మేడారానికి పూనకం
*గద్దెపైకి చేరిన సమ్మక్క తల్లి
*దారిపొడవునా వనదేవతకు మొక్కులు
*శివసత్తుల పూనకాలు.. గిరిజనుల నృత్యాలు
*మేడారంలో ఉప్పొంగిన భక్తిభావం
మేడారం నుంచి సాక్షి ప్రతినిధి: మేడారం పులకించింది. గిరిజన జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. లక్షల మంది భక్తుల ఎదురుచూపులు ఫలించాయి. కోటొక్క భక్తుల కొంగుబంగారం, వనదేవత సమ్మక్క చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెలపైకి చేరింది. నమో సమ్మక్క... జై సమ్మక్క... అంటూ లక్షలాది మంది భక్తుల పారవశ్యం, గిరిజన యువతుల నృత్యాలు, కోయదొరల డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, అధికారుల లాంఛనాలు, పోలీసు అధికారి తుపాకీ కాల్పుల మధ్య... తల్లి సమ్మక్కను గిరిజన సంప్రదాయాల ప్రకారం వడ్డెలు(పూజారులు) మేడారం గద్దెలపైకి చేర్చారు. సమ్మక్కను తీసుకువచ్చే ప్రధాన ఘట్టం గురువారం సాయంత్రం 5.39 నుంచి రాత్రి 7.52 గంటల వరకు ఉద్విఘ్నంగా సాగింది. ఈ పతాక ఘట్టాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు.
వనదేవత సమ్మక్కను మేడారం గద్దెలపైకి చేర్చే ప్రక్రియ గురువారం ఉదయం 5.30 గంటలకే ప్రారంభమైంది. మేడారం సమీపంలోని చిలకలగుట్ట అడవిలోకి వెళ్లి వనం(వెదురు కర్రలు) తెచ్చి గద్దెలపై ప్రత్యేక పూజలు చేశారు. సమీపంలోని సమ్మక్క పూజా మందిరం నుంచి వడరాలు(పసిడి కుండలు)ను తెచ్చి గద్దెలపైకి చేర్చారు. అనంతరం కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపైకి తెచ్చేందుకు వడ్డెల బృందం మధ్యాహ్నం 3.50 గంటలకు చిలకలగుట్టపైకి బయలుదేరింది. అప్పటికే ఆ ప్రాంతమంతా భక్తులతో నిండిపోయింది.
కలెక్టర్ జి.కిషన్, ఇతర ఉన్నతాధికారులు అక్కడ పర్యవేక్షించారు.కుంకుమ భరిణె రూపంలో ఉన్న అడవి తల్లిని చేతపట్టుకున్న మరుక్షణమే ప్రధాన వడ్డె, సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య తన్మయత్వంతో ఒక్క ఉదుటున గుట్ట దిగారు. మిగిలిన వడ్డెలు కృష్ణయ్యను తోడ్కొని వచ్చారు. సమ్మక్క రాకకు సూచనగా అధికారిక లాంఛనాల ప్రకారం వరంగల్ రూరల్ ఎస్పీ కాళిదాసు నాలుగు విడతలుగా గాల్లోకి కాల్పులు జరిపారు. సమ్మక్క రాకను సూచించే ఈ శబ్దంతో ఒక్కసారిగా చిలకలగుట్ట ప్రాంతం భక్తిభావంతో ఉప్పొంగిపోయింది. సమ్మక్క తల్లి నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది.
ఆదివాసీ యువకుల రక్షణ వలయం, పోలీసు బలగాల నడుమ వడ్డెల బృందం సమ్మక్క తల్లితో మేడారంవైపు బయలుదేరింది. సమ్మక్కకు ఎదురుగా కోళ్లు, గొర్రెలు బలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. శివసత్తుల పూనకాలతో శివాలూగారు. మొక్కులతో తమతో తెచ్చుకున్న ఒడిబాల బియ్యాన్ని సమ్మక్క దారిలో వెదజల్లారు. మరికొందరు భక్తులు ఆ బియ్యాన్ని అపురూపంగా ఏరుకుని దాచుకున్నారు. సమ్మక్క రాకతో తారాస్థాయికి చేరుకున్న భక్తి ప్రవాహం సెలపయ్య గుడికి చేరుకుంది. తల్లి రావడంతో అక్కడి వడ్డెలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మేడారం గద్దెలకు బయలుదేరారు. మేడారం గద్దెల ముఖద్వారం వద్ద ఆ గ్రామ ఆడబిడ్డలు సమ్మక్కను తీసుకువస్తున్న పూజారుల కాళ్లు కడిగి భక్తిశ్రద్ధలతో స్వాగతం పలికారు. మిగిలిన భక్తులు ఆ ఆనంద క్షణాలను తమ కన్నుల్లో దాచుకున్నారు. ఆపై వడ్డెలు సమ్మక్కను గద్దెలపైకి చేర్చారు. కాగా, జాతరకు ముందే 30లక్షల మంది భక్తులు మొక్కులు చెల్లించుకోగా బుధ, గురువారాల్లో మరో 60లక్షల మంది మొక్కులు చెల్లించుకున్నారు.
మహాజాతరలో అపశృతులు.. ఐదుగురు మృతి
మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో గురువారం వివిధ సంఘటనల్లో ఐదుగురు మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం చెట్టుపల్లికి చెందిన అసంపల్లి పర్వతాలు(55)కు మధ్యాహ్నం గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా, మృతి చెందాడు. వర్ధన్నపేట మండలం ఇల్లందకు చెందిన బొమ్మెర వెంకన్న(35), సాతుపెల్లి యాకయ్య(70) అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. నెల్లికుదురు మండలం జైరాం గ్రామానికి చెందిన బాలుడు సంజయ్(6) ఫిట్స్‌తో చనిపోయాడు.
తొక్కిసలాటలో కరీంనగర్ వాసి మృతి
కోహెడ: కరీంనగర్ జిల్లా కోహెడ మండల కేంద్రానికి చెందిన ఒరుగల కనకయ్య(58) బుధవారం కుటుంబసభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకొనేందుకు కోహెడ నుంచి మేడారం వెళ్లాడు. గురువారం క్యూలో తొక్కిసలాట జరిగిందని, ఈ సంఘటనలో కనుకయ్య అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడని కుటుంబసభ్యులు తెలిపారు. అతనికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.