కాళ్లపారాణి ఆరకముందే...
రిమ్స్ క్యాంపస్ :మూడుముళ్లూ పడి మూడు నెలలు కూడా పూర్తికాలేదు. పెళ్లి సమయంలో పెట్టిన కాళ్ల పారాణి ఇంకా ఆరనేలేదు. నిండా పాతికేళ్లు నిండని యువతి ఉరివేసుకుని తనువు చాలించింది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం పట్టణం ఎ.ఎస్.ఎన్ కాలనీ వద్ద బ్యాంకర్స్ కాలనీలో నివాసముంటున్న మల్లేశ్వరరావు, యాకాశి దంపుతులకు కుమారుడు సూర్యప్రకాశ్, కుమార్తె రత్నకుమారి ఉన్నారు. సూర్యప్రకాశ్ డిగ్రీ పూర్తిచేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు. రత్నకుమారి శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో ఐదేళ్లుగా ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. ఆమెకు ఈ ఏడాది ఆగస్టు 15న దవళపేటకు చెందిన రాజేశ్వరరావుతో వివాహమైంది. రత్నకుమారి దంపతులు కూడా బ్యాంకర్స్ కాలనీలోనే తమ కన్నవారింటికి దగ్గర్లొనే అద్దెకు దిగారు.
సహోద్యోగి వేధింపులే కారణమా?
పెళ్లైనప్పటి నుంచి ఎంతో ఆనందంగా ఉన్న ఈ దంపతుల జీవితం ఒక్కసారిగా పెనుతుపానులా మారింది. రత్నకుమారి తన సహోద్యోగి అయిన హరితో మాట్లాడుతుండటాన్ని భర్త రాజేశ్వరరావు గమనించారు. మరోసారి అతనితో మాట్లడటం తగదంటూ మందలించాడు. శుక్రవారం రాత్రి రత్నకుమారి అన్నయ్య అయిన సూర్యప్రకాశ్ రత్నకుమారి సెల్‌ఫోన్‌తో హరికి ఫోన్ చేశాడు. ఇంకోసారి తన చెల్లితో మాట్లాడితే బాగోదంటూ హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య ఫోన్‌లో స్వల్ప వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. తర్వాత శనివారం ఉదయం 8 గంటలకు రాజేశ్వరరావు తన విధులకు బయలుదేరగా, సూర్యప్రకాశే ద్విచక్రవాహనంపై తీసుకుని వెళ్లి ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద దించాడు. అక్కడికి రాజేశ్వరరావు పనిచేస్తున్న కంపెనీ బస్సు రావటంతో దాంట్లో ఎక్కి ఆయన వెళ్లిపోయాడు.
ఏలా తెలిసిందంటే?
తిరిగి సూర్యప్రకాశ్ ఇంటికి వచ్చి తన తల్లి యాకాశిని చెల్లి ఇంటికి వెళ్లమని చెప్పి పంపించాడు. ఆమె ఇంటికి వెళ్లి చూసేసరికి ఇంటి బయట గెడ పెట్టి ఉండటంతో దాన్ని తీసి లోపలకు వెళ్లారు. లోపల గదిలో రత్నకుమారి ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఉండటాన్ని గమనించారు. వెంటనే కేకలు వేస్తూ సూర్యప్రకాశ్‌ను పిలవటంతో వచ్చి ఆ చీర ముడి విప్పటానికి ప్రయత్నించి, వీలుకాకపోవడంతో కత్తితో తెంచి రత్నకుమారిని కిందికి దించారు. కొనఊపిరి ఉండటంతో వెంటనే రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రత్నకుమారి మృతిచెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం త హశీల్దార్ దిలీప్ చక్రవర్తి పంచనామా చేపట్టారు. శ్రీకాకుళం పట్టణ ఇన్‌చార్జి సీఐ అయిన మహిళా పోలీసుస్టేషన్ సీఐ సూర్యనారాయణ, శ్రీకాకుళం రూరల్ పోలీసుస్టేషన్ ఇన్‌చార్జి అయిన ఒకటవ పట్టణ ఎస్‌ఐ కె.భాస్కరరావు సంఘటన స్థలాన్ని, మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హరి వేధించేవాడు
తన చెల్లెలు రత్నకుమారిని సహోద్యోగి అయిన హరి నిత్యం ఫోన్లో వేధించేవాడని సూర్యప్రకాశ్ తెలిపాడు. తన మాట్లాడవద్దని ఎన్నిసార్లు చెప్పినా మాట్లాడుతుండేవాడని రత్నకుమారి చెప్పిందన్నాడు. దీంతో శుక్రవారం రాత్రి ఫోన్ చేయంగా, ఎట్టి పరిస్థితిలోనూ మీ చెల్లెల్ని వదిలే ప్రసక్తే లేదంటూ హరి బెదిరించడాని పేర్కొన్నాడు. తన చెల్లిని హరే చంపి ఉంటాడని ఆనుమానం వ్యక్తం చేశాడు.
మృతిపై అనుమానాలు!
రత్నకుమారి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రత్నకుమారిది నిజంగా ఆత్మహత్యేనా... లేక ఎవరైనా హత్య చేసి ఉంటరా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భార్యాభర్తల మధ్య మూడు రోజులుగా హరి విషయమై వివాదం జరుగుతూ వస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రత్నకుమారి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని కొందరు చెబుతున్నారు.. అలాగని హత్య కాదని చెప్పేందుకు సరైన ఆధారాలు లేకుండా పోయాయి. ఇంటి బయట గడియ పెట్టి ఉంది. ఇంటి లోపల నుంచి కూడా బయట గడియ పెట్టే అవకాశం ఉంది. అయినంత మాత్రాన ఇంటి లోపల ఆత్మహత్య చేసుకోవటానికి సిద్ధపడ్డ రత్నకుమారి లోపల గడియ పెట్టుకోకుండా బయట గడియ గ్రిల్ తలుపు లోపల నుంచి చెయ్యిపెట్టి మరీ వేయాల్సిన అవసరం ఏముందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి మెడపై మాత్రం ఉరివేసుకున్నట్లు అచ్చులున్నాయి. అయితే నిజంగా ఆత్మహత్యేనా? లేదా హత్య చేసి ఉరి వేశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నారుు. అసలు రత్నకుమారిది హత్యే అయి ఉంటే బాధ్యులెవరన్నది ప్రశ్నర్థకంగానే మిగిలింది. ఇక పోస్టుమార్టం రిపోర్టు అధారంగా పోలీసుల విచారణలో అసలు గుట్టు బయటపడనుంది.