మేయర్‌కే సమాచారం ఇవ్వరా?
అనంతపురం సిటీ : నగరపాలక సంస్థ పరిధిలోని పలువురు కార్పొరేటర్లు సోమవారం సాయంత్రం మేయర్ స్వరూప చాంబర్‌కు వచ్చారు. ఏమిటీ.. అందరూ ఇలా వచ్చారని అడిగితే పింఛన్ల పరిశీలన నేపథ్యంలో సమావేశం ఉందంటే వచ్చామని సమాధానమిచ్చారు. దీంతో మేయర్ వెంటనే జూనియర్ అసిస్టెంట్ (జేఏ) సంధ్యను పిలిపించారు. 49 మంది కార్పొరేటర్లకు ఫోన్ చేసి సమావేశం ఉందని తెలిపినప్పుడు.. మేయర్‌నైన తనకు కనీస సమాచారం ఇవ్వాలని కూడా తెలీదా? అంటూ మండిపడ్డారు. తనకు ఆ మేరకు సర్క్యులర్ జారీ చేస్తే అలానే చేస్తానని జూనియర్ అసిస్టెంట్ సమాధానమివ్వడంతో మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిక్క తిక్క పనులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సమాచారం అందించడంలో నిర్లక్ష్యం వహించిన జూనియర్ అసిస్టెంట్‌కు మెమో ఇవ్వాలని, మూడు రోజుల్లో మరో డిపార్‌టమెంట్‌కు బదిలీ చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. మహిళే కదా.. ఏమీ పట్టించుకోరని.. ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటారా అంటూ ధ్వజమెత్తారు. కార్పొరేటర్లు కూడా మహిళా ఉద్యోగి తీరును తప్పు పట్టారు. సమావేశం ఉందని వచ్చిన వారిలో కార్పొరేటర్లు జా నకి, బాలాంజనేయులు, లాలు, షుకూర్, మల్లికార్జున, భూలక్ష్మి తదితరులు ఉన్నారు.