Marturu
-
అమెరికా వెళ్లిన ఏడు నెలలకే..
మార్టూరు: ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి ఏడు నెలలకే అనుమానాస్పదస్థితిలో అర్ధంతరంగా తనువు చాలించాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాపట్ల జిల్లా మార్టూరు మండలం జొన్నతాళి గ్రామానికి చెందిన గోవాడ రమేష్ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు గోవాడ నాగసాయి గోపి అరుణ్ కుమార్ (22) ఇంజినీరింగ్ పూర్తి చేసి ఎంఎస్ చదవడం కోసం గతేడాది ఆగస్టులో అమెరికా వెళ్లాడు. లాంనార్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతూ టెక్స్‌పోర్టన్ ఏరియాలో ఐదుగురు స్నేహితులతో కలిసి నివాసం ఉంటుండగా, వారితో ఒక యువతి కూడా ఉంటోంది. ఈ క్రమంలో మార్చి 1న అరుణ్ కుమార్ స్నేహితులకు కనిపించకుండా పోవడంతో గదిలోని స్నేహితురాలి ఫిర్యాదు మేరకు అమెరికా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు మార్చి 3వ తేదీన అరుణ్‌కుమార్ మృతదేహాన్ని వారి నివాసానికి సమీపంలో ఓ నీటి సరస్సులో గుర్తించి స్నేహితులకు, ఇండియాలోని తండ్రి రమేష్‌కు సమాచారం అందించారు. శవ పరీక్ష అనంతరం అరుణ్‌కుమార్ మృతదేహాన్ని అతని స్నేహితులు స్వంత ఖర్చులతో ఇండియా పంపగా.. శనివారం మధ్యాహ్నం స్వగ్రామం జొన్నతాళి చేరింది. పోస్టుమార్టం నివేదిక వస్తేనే కానీ అరుణ్‌కుమార్ మృతికి కారణం తెలియదని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి తమ కుటుంబాన్ని ఆదుకుంటాడని ఆశించి అమెరికా పంపిస్తే శవమై తిరిగి వస్తాడని ఊహించలేదంటూ కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు వర్ణనాతీతం. సాయంత్రం గ్రామంలో అరుణ్‌కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు. -
Volunteer Shantabai: ఎంపీపీగా వలంటీర్!
మార్టూరు: అదృష్టం ఎవరిని ఎప్పుడు వెతుక్కుంటూ వస్తుందో ఎవరూ చెప్పలేరు. అందుకు ఉదాహరణ గ్రామ వలంటీర్‌గా ప్రస్థానం ప్రారంభించి మార్టూరు మండల అధ్యక్షురాలిగా అధికార పీఠం ఎక్కనున్న భూక్యా శాంతాబాయి. ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలోని నాగరాజుపల్లి తండాకు చెందిన శాంతాబాయి బీకాం, బీఈడీ పూర్తి చేసింది. మార్టూరు తండాకు చెందిన ఇంజనీరింగ్ పట్టభద్రుడు బాణావత్ బాబు నాయక్‌తో వివాహమైంది. మార్టూరులో గ్రామ వలంటీర్‌గా పనిచేస్తున్నది. అయితే మార్టూరు ఎంపీపీ పదవి ఎస్టీ మహిళకు రిజర్వు కావడంతో స్థానిక జనార్ధన కాలనీ ప్రాదేశికం నుంచి ఎంపీటీసీగా బరిలోకి దిగింది. టీడీపీకి చెందిన తన ప్రత్యర్థిపై 1,184 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచింది. మండలంలోని 21 మంది ఎంపీటీసీలలో ఎస్టీ కేటగిరీ కింద మరెవ్వరూ అభ్యర్థులు లేకపోవడంతో ఎంపీపీగా శాంతాబాయి ఎన్నిక లాంఛనమే. మండలంలోని ఎంపీటీసీలందరిలోకి ఆమె పిన్న వయసు్కరాలు కావడం విశేషం. నిస్వార్థంగా ప్రజా సేవ చేస్తా.. గత ఆగస్టులో ఆడబిడ్డకు జన్మనిచచ్చిన నేను నెల తిరక్కుండానే ఎంపీపీ కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సీఎం జగన్ పురుషులతో సమానంగా మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించడం నచ్చి రాజకీయాల్లో వచ్చా. మండల ప్రజలందరి అభివృద్ధి కోసం పాటు పడతా. – శాంతాబాయి -
నాన్న ఉత్తరం చూశాక కన్నీళ్లు ఆగలేదు..
సాక్షి, అమరావతి బ్యూరో: కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల కోసం ఒత్తిడిని భరించలేక పారిపోయి హైదరాబాద్‌లోని ఓ రిసార్టులో తలదాచుకున్న ప్రతిభావంతుడైన విద్యార్థిని విజయవాడ పోలీసులు కాపాడి సోమవారం తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. గత ఏడాది నవంబరు 27వ తేదీన కళాశాల నుంచి అదృశ్యమైన విద్యార్థి తన ఆవేదనను ‘సాక్షి’కి వివరించాడు. ‘నాపేరు మాతూరి జగదీష్ సాయి. మాది ప్రకాశం జిల్లా మార్టూరు మండలం. నాన్న నాయీబ్రాహ్మణ వృత్తిలో ఉన్నారు. నాకు పదో తరగతిలో 9.3 గ్రేడ్ వచ్చింది. నన్ను బాగా చదివించాలనే తపనతో విజయవాడ నిడమానూరులోని చైతన్య కళాశాలలో ఎంపీసీ గ్రూపులో చేర్పించారు. కానీ ఇక్కడి పరిస్థితులు, అధ్యాపకుల తీరు, ఫీజుల కోసం పదేపదే గుర్తు చేసే యాజమాన్యం తీరుతో నవంబర్ 27 తెల్లవారుజామున కళాశాల నుంచి వెళ్లిపోయి హైదరాబాద్ చేరుకుని ఓ రిసార్టులో క్యాటరింగ్ పనిలో చేరా. కొద్ది రోజుల తరువాత తల్లిదండ్రులు గుర్తొచ్చారు. కానీ వారికి ముఖం ఎలా చూపించాలో అర్థం కాలేదు. నాకు బావ వరుస అయ్యే సాయితేజ్‌ని డిసెంబరు 14న నా స్నేహితుడి ఫేస్బుక్ ఖాతా ద్వారా పలకరించా. అందులో మా నాన్న రాసిన ఉత్తరం చూశాక కన్నీళ్లు ఆగలేదు. నేను క్షేమంగానే ఉన్నా, నాకోసం వెతకొద్దని మెసేజ్ పెట్టా. తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఆదివారం పోలీసులతో కలసి నా వద్దకు వచ్చిన నాన్నను చూడగానే ఏడుపు ఆగలేదు. క్షమించమని కోరా. ఆయన అక్కున చేర్చుకుని ఓదార్చడం చూశాక ఇక ఎప్పుడూ ఇలాంటి పని చేయకూడదని నిర్ణయించుకున్నా’ అని జగదీష్ తెలిపాడు. విద్యార్థి అదృశ్యంపై నవంబరు 28న ఫిర్యాదు అందుకున్న విజయవాడ పటమట పోలీసులు పలు మార్గాలో కేసు దర్యాప్తు జరిపారు. ఫేస్బుక్ ఖాతాను విశ్లేషించి విద్యార్థి జాడను గుర్తించారు. నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు సమక్షంలో విద్యార్థిని తల్లిదండ్రులకు అప్పగించారు. బాగా చదువుకోవాలనుకున్నా. కానీ కళాశాల పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఫీజు కట్టాలని పదేపదే ఒత్తిడి చేయడంతో మనస్తాపంతో కాలేజీ నుంచి పారిపోయా – జగదీష్ సాయి -
సమస్యను గుర్తిస్తే విజయం మీ సొంతమే
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్ధుల్ కలామ్ మార్టూరు: శనివారం రాత్రి మార్టూరులోని శారదానికేతన్ పబ్లిక్ స్కూల్ భవన సముదాయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్ధుల్ కలామ్ ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. తన ఇంట్లో తాతయ్య సూక్తులు చెబుతున్నట్టుగా ఆయన ఉపన్యాసం సాగింది. ఇటు ఉపాధ్యాయులకు, అటు విద్యార్థులకు, తల్లిదండ్రులకు ... సమాజానికి ... ఎవరేమి చేయాలో ఆ సందేశంలో ప్రస్తావించారు. మార్టూరు ఎందుకు వచ్చానో తెలుసా... పోలినేని సుబ్బారావు అనే మానవతావాది గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు లేని పిల్లలకు అన్ని వసతులు కల్పించి ఒక గొప్ప పాఠశాలను ప్రారంభించారు ... ఇది ఎంతో స్ఫూర్తిదాయం ... పదుగురూ దీన్ని ఆదర్శంగా తీసుకోవాలంటూ తన ఉపన్యాసాన్ని ప్రారంభించారు. అనాథలు కాకూడదనే.. శారదానికేతన్ ఫౌండర్ పోలినేని సుబ్బారావు మాట్లాడుతూ తన చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారని, తన పెదనాన్న, పెద్దమ్మలే పెంచారన్నారు. అన్న నాగేశ్వరరావే తను చదువుకోవటానికి కారణమన్నారు. తాను కోల్పోయిన బాల్యపు మధురసృ్కతులు ఎవ్వరు కోల్పోకూడదనే అనాధలకు బాసటగా నిలుస్తూ ఈ పాఠశాలను స్ధాపించానన్నారు. 2010లో పేద పిల్లలను చేర్చుకున్నామని, 2011లో హైచ్‌ఐవి సోకిన విద్యార్థులను కూడా పాఠశాలలో చేర్చుకుంటున్నామన్నారు. తన ఆస్తి మొత్తాన్ని పాఠశాలకే రాసిచ్చానన్నారు. తన భార్య వెంగ మాంబ, కుమార్తె కవిత, తన కుటుంబ సభ్యుల సహకారం మరువలేనిదన్నారు. పదిమందికి మంచి చేస్తే అరోగ్యం అదే వస్తుందని గాంధీజీ సూక్తే నాకు స్ఫూర్తి అని అన్నారు. కలాంకు ఘన స్వాగతం... కలాంకు పోలినేని సుబ్బారావు, రాష్ట్రమంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, శిద్ధారాఘవరావు, పర్చూరు ఎంఎల్ఏ ఏలూరి సాంబశివరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్, ఎస్పీ శ్రీకాంత్, డీఎస్పీ సి.జయరామరాజు, గ్రామానికి చెందిన ప్రముఖులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, యువకులు ఘన స్వాగతం పలికారు. ⇒ అపజయానికి కారణమేమిటో ... ఆ సమస్య మెలిక ఎక్కడుందో మీరు గుర్తించండి... విజయం మీ సొంతమవుతుంది. ⇒ తల్లి ఆనందంగా ఉంటే ప్రాంతం,రాష్ట్రం, దేశం,ప్రపంచం సంతోషంగా ఉంటుంది. అందుకే మీ అమ్మా,నాన్నలను గౌరవించండి . ⇒ ఉన్నత చదువులు చదివి ... డిగ్రీలు వరుసగా సాధించి ... పతకాలు మెడలో వేసుకుంటే సరిపోదు ... విలువలతో కూడిన విద్య అవసరం. అప్పుడే అసలైన ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ⇒ విద్యార్థ్ధులు చిన్నప్పటి నుంచే ధైర్యాన్ని అలవరుచుకోవాలి... ప్రతి అంశాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాసను పెంపొందించుకోవాలి. ⇒ నేను పది సంవత్సరాల వయస్సులో ఐదో తరగతి చదువుతున్నప్పుడు శివసుబ్రమణ్యం అనే ఉపాధ్యాయుడు తమిళం, సంసృ్కతం, కెమిస్ట్రీ ఇలా అన్ని రంగాల్లో బోధించేవారు. ఒక రోజు నల్లబల్లపై పక్షులు ఆకాశంలో ఎగిరే బొమ్మను వేశారు ... ఆప్పుడు ఆ బొమ్మను చూసి ఆకాశంలో పక్షి ఎలా ఎగురుతుందనే ప్రశ్న తలెత్తింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనే తపనతోనే ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో చేరాను. అధ్యాపకుడిగా, సైంటిస్ట్‌గా, రాష్ట్రపతిగా ఇలా ఎన్ని పదవులు అలంకరించా. ⇒ ఎన్ని పదవులు అధిరోహించినా బోధనా వృత్తే నాకు ఇష్టం. ⇒ తామస్ ఆల్వా ఎడిసన్, లైటును, మేడం క్యూరీ రేడియంను,ఇంటర్ నెట్‌ను తిమోతీ బెర్నర్‌లీ, సర్ సీవీ రామన్ వంటి శాస్త్రజ్ఞులు 20వ శతాబ్దంలోనే తవ విజ్ఞానంతో ప్రపంచానికి వెలుగులు ఇచ్చారు ... వారి జీవిత చరిత్రలను చదవండి ... వారి అడుగు జాడలే మీకు దిక్సూచికలు కావాలి. ⇒ సమస్యలను అధిగ మించితేనే విజయం సొంతం అవుతుంది. అపజయానికి కారణాలేమిటో తెలుసుకోండి ... విజయసోపానాలు మీ ముందు వాలుతాయి. ⇒సృజనాత్మక విద్య అవసరం ...కంఠస్థా చేసి పరీక్షల్లో రాసి మార్కులు సాధించడం విద్య కాదు. ⇒ ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా వ్యక్తిత్వమే మనిషిని ఉన్నతంగా నిలుపుతుంది. ⇒ ప్రతి చెట్టు 20 కిలోల కార్భన్ డైయాక్సైడ్‌ను పీలుస్తుంది. అంటే ప్రతి విద్యార్థి ఓ మొక్కను నాటితే 20 కిలోల ఆక్సిజన్‌ను సమాజానికి అందించినట్టే కదా... అందుకే అందరూ మొక్కలు నాటాలి. విద్యార్థులే ఇందుకు ఆదర్శంగా నిలవాలి. ⇒ విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. -
ముగిసిన మార్టూరు ఎంపీటీసీల ఓట్ల లెక్కింపు
ఒంగోలు: మార్టూరు ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిసింది. 2014 ఏప్రిల్ 6వ తేదీ తొలిదశలోనే మార్టూరులోని ఆరు ఎంపీటీసీ స్థానాలకు ఓటింగ్ జరిగినప్పటికీ హైకోర్టు ఆదేశాలతో కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. దీనిపై తాజాగా ఈనెల 5వ తేదీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి ఆదేశాలతో గురువారం స్థానిక పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. తొలుత బ్యాలెట్ బాక్సులను పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో తెరిచి లెక్కించారు. వైఎస్సార్సీపీ 2 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకోగా... టీడీపీ మిగిలిన నాలుగు ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. కౌంటింగ్‌కు రిటర్నింగ్ అధికారిగా జిల్లా పరిశ్రమలశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ సాంబయ్య, మార్టూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి సింగయ్య అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా వ్యవహరించారు. జిల్లా పరిషత్ సీఈవో ఏ.ప్రసాదు, డిప్యూటీ సీఈవో నర శింహారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అంబేద్కర్ నగర్ ప్రాదేశికంలో టీడీపీ అభ్యర్థి మురికిపూడి ప్రభుదాస్‌కు 794 ఓట్లురాగా ప్రత్యర్థి వైఎస్సార్సీపీ అభ్యర్థి తమ్ములూరి శ్యామలకు 715 ఓట్లు లభించాయి. దీంతో 79 ఓట్లతో టీడీపీ విజయం సాధించింది. గొట్టిపాటి నగర్ ప్రాదేశికంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి బండి దాసుకు 777 ఓట్లు లభించగా, టీడీపీ అభ్యర్థి కొత్తపల్లి దేవదాసుకి 715 ఓట్లు వచ్చాయి. దీంతో 62 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీ గెలుపొందింది. తాండా ప్రాదేశికంలో టీడీపీ అభ్యర్థి వేముల దిబ్బయ్య 146 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. గన్నవరం రోడ్డు ప్రాదేశికానికి ముగ్గురు అభ్యర్థులు పోటీపడగా టీడీపీ అభ్యర్థి కారుసాల మాలింబి 70 ఓట్ల ఆధిక్యంతో విజయాన్ని కైవసం చేసుకుంది. రాంనగర్ ప్రాదేశికానికి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి కుమారి 45 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. జనార్థన్ కాలనీ ప్రాదేశికానికి రీకౌంటింగ్ జనార్థన్ కాలనీ ప్రాదేశికంలో మొత్తం ఓట్లు 2536. పోలైన వి 2097. వీటిలో 25 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. అర్హమైన ఓట్లు 2072. వీటిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి రమావత్ గౌరీభాయికి 1040 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి బుజ్జిభాయి భూక్యాకు 1031 ఓట్లు లభించాయి. వీరితోపాటు ఈ ప్రాదేశికంలో స్వతంత్ర అభ్యర్థిగా మరియమ్మభాయి అంగోత్ పోటీపడ్డారు. ఆమెకు కేవలం ఒక్క ఓటే వచ్చింది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా కేవలం 9 కావడం, మరో వైపు తిరస్కరణకు 25 ఓట్లు తిరస్కరణకు గురికావడంతో ఏజెంట్లు రీకౌంటింగ్ పెట్టాలంటూ అధికారులకు సూచించారు. దీంతో అధికారులు తిరిగి రీకౌంటింగ్ ప్రక్రియ పూర్తిచేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటించారు. 19న మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక: ఈనెల 19న మార్టూరు మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోఆప్టెడ్ మెంబర్ల ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. దీనికిగాను ఈనెల 15న నోటిఫికేషన్ జారీచేయాలి. ఉదయం 10 గంటలలోగా కోఆప్టెడ్ మెంబర్ల ఎన్నికకు సంబంధించి నామినేషన్లు దాఖలు చేసుకోవాలి. 12 గంటలలోపు నామినేషన్ల పరిశీలన పూర్తిచేయాలి. 12 గంటలకు అర్హత పొందిన నామినేషన్ల వివరాలను అధికారులు ప్రకటించాలి. మధ్యాహ్నం ఒంటిగంటలోపు నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉంది. ఒంటిగంటకు పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటిస్తారు. ఈ సందర్భంగా అభ్యర్థులచేత ప్రమాణస్వీకారం పూర్తి చేయించి కోఆప్టెడ్ మెంబర్ల ఎన్నిక నిర్వహించి ఫలితాన్ని ప్రకటిస్తారు. సాయంత్రం 3 గంటలకు తిరిగి అభ్యర్థుల్ని సమావేశపరిచి మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక నిర్వహించి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. -
రియల్ రూటెటు?
- అయోమయంలో క్రయవిక్రయదారులు - కొనసాగుతున్న వ్యాపారుల మాయజాలం - అప్పుడు గుంటూరు.. ఇప్పుడు మార్టూరు! - రెండింటి నడుమన చిలకలూరిపేట చిలకలూరిపేట: రాష్ట్ర రాజధాని విషయంలో రోజుకో విధంగా వస్తున్న వార్తలు, జరుగుతున్న ప్రచారం చిలకలూరిపేట ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం రూటును మార్చేస్తున్నాయి. సీఎం చంద్రబాబు గతంలో చేసిన ప్రకటనలు.. తాజాగా శివరామకృష్ణన్ కమిటీ నివేదికలోని అంశాల కారణంగా భూములు, స్థలాల క్రయవిక్రయదారులు తీవ్ర అయోమయూనికి గురవుతున్నారు. ఈ సందిగ్ధ స్థితిని సొమ్ము చేసుకునేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు యత్నిస్తున్నారు. గుంటూరు-విజయవాడ ప్రాంతాల్లో ఉన్న సారవంతమైన వ్యవసాయ భూముల్లో రాజధాని నిర్మించటం సరికాదని, దీనికి మార్టూరు-వినుకొండ-దోనకొండ ప్రాంతం సానుకూలంగా ఉంటుందని శివరామకృష్ణన్ కమిటీ తన నివేదికలో పేర్కొనటంతో అందరి దృష్టి చిలకలూరిపేట ప్రాంతంపై పడింది. ప్రకాశం జిల్లాలోని మార్టురు చిలకలూరిపేట పట్టణం నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నియోజవర్గానికి సరిహద్దు ప్రాంతం కూడా, మార్టూరు ప్రాంతానికి చెందిన అత్యధిక మందికి చిలకలూరిపేటతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు ఉన్నారుు. విద్య, వైద్యం తదితర అవసరాల కోసం చిలకలూరిపేటనే ఆశ్రయిస్తుంటారు. దీంతో మార్టూరు ప్రాంతంలో రాజధాని ఏర్పాటయితే చిలకలూరిపేట నియోజకవర్గం భారీఎత్తున అభివృద్ధి చెందుతుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రచారం ప్రారంభించారు. దీంతో ఇక్కడి భూముల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం క్రయవిక్రయూలు పెద్దగా లేకపోయినా రాజధాని పేరిట రేట్ల దూకుడుపై ప్రచారం మాత్రం పెద్దఎత్తున కొనసాగుతోంది. - గతంలో కొండవీడు అభివృద్ధి, టైక్స్‌టైల్ పార్కు, స్పైసెస్ పార్కుల ఏర్పాటు, బైపాస్ రోడ్డు నిర్మాణం వంటి అంశాలు ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి దోహదపడ్డాయి. తర్వాత అవి అటకెక్కటంతో క్రయవిక్రయూలు పడకేశాయి. ప్రస్తుతం రాజధాని ప్రచారంతో జిల్లాకు సంబంధించిన వారే కాక రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చిలకలూరిపేటవైపు దృష్టి సారించటంతో భూములు, స్థలాలకు డిమాండ్ పెరుగుతోంది. - చిలకలూరిపేట పట్టణానికి సమీపంలోని భూములతోపాటు యడ్లపాడు, నాదెండ్ల ప్రాంతాల్లో ఎకరం భూమి ధర రూ. 85 లక్షల నుంచి కోటీ 10 లక్షల రూపాయల వరకు చేరింది. 16వ నంబర్ జాతీయ రహదారి వెంబడి ఉన్న భూములకు మరింత ఎక్కువ ధర పలుకుతోంది. కొంతమంది ప్రజాప్రతినిధులు ఎకరాలకు ఎకరాల భూములను గుంటూరు-చిలకలూరిపేటల మధ్య కొనుగోలు చేశారని సమాచారం. - ఈ ప్రాంతానికి చెందిన ప్రవాసాంధ్రులు తమ బంధువుల ద్వారా భూముల గురించి ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కొంతమంది తాము కొనుగోలు చేసిన భూములను లేఅవుట్లుగా మార్చి ప్లాట్లు విక్రరుుంచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు గుంటూరు వైపు ఉన్న భూముల క్రయవిక్రయూలు జోరుగా జరగ్గా.. ప్రస్తుతం మార్టూరు వైపు ఉన్న భూములకు డిమాండ్ పెరుగుతోంది. -
అక్షరాస్యత పెరిగితేనే అభివృద్ధి
మార్టూరు : అక్షరాస్యత శాతం పెరిగితేనే అభివృద్ధి సాధ్యమని కలెక్టర్ విజయ్‌కుమార్ పేర్కొన్నారు. సమాజంలో గుర్తింపు రావాలన్నా.. మంచి జీవితం గడపాలన్నా విద్య ఎంతో అవసరమన్నారు. మార్టూరు జెడ్పీహెచ్ఎస్లో శనివారం బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత కలెక్టర్ మాట్లాడారు. వివిధ కార్యక్రమాలు నిర్వహించి పిల్లలు బడిబయట లేకుండా చూడాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. చదువుకుంటే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని, డబ్బుతో కూడా పనిలేదన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఆరు నుంచి 14 ఏళ్లలోపు వయసున్న పిల్లలు పాఠశాలలో ఉండేలా చూడాలన్నారు. విద్య మంచి ఆలోచనా శక్తిని, జ్ఞానాన్ని పెంపొందిస్తుందన్నారు. బడిఈడు పిల్లలను బడిలో చేర్చడంలో మార్టూరు మండలం ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తోందని చెప్పారు. పిల్లలంతా పాఠశాలలకు వచ్చేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు కూడా పిల్లలు పాఠశాలకు వెళ్లేలా చూడాలని కోరారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ.. ఇప్పటికీ వందకు 29 మంది విద్యార్థులు బడి బయట ఉన్నారని, వారిని పాఠశాలలో చేర్పించాలన్నారు. డీఈఓ విజయభాస్కర్ మాట్లాడుతూ.. బడిబయట ఉన్న పిల్లలను ఇప్పటికే పాఠశాలలో చేర్పించామని స్పష్టం చేశారు. ఇంకా ఎవరైనా బడి బయట ఉంటే బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా పాఠశాలకు వచ్చేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ తిరుపతి కిషోర్‌బాబు, ఎంపీడీఓ సింగయ్య, మార్టూరు సర్పంచ్ దేవుని దయానాయక్, మార్టూరు జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం జెన్నెట్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రాష్ట్రాన్ని విడగొడితే ఊరుకోం
మార్టూరు, న్యూస్‌లైన్ :రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని ఉద్యోగులు, విద్యార్థులు హెచ్చరించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా మార్టూరులో గురువారం మహాగర్జన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు హాజరై తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మార్టూరు తహ సీల్దార్ సుధాక ర్‌బాబు మాట్లాడుతూ సమైక్య రాష్ట్రం కోసం సీమాంధ్రలో ఉన్న ప్రజలందరూ ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఏ ఒక్కరి సొత్తు కాదన్నారు. ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ కె.వెంకట్రావు మాట్లాడుతూ సీమాంధ్ర రాజకీయ నాయకులంతా తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పదవులకు రాజీనామా చేయకుంటే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. ఏపీ ఎన్జీవో సభకు హెదరాబాద్ వెళ్లి తిరిగి వస్తున్న ఉద్యోగులపై రాళ్లదాడి చేసినా సీమాంధ్ర రాజకీయ నాయకులు నోరు మెదపలేదని ధ్వజమెత్తారు. రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు ఉద్యమంలో చురుగ్గా పాల్గొనాలని వెంకట్రావు విజ్ఞప్తి చేశారు. జాతీయ రహదారిపై భారీ ర్యాలీ మార్టూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తొలుత సేవ్ ఆంధ్రప్రదేశ్ ఆకారంగా ఏర్పడ్డారు. అనంతరం జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. జై సమైక్యాంధ్ర.. నినాదంతో జాతీయ రహదారి మార్మోగింది. గన్నవరం సెంటర్ నుంచి నాగరాజుపల్లి సెంటర్ వరకు వర్షంలో ర్యాలీ కొనసాగింది. తర్వాత గన్నవరం సెంటర్లో మానవహారంగా ఏర్పడ్డారు. అనంతరం కళాకారులు కోలాటం ప్రదర్శించారు. ఎన్సీసీ విద్యార్థులు సమైక్యాంధ్ర కోసం రోడ్డుపై కవాతు చేశారు. మూతపడిన దుకాణాలు మార్టూరు మహాధర్నా కారణంగా దుకాణాలన్నీ మూతపడ్డాయి. సుమారు గంటపాటు జాతీయ రహదారిపై ధ ర్నా జరగటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. కార్యక్రమంలో మార్టూరు, బల్లికురవ ఎంఈవోలు కిషోర్‌బాబు, నాగేశ్వరరావు, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక అధ్యక్షుడు గోపి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఎన్జీవోలు, వ్యవసాయశాఖ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. సాయి చిహ్నిత, హర్షిణి, రాయల్ కాలేజీ, రాయల్ స్కూల్, శ్రీనివాస స్కూల్, కాకతీయ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు.