మందుల మాయ!
- జిల్లాలో జోరుగా బిల్లులు లేని జెనరిక్ ఔషధ విక్రయాలు
- జీరో బిజినెస్ జోరులో మెడికల్ స్టోర్లు, డాక్టర్ల పాత్ర
- అవే మందులు రాసిస్తే విదేశీ పర్యటనలు, నజరానాలు
- మెడికల్ స్టోర్ల నిర్వహణ గందరగోళమే
- చోద్యం చూస్తున్న డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు
వైద్యో నారాయణోహరి అని పెద్దలు చెబుతారు. అలాంటి వైద్యులు కాసుల కక్కుర్తికి లోబడి నాసిరకం మందులు రాసిస్తున్నారు. తిరుపతి, చిత్తూరు, మదనపల్లెలో కొందరు డాక్టర్లు ఇదే పని చేస్తున్నారు. కొన్ని మెడికల్ స్టోర్ల నిర్వాహకులు మందులతో జీరో బిజినెస్ చేస్తున్నారు. సామాన్యుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. మరోవైపు ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది.
సాక్షి, చిత్తూరు: కాంట్రాక్టు బేసిస్ మెడిసిన్ పేరుతో ఔషధాల దందా జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున సాగుతోంది. మందులతయారీ సంస్థలు, కొందరు వైద్యులతో నేరుగా సంబంధాలు పెట్టుకుని వారు నడుపుతున్న ఆస్పత్రులకు మందులు సరఫరా చేస్తున్నాయి. వీటికి బిల్లులు ఉండడం లేదు. మరికొందరు వైద్యులు మందుల దుకాణాల యజమానులతో కుమ్మక్కై అధిక లాభాలు వచ్చే కొన్ని రకాల మందులనే రాసి విక్రయాల జోరు పెంచుతున్నారు.
ప్రతి ఫలంగా పర్సంటేజీలు అందుతున్నాయి. ఈ వ్యవహారం ఔషధ నియంత్రణశాఖ అధికారులకు తెలిసినా మామూళ్లు పుచ్చుకుంటూ చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రూ.లక్ష విలువైన కాంట్రాక్ట్ బేసిస్ మందులు విక్రయిస్తే డాక్టర్లకు కంపెనీ ప్రతినిధులు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ముట్టజెబుతున్నారు. వీటితో పాటు మూడు నెలలకు ఓసారి ఖరీదైన బహుమతులు అందజేయడంతోపాటు ఏడాది కి రెండుసార్లు విదేశీ పర్యటనలకు పంపుతున్నారు.
కొసరు మందులతో రూ.కోట్ల లాభాలు
కాసుల సంపాదనే ధ్యేయంగా కొందరు వైద్యులు, మందుల దుకాణాల యజమానులు చేతులు కలిపి వినియోగదారుల నుంచి భారీగా పిండుతున్నారు. సరసమైన ధరల్లో లభించే నాణ్యమైన ఔషధాలు అందుబాటులో ఉన్నా వాటిని కాకుండా ఎక్కువ లాభాలు వచ్చే జెనరిక్ బ్రాండ్లను రాసి పంపుతున్నారు. ఉదాహరణకు నొప్పి నివారణకు వాడే అసిక్లోఫినాక్ మందు స్థానంలో ‘ఎ...ఆ...’ రెండు రకాల కంపెనీల పేరుతో ఉన్న జెనరిక్ ఔషధాలను రాస్తున్నారు.
జలుబు, అలర్జీ నియంత్రణకు వాడే సిట్రిజిన్ స్థానంలో ఓ... సె..., ఆ... పేర్లతో ఉండే మందులను, కడుపులో మంట నివారణకు వాడే ఫాంటాప్రిజోల్ స్థానంలో ‘ఫా’ పేరుతో ఉండే మరో మూడు రకాల కంపెనీలకు చెందిన మందులు రాసిస్తున్నారు. ఫలితంగా మందుల దుకాణ యజమానులు భారీగా లాభాలు దండుకుంటున్నారు. ఇందులో నుంచి కొంత పర్సంటేజీలను వైద్యులకు ముట్టజెబుతున్నారు. ఇదంతా తెలిసినా డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు చర్యలు తీసుకోవడం లేదు.
మెడికల్ స్టోర్ల తీరిది
బీ ఫార్మసీ పూర్తి చేసిన వారి ధ్రువపత్రాలను అద్దెకు తీసుకుని మందుల దుకాణాల ఏర్పాటుకు అనుమతులు తెచ్చుకోవడం నిబంధనలకు విరుద్ధమైనా జిల్లాలో సర్వసాధారణంగా మారింది. వినియోగదారులకు ఔషధాలు అందజేసేందుకు కచ్చితంగా ఫార్మసిస్టులనే నియమించుకోవాలి. జిల్లాలో చాలా వరకు మందుల దుకాణాల యజమానులు పదో తరగతి, ఇంటర్మీడియెట్ తప్పినవారిని పెట్టుకొని విక్రయాలు సాగిస్తున్నారు. దీంతో అవగాహన లేక పలుసార్లు తప్పిదాలు జరుగుతున్నాయి.
నిర్దిష్ట ప్రమాణాల్లేనివే అధికం
ఔషధ దుకాణం కచ్చితంగా 10ఁ12 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండాలి. ఈ కొలతలు ఉన్నాయా? లేదా? అనేది డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పరిశీలించాలి. తొలుత ఈ పరిణామంలో ఉన్న గదులను చూపించి అనుమతులు తీసుకుంటున్నారు. ఆ తర్వాత ఇరుకు గదుల్లో దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు.
దుకాణంలో ఉండే ఫార్మసిస్టు స్థానికుడై ఉండాలి. అతని పేరు, అర్హత పత్రం నకలు కాపీ, ఇతర వివరాలు వినియోగదారులకు కనిపించేలా ఉంచాలి. 90 శాతం దుకాణాల్లో ఈ నిబంధన అమలు కావడం లేదు.
దుకాణంలోకి దుమ్ము, ధూళి ప్రవేశించకుండా అద్దాలు ఏర్పాటు చేయాలి. పేరున్న దుకాణాలు కొన్ని మినహా ఇతరులు ఎవరూ ఈ నిబంధన పాటించడం లేదు.
డ్రగ్ ఇన్‌స్పెక్టర్ తరచూ దుకాణాలను తనిఖీ చేసి నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఇదీ సరిగా జరగడం లేదు.
మందుల కొనుగోలు సందర్భంగా దుకాణ యజ మాని నుంచి ఇబ్బందులు తలెత్తితే.. ఫిర్యాదు చేయాల్సిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల పేర్లు, వారి హోదా, ఫోన్ నంబర్లున్న బోర్డును దుకాణంలో వినియోగదారులకు కనిపించేలా ఉంచాలి. చాలా వాటిల్లో ఇలాంటివేవీ లేకుండానే విక్రయాలు సాగిస్తున్నారు.