ఒంగోలు: మార్టూరు ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిసింది. 2014 ఏప్రిల్ 6వ తేదీ తొలిదశలోనే మార్టూరులోని ఆరు ఎంపీటీసీ స్థానాలకు ఓటింగ్ జరిగినప్పటికీ హైకోర్టు ఆదేశాలతో కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. దీనిపై తాజాగా ఈనెల 5వ తేదీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి ఆదేశాలతో గురువారం స్థానిక పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. తొలుత బ్యాలెట్ బాక్సులను పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో తెరిచి లెక్కించారు. వైఎస్సార్‌సీపీ 2 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకోగా... టీడీపీ మిగిలిన నాలుగు ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. కౌంటింగ్‌కు రిటర్నింగ్ అధికారిగా జిల్లా పరిశ్రమలశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ సాంబయ్య, మార్టూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి సింగయ్య అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా వ్యవహరించారు. జిల్లా పరిషత్ సీఈవో ఏ.ప్రసాదు, డిప్యూటీ సీఈవో నర శింహారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
అంబేద్కర్ నగర్ ప్రాదేశికంలో టీడీపీ అభ్యర్థి మురికిపూడి ప్రభుదాస్‌కు 794 ఓట్లురాగా ప్రత్యర్థి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తమ్ములూరి శ్యామలకు 715 ఓట్లు లభించాయి. దీంతో 79 ఓట్లతో టీడీపీ విజయం సాధించింది. గొట్టిపాటి నగర్ ప్రాదేశికంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బండి దాసుకు 777 ఓట్లు లభించగా, టీడీపీ అభ్యర్థి కొత్తపల్లి దేవదాసుకి 715 ఓట్లు వచ్చాయి. దీంతో 62 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ గెలుపొందింది. తాండా ప్రాదేశికంలో టీడీపీ అభ్యర్థి వేముల దిబ్బయ్య 146 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. గన్నవరం రోడ్డు ప్రాదేశికానికి ముగ్గురు అభ్యర్థులు పోటీపడగా టీడీపీ అభ్యర్థి కారుసాల మాలింబి 70 ఓట్ల ఆధిక్యంతో విజయాన్ని కైవసం చేసుకుంది. రాంనగర్ ప్రాదేశికానికి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి కుమారి 45 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు.
జనార్థన్ కాలనీ ప్రాదేశికానికి రీకౌంటింగ్ జనార్థన్ కాలనీ ప్రాదేశికంలో మొత్తం ఓట్లు 2536. పోలైన వి 2097. వీటిలో 25 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. అర్హమైన ఓట్లు 2072. వీటిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రమావత్ గౌరీభాయికి 1040 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి బుజ్జిభాయి భూక్యాకు 1031 ఓట్లు లభించాయి. వీరితోపాటు ఈ ప్రాదేశికంలో స్వతంత్ర అభ్యర్థిగా మరియమ్మభాయి అంగోత్ పోటీపడ్డారు. ఆమెకు కేవలం ఒక్క ఓటే వచ్చింది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా కేవలం 9 కావడం, మరో వైపు తిరస్కరణకు 25 ఓట్లు తిరస్కరణకు గురికావడంతో ఏజెంట్లు రీకౌంటింగ్ పెట్టాలంటూ అధికారులకు సూచించారు. దీంతో అధికారులు తిరిగి రీకౌంటింగ్ ప్రక్రియ పూర్తిచేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటించారు.
19న మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక:
ఈనెల 19న మార్టూరు మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోఆప్టెడ్ మెంబర్ల ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. దీనికిగాను ఈనెల 15న నోటిఫికేషన్ జారీచేయాలి. ఉదయం 10 గంటలలోగా కోఆప్టెడ్ మెంబర్ల ఎన్నికకు సంబంధించి నామినేషన్లు దాఖలు చేసుకోవాలి. 12 గంటలలోపు నామినేషన్ల పరిశీలన పూర్తిచేయాలి. 12 గంటలకు అర్హత పొందిన నామినేషన్ల వివరాలను అధికారులు ప్రకటించాలి. మధ్యాహ్నం ఒంటిగంటలోపు నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉంది. ఒంటిగంటకు పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటిస్తారు. ఈ సందర్భంగా అభ్యర్థులచేత ప్రమాణస్వీకారం పూర్తి చేయించి కోఆప్టెడ్ మెంబర్ల ఎన్నిక నిర్వహించి ఫలితాన్ని ప్రకటిస్తారు. సాయంత్రం 3 గంటలకు తిరిగి అభ్యర్థుల్ని సమావేశపరిచి మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక నిర్వహించి ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
ముగిసిన మార్టూరు ఎంపీటీసీల ఓట్ల లెక్కింపు
Published Fri, Dec 12 2014 2:20 AM | Last Updated on Sat, Sep 2 2017 6:00 PM
Advertisement