
మన్యంలో మళ్లీ చల్లదనం
మంచుతో పాటు గాలులు
తగ్గుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు
విశాఖపట్నం: విశాఖ మన్యం మళ్లీ చల్లబడుతోంది. చ లిగాలులకు మంచు కూడా తోడవుతోంది. దీంతో ఇప్పుడిప్పుడే చలి ప్రభావం తగ్గుతోందని సంబరపడుతున్న ఏజెన్సీ వాసులకు ఆ చాన్స్ లేకుండా చేస్తోంది. తాజాగా రెండ్రోజుల నుంచి మన్యంలో కనీస ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకంటే తక్కువగా నమోదవుతున్నాయి. సోమవారం కనిష్టంగా పాడేరులో 12 డిగ్రీలు, చింతపల్లిలో 11, లంబసింగిలో 9 డిగ్రీలు రికార్డయ్యాయి. వాస్తవానికి ఫిబ్రవరి నెలలో ఈ సమయానికి 15 డిగ్రీల వరకూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావాలి. కానీ ప్రస్తుతం సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు తక్కువే రికార్డవుతూ వణికిస్తున్నాయి. ఒకపక్క ఉదయం వరకూ పొగమంచు కురుస్తూ ఉండడం, దానికి చలిగాలులు తోడవడం వల్ల అక్కడ శీతల వాతావరణం కనిపిస్తోంది. దీంతో ఉదయం పొద్దెక్కినా ద్విచక్ర వాహనాలపై వెళ్లడానికి వీల్లేకుండా పోతోంది. మధ్యాహ్నానికి మాత్రం సూర్యుడు చుర్రుమనిపిస్తున్నాడు. ఎండ తీవ్రతతో రాత్రి వేళ కాస్త ఉపశమనం కలుగుతుందనుకుంటున్న మన్యం వాసులకు ఆశాభంగమే ఎదురవుతోంది. మరోవైపు మైదానంలో పరిస్థితి ఒకింత మెరుగ్గా ఉంది. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు కొన్నిచోట్ల సాధారణంగాను, మరికొన్ని ప్రాంతాల్లో సాధారణంకంటే ఒకట్రెండు డిగ్రీలు ఎక్కువగానూ నమోదవుతున్నాయి. ఫలితంగా మైదాన ప్రాంతాల్లో చలి ప్రభావం ఏమంత కనిపించడం లేదు. అయితే పగటి పూట మాత్రం ఎండ తీవ్రత కనిపిస్తోంది.
ఉత్తర గాలుల వల్లే..
ప్రస్తుతం ఏజెన్సీలో చలి కొనసాగడానికి ఉత్తర గాలులే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పొరుగున ఉన్న మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో చలి తీవ్రత ఇంకా కొనసాగుతోంది. అటు వైపు నుంచి వీస్తున్న గాలుల ప్రభావం మన్యంపై పడుతున్నందు వల్ల అక్కడ శీతల పరిస్థితికి దోహదపడుతోందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం మాజీ అధికారి ఆర్.మురళీకృష్ణ సోమవారం రాత్రి ‘సాక్షి’కి తెలిపారు. ఉదయం వేళ ఆకాశం నిర్మలంగా ఉంటూ గాలిలేకుండా తేమ ఉంటే పొగమంచు ఏర్పడటానికి కారణమవుతుందని చెప్పారు. ప్రస్తుతం విశాఖ ఏజెన్సీల్లో ఈ పరిస్థితులున్నాయన్నారు. మరో వారం రోజుల పాటు ఇదే వాతావరణం మన్యంలో కొనసాగే అవకావం ఉందని వివరించారు.