భర్తతో దివ్వ(ఫైల్)
శ్రీకాకుళం, నరసన్నపేట: జిల్లాలో డెంగీ వ్యాధి మరణాలు ఆగడం లేదు. ఈ మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తుంది. ఈ మాయదారి జ్వరానికి గురువారం మరో ఇద్దరు బలైయ్యారు. నరసన్నపేటలో బాలింత, మెళియాపుట్టిలో విద్యార్థిని ప్రాణాలు విడిచారు. ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. వివరాలు ఇలావున్నాయి. మేజరు పంచాయతీ నరసన్నపేటలో జ్వరాలు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. వీరన్నాయుడు కాలనీకి చెందిన వెంకుమహంతి దివ్య(29) డెంగీ లక్షణాలతో ప్లేట్‌లైట్స్ పడిపోవడంతో మరణించింది.
ఈ నెల 15వ తేదీన పాపకు జన్మనిచ్చిన దివ్వ అమ్మ మాతృత్వాన్ని అనుభవించక ముందే లోకంవిడిచింది. నాలుగు రోజుల క్రితం ఇదే వీధికి చెందిన ప్రశాంతి అనే వివాహిత జ్వరంతో మృతి చెందింది. ఇప్పుడు దివ్వ చనిపోవడంతో వీరన్నాయుడు కాలనీ వాసులు భయాందోళలన చెందుతున్నారు. మరో మహిళ అనుపోజు సైలజ జ్వరంతో మూడు రోజులుగా బాధపడుతుంది. ఈమెకు ఏమవుతుందో అని కుటుంబ సభ్యులు భయపడుతున్నారు. మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం గురువారం తరలించారు. కాగా మూడు రోజుల క్రితం జ్వరంతో బాధపడిన దివ్వను తండ్రి చిట్టిబాబు స్థానిక వైద్యుల వద్ద తనిఖీలు చేయించినప్పటికీ తగ్గకపోవడంతో శ్రీకాకుళం కిమ్స్‌కు బుధవారం తీసుకువెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించింది. 2016 ఏప్రిల్‌లో సారవకోట మండలం అల్దుకు చెందిన హరికృష్ణ చరణ్‌తో దివ్వకు వివాహం అయింది. పాప పుట్టిన కొద్ది రోజులకే దివ్వను జ్వరం కబళించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కిమ్స్ వైద్యులు డెంగీ జ్వరంగానే గుర్తించారని దివ్వ సమీప బంధువు రఘుపాత్రుని శ్రీధర్ తెలిపారు. దీని కారణంగానే చనిపోయినట్టు వైద్యులు చెప్పారన్నారు.
అయితే స్థానిక వైద్యులు, గుప్పిడిపేట పీహెచ్‌సీ సిబ్బంది మాత్రం జ్వరం అని అంటున్నారు. ఈ సమాచారంతో కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. కాలనీ పరిసరాల్లో ఉన్న అపారిశుధ్యమే కారణమని కాలనీ వాసులు వాపోతున్నారు. జ్వరాలతో ప్రజలు బాధలు పడుతున్నట్టు పత్రికల్లో వచ్చిన వెంటనే ప్రభుత్వ వైద్యులు వచ్చి హడావుడి చేస్తున్నారని, తనిఖీలు చేస్తున్నా ప్రయోజనం ఉండటం లేదని అంటున్నారు. పరిసరాల్లో ఉన్న మురుగు కాలువల్లో నీరు నిల్వ ఉండటంతో దోమలు అధికంగా ఉంటున్నాయని దీంతో జ్వరాలు అధికంగా వస్తున్నాయని చెబుతున్నారు. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
విద్యార్థిని మృతి
మెళియాపుట్టి: మెళియాపుట్టిలోని కుమ్మరి వీధికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని టి.సంతు డెంగీ జ్వరంతో మృతి చెందినట్టు స్థానికులు భావిస్తున్నారు. గత నాలుగు రోజులుగా అనారోగ్యంగా ఉండేది. కుటుంబ సభ్యులు వైద్యం నిమిత్తం పర్లాకిమిడి ఆస్పత్రికి గురువారం తరలించారు. అక్కడి వైద్యులు సూచనల మేరకు శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యం అందించేలోపలే బాలిక వృతి చెందింది. బాలిక స్థానిక ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈమె తల్లిదండ్రులు పాతపట్నంలో నివాసం ఉండగా, బాలిక మెళియాపుట్టిలో తాతగారి ఇంటి వద్ద ఉంటూ ఇక్కడే చదువుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment