అన్నీ మీవారికేనా?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా తెలుగుదేశం పార్టీలో గ్రూపుల గోల మార్కెట్‌కెక్కింది. ఇటీవల మార్కెట్ కమిటీల పాలకవర్గాలను ప్రభుత్వం రద్దు చేసి కొత్త కమిటీల నియామకానికి కసరత్తు చేస్తున్న నేపథ్యంలో జిల్లాలో మార్కెట్ కమిటీ పదువులు చేజిక్కించుకునేందుకు పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు ఈ పదవుల విషయంలో తమ సామాజిక వర్గానికే మేలు చేసేందుకు పావులు కదుపుతుండగా.. వారిని నిలదీసేందుకు సైతం ఆశావహులు వెనుకాడటం లేదు. ఫలితంగా పార్టీలో చాలా కాలంగా ఉన్న గ్రూపు విభేదాలు సామాజికవర్గ స్థాయికి విస్తరిస్తున్నాయి. పార్టీ నేతలు ఒకరినొకరు దూషించుకోవడం, తమ వారికే పదవులివ్వాలని పట్టుబట్టడం వంటి పరిణామాలతో పార్టీ పరువు బజారున పడుతోంది.
తాజాగా మార్కెట్ కమిటీ పదవుల విషయంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే భర్త, మాజీ ఎమ్మెల్యే గుండ అప్పలసూర్యనారాయణను పలువురు నేతలు ఆయన ఇంటికి వెళ్లి మరీ అసంతృప్తి వెళ్లగక్కడం, నిలదీయడం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. కొద్దిరోజుల క్రితం గార తదితర మండలాలకు చెందిన నేతలు అప్పలసూర్యనారాయణ ఇంటికి వెళ్లి పదవుల పంపిణీ విషయంలో ఎన్నాళ్ల నుంచో తమలో గూడుకట్టుకున్న అసంతృప్తిని వెళ్లగక్కారు. టీడీపీ పరంగా ఎంపీపీ, జెడ్పీటీసీ తదితర పదవులను ప్రధానమైన కాళింగ, వెలమ సామాజిక వర్గాల మధ్య సమాన ప్రాతిపదికన పంపిణీ చేస్తూ వస్తున్నారు.
అయితే ఈసారి సంప్రదాయానికి భిన్నంగా మార్కెట్ కమిటీ పదవులు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుసుకున్న గార మండల టీడీపీ నాయకులు ఆగ్రహంతో వచ్చి మాజీ ఎమ్మెల్యేను గట్టిగా నిలదీశారు. ‘అన్నీ మావారికేనా.. మా సామాజికవర్గానికి అవకాశాలు ఇవ్వరా?’ అని గట్టిగా ప్రశ్నించడంతోపాటు తమ వారికి ఈసారి అవకాశం ఇవ్వకపోతే పార్టీని వీడి వెళ్లిపోవడం తథ్యమని కూడా హెచ్చరించినట్టు తెలిసింది. మార్కెట్ కమిటీ విషయంలో తలెత్తిన ఈ సమాజికవర్గ పోరు మరింత ముదిరి త్వరలో జరగనున్న శ్రీకాకుళం మున్సిపల్ ఎన్నికలపై కూడా తీవ్ర ప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయి. మార్కెట్ కమిటీని సంప్రదాయం ప్రకారం వైశ్యులకు పదవి కట్టబెడతారా? లేక జనరల్‌కు కేటాయిస్తే.. ఏ సామాజిక వర్గానికి ఇస్తారన్నది కూడా ప్రస్తుతం చ ర్చనీయాంశమైంది.
ఈ అంశం ప్రస్తుతం అటు ఎమ్మెల్యే, ఎంపీల సామాజిక వర్గం మీద, ఇటు టీడీపీలోని ఇతర సామాజికవర్గ మధ్య విభేదాలు రాజేస్తోంది. ప్రభుత్వం నియమించే రాజకీయ పదవులన్నీ కచ్చితంగా వెలమ సామాజిక వర్గానికే కేటాయించాలన్న డిమాండ్ వినిపిస్తుంటే.. మరోవైపు గతంలో తమకు అన్యాయం జరిగినందున ఇప్పుడు దేవాలయ, మార్కెట్ కమిటీ పోస్టులన్నీ తమకే ఇవ్వాలని కాళింగ వర్గం పట్టు పడుతోంది. ఈ నేపథ్యంలోనే ‘గుండ’ ఇంట్లో జరిగిన వాదోపవాదాలు స్థానికంగా హాట్ టాపిక్‌గా మారాయి. కాగా కొన్ని పదవులను మరో సామాజికవర్గానికి కేటాయించేలా మంత్రి, ఎంపీ సహా ఇతర ఎమ్మెల్యేలతో మాట్లాడానని మాజీ ఎమ్మెల్యే వారికి సర్దిచెప్పడానికి ప్రయత్నించినట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో మార్కెట్ కమిటీల్లో సభ్యుల సంఖ్య పెంచితే తప్ప తమవారందరికీ న్యాయం జరిగేటట్లు లేదని, అసంతృప్తి మరింత పెరుగుతుందని పార్టీ నాయకులు ఇప్పటినుంచే ఆందోళన చెందుతున్నారు.