వారేమీ ఉన్నత చదువులు చదువుకున్న వారు కాదు.
అవయవదానంపై పలువురి అభినందన
విజయవాడ సిటీ: వారేమీ ఉన్నత చదువులు చదువుకున్న వారు కాదు. అలాగని ఆర్థికంగా స్థితిమంతులూ కాదు. కాని వారి ఆశయం ముందు ఇవేవీ పనికిరావని నిరూపించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తోట మణికంఠ కుటుంబం చేసిన త్యాగాన్ని నగర ప్రజలు అభినందిస్తున్నారు. బ్రెయిన్ డెడ్ కావడంతో గుండె సహా అవయవ దానం చేసిన వారి మంచి మనస్సుకు నగరవాసులు చలిం చారు. గుండెను సకాలంలో గన్నవరం విమానాశ్రయం చేర్చేందుకు గ్రీన్ చానల్ ఏర్పాటు చేసి పోలీసులు సహకరిస్తే.. మరో మనిషికి పునర్జన్మ ఇచ్చే గుండెను తీసుకెళుతున్న అంబులెన్స్‌కు మార్గం మధ్యలో రోడ్డుపై ప్రజలు ఆప్యాయంగా వీడ్కోలు పలికారు.
గ్రీన్ చానల్‌తో సహకారం : నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ క్లిష్టమైనప్పటికీ.. గ్రీన్ చానల్ ఏర్పాటు ద్వారా గుండెను గన్నవరం ఎయిర్‌పోర్టు వరకు సజావుగా తీసుకెళ్లేందుకు గట్టి చర్యలు చేపట్టారు.
జీవన్‌దాన్ ప్రతినిధుల కోరిక మేరకు సీపీ ఎ.బి. వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు శుక్రవారం మధ్యాహ్నం నుంచే ట్రాఫిక్ పోలీసులు రోడ్లపైకి వచ్చి గ్రీన్‌చానల్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. గుంటూరు జిల్లా పోలీసులతో సమన్వయం చేసుకుంటూ మార్పులు చేర్పులు చేశారు. కనకదుర్గమ్మ వారధి నుంచి పశువుల ఆస్పత్రి జంక్షన్ మీదుగా బందరురోడ్డుపై బెంజిసర్కిల్ వరకు, అక్కడి నుంచి రామవరప్పాడు రింగ్ ద్వారా గన్నవరం విమానాశ్రయం వరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి అంబులెన్స్ వెళ్లేందుకు మార్గం సుగమం చేశారు. దీంతో 27 నిమిషాల వ్యవధిలోనే గుండె విమానాశ్రయం చేరింది. సీపీ మాట్లాడుతూ..మంచి పనులకు పోలీసు సహకారం ఉంటుందన్నారు. కారు యజమాని నీరజ్ స్నేహితుడు ఉదయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. మంచి పనులు చేసేం దుకు ఎప్పుడూ సిద్ధమేనన్నారు.
హాట్సాఫ్
నిజంగా మణికంఠ కుటుంబం చేసిన పనికి ప్రతి ఒక్కరూ హ్యాట్సాఫ్ చెప్పాలి. మణికంఠ రోడ్డు ప్రమాదం కేసు నేనే దర్యాప్తు చేస్తున్నాను. పెద్దగా చదువుకున్న కుటుంబం కాకపోయినా ఉన్నతంగా ఆలోచించారు. వారు అవయవాలను దానం చేసినట్టు తెలిసి ఎంతగానో ఉద్వేగానికి లోనయ్యా. వారి నిర్ణయం ప్రతి ఒక్కరినీ ఆలోచింప జేసింది.
- గిరి అశోక్‌కుమార్,
రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం మాజీ సహాయ కార్యదర్శి