అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
Published Fri, Apr 1 2016 12:13 AM | Last Updated on Sun, Sep 3 2017 8:57 PM
పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతురాలి సోదరుడు
దర్యాప్తు ప్రారంభించిన ఏఎస్పీ సిద్దార్థ కౌశిల్
పార్వతీపురం : అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన పార్వతీపురంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు, మృతురాలి బంధువులు, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలసకు చెందిన సరస్వతి (25)కు గత ఏడాది అక్టోబరు 29న పార్వతీపురం నెహ్రూకాలనీకి చెందిన రాయల సంతోష్‌కు ఇచ్చి వివాహం చేశారు. వివాహ లాంఛనాల కింద లక్ష రూపాయల కట్నం, తులం బంగారం ఇచ్చారు. సరస్వతి కుటుంబ సభ్యులు మంగళవారం పార్వతీపురం వచ్చి సంతోషంగా ఉన్న తమ కుమార్తెను చూసి ఆనందంతో ఇంటికి వెళ్లారు. ఇంతలో గురువారం ఉదయం మీ కూతురు చనిపోయిందంటూ ఫోన్ చేశారని మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
భర్త, అత్తమామలే చంపేశారు..!
ఈ విషయమై మృతురాలి సోదరుడు అనుపోజు అప్పారావు మాట్లాడుతూ మంగళవారం నాటికి సంతోషంగా ఉన్న తన సోదరి సరస్వతిని భర్త, అత్తమామలే చంపేశారని ఆరోపించాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నాడు. గత అక్టోబర్ 29న సింహాచలంలో పెళ్లి చేశామన్నారు. తన సోదరి భర్త రాయల సంతోష్, అత్త ఈశ్వరమ్మ, మామ రామారావులు కలిసి చంపేసినట్లు ఆరోపించారు.
మద్యం మత్తులో...
భార్యాభర్తలిద్దరూ మేడపై పడుకుంటారని, గురువారం ఉదయం 6 గంటల సమయంలో ఇంట్లో మృతదేహాన్ని పట్టుకొని భర్త, అత్తమామలు, ఆ ఇంటికి వచ్చిన ఓ అతిథి కనిపించారని స్థానికులు చర్చించుకుంటున్నారు. మద్యం మత్తులో భార్యను చంపేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంట్లోనే పడిపోయి కోడలు మృతి చెందిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
ఏఎస్పీ దర్యాప్తు...
విషయం తెలుసుకున్న ఏఎస్పీ సిద్దార్థ కౌశిల్, సీఐ వి.చంద్రశేఖర్, పట్టణ ఎస్‌ఐ బి. సురేంద్రనాయుడు తన సిబ్బందితోపాటు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కుటుంబసభ్యులు, స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు.
Advertisement
Advertisement