
రంజాన్‌లోగా స్పందించకుంటే సమ్మె ఉధృతం
కార్మిక సంఘాల జేఏసీ ఆల్టిమేటం
17న సీఎం క్యాంపు కార్యాలయాల ముట్టడి
జిల్లా కేంద్రాల్లో నిరాహార దీక్షలు
విజయవాడ (గాంధీనగర్) : కార్మిక సంఘాల ఐక్యకార్యాచరణ సమితి ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించింది. రంజాన్‌లోగా కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని, నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించింది. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో కార్మిక సంఘాల జేఏసీ నాయకులు సమావేశమై భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ దమనకాండకు నిరసనగా జిల్లా కేంద్రాల్లో నిరాహార దీక్షలు చేపడతామని, అలాగే ఈనెల 17న సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని అన్నారు. పదవ పీఆర్‌సీ కనీసం వేతనం రూ.13,170గా నిర్ణయించినప్పటికీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు రూ.10 వేలకు మించి ఇవ్వలేమని ప్రకటించడం దుర్మార్గమన్నారు.
అనంతరం వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ర్ట అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాలన గాడి తప్పిందన్నారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నిజస్వరూపం బట్టబయలైందని తెలిపారు. కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మె బాట పడితే రోజుకు రూ.275లు ఇచ్చి ప్రైవేటు వర్కర్లను పెట్టుకుంటామని ప్రకటించడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. కనీస వేతనం రూ.13,170 చెల్లించాలని జీవోలు చెబుతున్నా కార్మికులకు కేవలం రూ.6,500 మాత్రమే చెల్లిస్తున్నారని మండిపడ్డారు. సీఐటీయూ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గఫూర్ మాట్లాడుతున్న పాలన వ్యవహారాలపై ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి బాధ్యత లోపించిందన్నారు. సమావేశంలో బీఎంఎస్ నాయకులు దశరథరామరాజు, ఐఎన్‌టీయూసీ నాయకులు వెంకటసుబ్బయ్య, ఇఫ్టూ నాయకులు ప్రసాద్, చలసాని రామారావు తదితరులు పాల్గొన్నారు.