తారీఖు లేకుండా మహిళా యూనివర్సిటీ మాజీ రెక్టార్ సుబ్బారావు ఇచ్చిన కాంట్రాక్ట్ లెక్చరర్ సర్వీసు సర్టిఫికెట్ , ఎస్వీయూలో అసోసియేట్ ప్రొఫెసర్‌కు దరఖాస్తుపై నాట్ ఎలిజిబుల్ అని రాసి కొట్టేసిన దృశ్యం (ఫైల్)
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఆరు దశాబ్దాల చరిత్ర ఉన్న తిరుపతిలోని ఎస్వీయూలో ఒక మహిళకు ఉన్నత పదవి దక్కింది. అయితే ఆ అరుదైన అవకాశం పొందిన ఆ అధికారి అనతి కాలంలోనే తన ప్రవర్తన, అహంకారం, అధికార దర్పంతో వర్శిటీ ప్రతిష్ట మసకబారేలా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె అధికార పార్టీ మాజీ ఎమ్మెల్యే కోడలు కావడం, ఆర్థిక, సామాజిక, రాజకీయ బలం తోడు కావడంతో ఎస్వీయూలో ఆమెకు ఎదురులేకుండా పోయింది. అనేక ఆరోపణల నడుమ మాజీ రిజిస్ట్రార్ దేవరాజులు పదవి కోల్పోవడంతో 2017లో అప్పటి వీసీ దామోదరం హోంసైన్స్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆర్కే అనురాధకు రిజిస్ట్రార్ పదవిని కట్టబెట్టారు. ఆమె రిజిస్ట్రార్ అయిన తొలిరోజుల్లో బాగా పని చేసినా అనంతరం పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
దొడ్డిదారిన అందలం...
శ్రీ వెంకటేశ్వరా యూనివర్శిటీ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్ ఆర్కే అనురాధ 2007లో హోంసైన్స్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. 2006లో ఎస్వీయూలో విడుదలైన అధ్యాపక పోస్టుల భర్తీకి ఆమె అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవంగా ఈ పోస్టుకు దరఖాస్తు చేయాలంటే సంబంధిత సబ్జెక్ట్‌లో ఎంఎస్సీ, పీహెచ్‌డీతో పాటు 5 సంవత్సరాల బోధన అనుభవం ఉండాలి. ఈ సర్వీసు రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసి ఉంటేనే చెల్లుబాటు అవుతుంది. అయితే ఆమె ఎస్వీయూ, మహిళా వర్శిటీలో తాత్కాలికంగా పనిచేసిన బోధన అనుభవానికి సంబంధించి నకిలీ సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకున్నారని, ఈ నియామకాలకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన (స్క్రూటినీ)లో ఆమె దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు రాశారు. అయితే ఆమె చేసిన ఫైరవీలు ఫలించడంతో అదే దరఖాస్తుపై ఎలిజిబుల్ అని రాశారని అంతే కాకుండా దీనికి జతపరచిన బోధన అనుభవం సర్టిఫికెట్‌లో తేదీ లేకుండా జారీ చేశారు. ఈ ధృవ పత్రాలతో నేరుగా అసోసియేట్ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. 2013లో ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందటంతో పాటు 2017 నవంబర్ 30న ఎస్వీయూ రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు.
ఆంతా ఆమె ఇష్టమే...
ఎస్వీయూ రిజిస్ట్రార్ అనురాధ వీసీలను, వారి ఆదేశాలను పాటించకుండా, వారు ఆమోదించిన ఫైళ్లను పక్కన పెట్టి తన ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఆమె రిజిస్ట్రార్ అయ్యాక ఇద్దరు వీసీలు మారారు. ప్రొఫెసర్ దామోదరం వీసీగా ఉన్న సమయంలో ఉద్యోగుల బదిలీల ఫైళ్లను పక్కన పెట్టి అమలు చేయలేదు. ఆయన ఆమోదించిన రసాయన శాస్త్ర విభాగాధిపతి ఫైల్‌ను పెండింగ్‌లో ఉంచి నూతన వీసీ వచ్చాక తన సామాజిక వర్గ ప్రొఫెసర్‌కు ఆ పోస్టు కట్టబెట్టారు. రాజీవ్ గాంధి కాన్పరెన్స్ హాల్ నిర్మాణ టెండర్ల ఫైల్‌ను వీసీ ఓకే చేసినా ఇప్పటికీ అమలుచేయలేదు. అంబేడ్కర్ గ్లోబల్ లా కళాశాలకు శాశ్వత అనుబందానికి సంబంధించిన ఫైల్ వీసీ దామోదరం ఆమోదించినప్పటికీ .. రిజిస్ట్రార్ నేటికీ ఉత్తర్వులు ఇవ్వలేదు. ఇన్‌చార్జ్ వీసీగా జానకి రామయ్య హయాంలో ఉద్యోగి ఫైల్ ట్యాంపరింగ్ కేసులో ఆయన వేసిన విచారణ కమిటీ ఇచ్చిన ఫైల్‌ను తొక్కిపెట్టారు. సైకాలజీ విభాగాధిపతిగా ప్రొఫెసర్ శ్రీకాంత్ రెడ్డికి ఇవ్వకుండా ఇతరులకు ఇచ్చారు.
వివాదాస్పద నిర్ణయాలు...
ఎస్వీయూ రిజిస్ట్రార్‌గా తన 18 నెలల పాలనలో పలు వివాదస్పద నిర్ణయాలను తీసుకున్నారు. అకడమిక్ స్టాప్ కళాశాలలో అసోసియేట్‌గా పనిచేస్తున్న కోదండరామిరెడ్డికి ప్రొఫెసర్‌గా పదోన్నతి ఇవ్వలేదు. అదే విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న వెంకటరమణకు మాత్రం పదోన్నతి కల్పించారు. ఏడుగురు టైం స్కేల్ ఉద్యోగులను తొలగిస్తూ గత నెలలో 22న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఉద్యోగుల ఆందోళనతో వీసీ ఈ ఉత్తర్వులు రద్దు చేశారు. ఆంత్రొపాలజీ విభాగంలో ఒక అధ్యాపకుడికి 13 సంవత్సరాలు, అడల్ట్ ఎడ్యుకేషన్ విభాగంలో మరో అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు 6 సంవత్సరాలు పాత సర్వీసు కలిపారు. ఈ వ్యవహారంలో ఫైల్ ట్యాంపరింగ్ చేసిన ఉద్యోగిపై చర్యలు తీసుకోలేదు. ఎన్‌ఎంఆర్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఎంటీఎస్ ఇవ్వాలని ప్రభుత్వం జీఓ ఇచ్చినా అమలు చేయలేదు. అంతే కాకుండా వీరిని వచ్చే ఏడాదికి కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఉన్నత విద్యాశాఖ ఇటీవల రిజిస్ట్రార్ల సమావేశంలో ఆదేశించినా అమలు చేయలేదు. తన స్వంత సామాజిక వర్గానికి చెందిన కొందరు అధ్యాపకులకు పెద్ద ఎత్తున మేలు చేశారన్న విమర్శలు ఉన్నాయి.
పట్టించుకోని వీసీ
ఎస్వీయూ రిజిస్ట్రార్ అనురాధ వ్యవహారంలో అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ ప్రస్తుత వీసీ రాజేంద్రప్రసాద్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతే కాకుండా ఆమె ఎక్కువ సమయం వీసీ చాంబర్‌లోనే తిష్ట వేస్తుండటంతో చాలా మంది తమ సమస్యలు చెప్పుకోలేక పోతున్నారు. వీసీని నిర్ణయాలు తీసుకోకుండా పెత్తనం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
సమాచారహక్కు చట్టంతో రహస్యం బట్టబయలు...
ఎస్వీయూ రిజిస్ట్రార్ నియామకంపై కొందరు విద్యార్థి నాయకులు సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరడంతో అమె అడ్డదారి నియామకం బయట పడింది. దీనిపై ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థి సంఘ నాయకులు గత నెల 30న అమరావతిలో సీఎంను కలిసి ఫిర్యాదు చేశారు. అంతకు ముందు వారు ఎస్వీయూ వీసీ రాజేంద్రప్రసాద్‌తో పాటు ఉన్నత విద్యామండలిలోని ముఖ్య అధికారులను కలసి ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటి వరకు ఆమెపై చర్యలు తీసుకోలేదు.
స్పందించని రిజిస్ట్రార్
ఎస్వీయూలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై రిజిస్ట్రార్ అనురాధను వివరణ కోరేందుకు సాక్షి ప్రయత్నించింది. అయితే ఆమె ఫోన్ తీయలేదు. వేరొక నెంబర్ నుంచి ఫోన్ చేసి సాక్షి రిపోర్టర్‌ను మాట్లాడుతున్నాను అని చెబుతుండగానే ఆమె ఫోన్ కట్ చేసేశారు.
Comments
Please login to add a commentAdd a comment