comment