రేపటి నుంచి మావుళ్లమ్మ ఉత్సవాలు
భీమవరం అర్బన్:శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఆలయ 51వ వార్షిక మహోత్సవాలను ఈ నెల 13వ తేదీ నుంచి నెల రోజుల పాటు వైభవోపేతంగా నిర్వహించేందుకు నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటీ, దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘ భవనంలో ఆదివారం ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. మావుళ్ళమ్మ అమ్మవారి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మానే పేరయ్య మాట్లాడుతూ ఫిబ్రవరి 13వ తేదీన మావుళ్లమ్మ అమ్మవారి అఖండ అన్నసమారాధన నిర్వహిస్తామని తెలిపారు.
భీమవరం, వేమగిరిలకు చెందిన లైటింగ్, డెకరేటర్స్‌తో ప్రత్యేక అలంకరణ చేయిస్తున్నామని చెప్పారు. నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం గౌరవాధ్యక్షుడు కాగిత వీర మహంకాళిరావు, అధ్యక్షుడు రామాయణం గోవిందరావు, మావుళ్ళమ్మ అమ్మవారి ఉత్సవ కమిటీ గౌరవాధ్యక్షుడు అడ్డాల రంగారావు, పండ్ల వర్తక సంఘం ప్రధాన కార్యదర్శి కొప్పుల సత్యనారాయణ మాట్లాడుతూ ఉత్సవాల నిమిత్తం దేవాలయం నుంచి ఈ ఏడాది రూ.12 లక్షలు ఇచ్చారని చెప్పారు. సుమారు రూ.70 లక్షలతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఉత్సవాల సందర్భంగా ఈ నెల 26న నటి రోజాను, ఫిబ్రవరి 1న నటుడు సునీల్‌లను సత్కరించనున్నట్టు చెప్పారు.