
మాటలే..చేతలేవీ?
సాక్షి, నెల్లూరు: నెల్లూరుకు వచ్చినపుడల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు జిల్లా అభివృద్ధికి సంబంధించిన హామీలను గుప్పించడం తప్ప ఏ ఒక్క హామీనీ నెరవేర్చక పోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. తాజాగా శుక్రవారం జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి పాడిందే పాడరా... అన్నట్లు పారిశ్రామిక కారిడార్, పర్యాటక హబ్, కోస్తాకారిడార్ అంటూ మరోమారు హామీలతో ఊదరగొట్టారు.
మాటలతో సరిపెట్టడం తప్ప బాబు ప్రభుత్వం పైసా విదల్చకపోవడంతో జిల్లా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోయింది. ఇచ్చిన ఒక్క హామీని ఇప్పటివరకూ చంద్రబాబు నెరవేర్చిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి కాగానే ఇటు బాబు అటు కేంద్రమంత్రి వెంకయ్యలు నెల్లూరు మెడికల్ కళాశాల ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు నెల్లూరు నగరంతో పాటు జిల్లాకు వరాల జల్లుల కురిపించారు.
నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు సంగం బ్యారేజీ నుంచి తాగునీటి పథకం, భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి రూ.1500 కోట్లను హడ్కోరుణం ఇస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. ఈ రుణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల్లోనే గ్యారంటీ ఇస్తుందని ముఖ్యమంత్రి అక్కడికక్కడే మాట ఇచ్చారు. ఇద్దరి మాటలు నమ్మి అధికారులు రెండు పథకాల కోసం ప్రతిపాదనలు పంపారు.
అయితే రాష్ట్ర ఆర్థిక శాఖ వాటిని చెత్త బుట్టలోవేసిన విషయం తెలిసిందే. పైగా వేలకోట్ల రుణం ఎలాతీరుస్తారని? ఏమి చూసి నెల్లూరు కార్పొరేషన్‌కు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని ఆర్థిక శాఖ అధికారులు ఛీవాట్లు పెట్టడం తెలిసిందే. పైగా డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ లేకుండా ఎలా ప్రతిపాదనలు పంపుతారంటూ ఇంజనీరింగ్ అధికారులు కార్పొరేషన్ అధికారులకు మొట్టి కాయలు వేశారు. దీంతో ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి మాటలు నీటిమూటలే అని తేలిపోయింది.
శుక్రవారం పర్యటనలో వెంకటగిరిలో విమానాశ్రయం అంటూ ముఖ్యమంత్రి ప్రకటన చేయడంపైనా జిల్లా వాసులు హేళనగా చర్చించుకుంటున్నారు. వెంకటగిరిలో విమానాశ్రయం ఏమిటో ఎవరికీ అర్థంకాని పరిస్థితి. ఇక ఇద్దురి నేతలూ జిల్లాకు వచ్చిన ప్రతిసారీ కోస్తా కారిడార్, పారిశ్రామిక హబ్, విమానాశ్రయాలు, ఓడరేవులు అంటూ నోటికొచ్చిన పేరల్లా హామీల్లో చొప్పిస్తూ అందరికీ విసుగు తెప్పిస్తున్నారు. మరోవైపు కేంద్రమంత్రి, ముఖ్యమంత్రి పదేపదే ప్రచారం చేసుకున్న స్మార్ట్‌సిటీ ఊసేలేకుండా పోవడం నగరవాసులకు ఆగ్రహం తెప్పిస్తోంది.
స్మార్ట్ సిటీ కథ ముగియగానే నెల్లూరును సుందర నగరం చేస్తానంటూ వెంకయ్య కొత్త పల్లవినందుకున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రోజుకో కొత్త హామీలతో జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నానికి దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు నెల్లూరుకు కృష్ట నీళ్లును అధికంగా తరలిస్తామని చంద్రబాబు హామీలు గుప్పిస్తున్నారు. వైఎస్సార్ హయాంలో పోతిరెడ్డి పాడు సామర్థ్యం 44 వేల క్యూసెక్కులకు పెంచారు.
సోమశిలకు త్వరితగతిన వరదనీరు చేరాలంటే దిగువకు వచ్చే కాలువల సామర్థ్యం సైతం పెంచాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న కాలువ సామర్థ్యం 11 వేల క్యూసెక్కులుకాగా కాలువల లీకేజీలు పోను దిగువకు చేరేది మాత్రం ఏడు వేల క్యూసుక్కులకు మించి రావడంలేదు. వైఎస్సార్ మరణం తరువాత కాలువ విస్తరణ పనులు నిలిచి పోయాయి. తాజా అంచనాల ప్రకారం రూ.30 కోట్ల నిధుల అయితేకానీ పనులు పూర్తికావు. చంద్రబాబు మాటలతో సరిపెట్టకుండా నిధులు ఇస్తే కాలువ పనులు జరిగి సోమశిలకు వరదనీరు త్వరగా చేరే అవకాశముంటుంది.
ఇక ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలు రైతు, డ్వాక్రా రుణమాఫీల విషయంలో బాబు ప్రభుత్వం పిల్లి మొగ్గలు వేసింది. వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్, అక్టోబర్ రెండో తేదీ నుంచిగ్రామాలకు 24 గంటల విద్యుత్ హామీలు గంగలో కలిశాయి. పింఛన్ వెయ్యిరూపాయలు చేస్తానని ప్రగల్భాలు పలికి ఉన్నా కొందరిని అనర్హులుగా ప్రకటిస్తూ పింఛన్‌దారులను నడివీధిలోకి నెట్టిన ఘనత కూడా చంద్రబాబుకే దక్కింది.
ఇలా చెప్పుకుంటూ పోతే బాబు అమలు చేయని హామీల జాబితా చేంతాడంత ఉంది. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ కుంటిసాకులు చూపుతున్న బాబు మరోవైపు రూ.వేల కోట్ల నిధులు అవసరమయ్యే ఉత్తుత్తి హామీలను పదేపదే ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. హామీలు ఇవ్వడంతప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యలు జిల్లాకు ఒరగబెట్టిందేమీ లేదన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.