మన్యంలో ప్రాథమిక విద్య పటిష్టం చేయాలి
క్లస్టర్ స్కూల్స్ విధానం వద్దు
అసెంబ్లీలో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్
పాడేరు: క్లష్టర్ స్కూల్స్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ఆలోచన లను విరమించుకోవాలని పాడేరు శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి ప్రభుత్వానికి సూచించా రు. ఆమె శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ క్లష్టర్ విధానం వల్ల ప్రాథమిక విద్య నిర్వీర్యమవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుతం గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక విద్యా వ్యవస్థను యథావిధిగా కొనసాగించి పటిష్ట పర్చాలని ఆమె డిమాండ్ చేశారు. గతంలో సక్సెస్ పాఠశాలలు, మోడల్ పాఠశాలల వంటి ప్రయోగాలు సత్ఫలితాలను ఇవ్వలేదని, మళ్లీ ఇప్పుడు క్లష్టర్ స్కూల్స్ విధానం కూడా ప్రాథమిక విద్యకు తూట్లు పొడుస్తుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలు ఉన్నప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో ఆధునిక విద్య అందుబాటులో లేదని, చాలా గిరిజన గ్రామాల్లో బడిఈడు పిల్లలు డ్రాపవుట్ అవుతునే ఉన్నారని ఆమె చెప్పారు. ఏజెన్సీలో ఏకోపాధ్యాయ పాఠశాలల్లో అదనంగా టీచర్ పోస్టులను మంజూరు చేయాలని, నాణ్యమైన విద్యను అందించాలని ఆమె కోరారు.
ఉపాధ్యాయ సంఘాలూ వ్యతిరకమే: క్లష్టర్ స్కూల్ విధానం చేపట్టాలనే ప్రభుత్వ ఆలోచనను ఏజెన్సీలోని ఉపాధ్యాయ సంఘా లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. క్లష్టర్ స్కూల్స్ వల్ల గిరిజన బాలలు ప్రాథమిక విద్యకు దూరమవుతారని, టీచర్ పోస్టులను తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇటువంటి కొత్త విధానాలను అవలంబించేందుకు ప్రయత్నిస్తోందని ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావించి క్లష్టర్ స్కూళ్ల విధానాన్ని వ్యతిరేకించడాన్ని పట్ల ఉపాధ్యాయ సంఘాలు స్వాగతించాయి. మన్యంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, గిరిజన ప్రాథమిక విద్యను పటిష్టం చేయాలని డిమాండ్ చేశాయి.