
మానికొండలో భారీ అగ్నిప్రమాదం
- 25 గుడిసెలు, మూడు గృహాలు దగ్ధం
- రూ.10 లక్షల ఆస్తి నష్టం
- వలస కూలీల కష్టం బూడిదపాలు
మానికొండ (ఉంగుటూరు), న్యూస్‌లైన్ : పొట్టకూటి కోసం వలస వచ్చిన కూలీల జీవితాలతో అగ్నిదేవుడు ఆడుకున్నాడు. జిల్లాలు దాటి ఊరుగాని ఊరు వచ్చిన వలస కూలీల నివాసం ఉన్న 25 గుడిసెలు, మూడు గృహాలు కాలిబూడిదయ్యాయి. ఈ ఘటన మండలంలోని మానికొండలో గురువారం జరిగింది. దీంతో స్థానిక ఓ రైతు ఇంట ఆశ్రయం పొందిన నిల్వ కూలీలు కట్టుబట్టలతో మిగిలిపోయారు. దాదాపు రూ.10 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.
నల్లగొండ జిల్లా కట్టంగూడెం మండలం దువ్వినెల్ల గ్రామానికి చెందిన 25 కుటుంబాలవారు మానికొండలోని కొంతమంది రైతుల వద్ద చెరుకు పనుల కోసం కొద్దిరోజుల క్రితం వచ్చారు. గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ఘటన జరిగింది. విద్యుత్ కోత అనంతరం రెండు గంటలకు కరెంట్ వచ్చిందని, ఆ తర్వాత పది నిమిషాలకు ఈ ఘటన జరిగిందని, షార్ట్‌సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. గుడిసెల్లో ఉన్న మినీ గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు మరింత చెలరేగాయి.
పక్కనే ఉన్న గుగిళ్ల పెద సాంబయ్య, ఉమాశంకర్, రాణి, సుబ్రమణ్యంలకు చెందిన మూడు ఇళ్లు కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. ప్రమాదం జరిగిన సమయంలో కూలీలందరూ పనులకు వెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విషయం తెలిసిన కూలీలు అక్కడికి చేరుకుని కష్టమంతా బూడిదైందని గగ్గోలు పెడుతున్నారు. వారి రోదనలతో ఘటనాస్థలి దద్దరిల్లింది. బాధితులకు తక్షణ సాయం కింద రూ.5 వేలు చొప్పున అందించినట్లు తహశీల్దారు వి.మురళీకృష్ణ తెలిపారు.
వలస కూలీలను ఆదుకోనాలి
అగ్ని ప్రమాదంలో నష్టపోయిన వలస కూలీలను అన్నిరకాలుగా ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి అధికారులను కోరారు. సంఘటన స్థలంలో దృశ్యాలను చూసి చలించిపోయారు. పొట్టకూటి కోసం వచ్చిన కూలీలు తీవ్రంగా నష్టపోవటంతో కట్టుబట్టలే మిగిలాయని, వారిని మానవతాదృక్పథంతో ఆదుకోవాలని జిల్లా అధికారులను కోరారు. జిల్లా రైతు కన్వీనరు కొల్లి రాజశేఖర్, మండల మహిళా అధ్యక్షురాలు సూరెడ్డి శ్రీమణిమ్మ, యూత్ నాయకుడు దుట్టా రవిశంకర్, సర్పంచ్ జి.కృష్ణబాబు తదితరులు బాధితులను పరామర్శించారు.