మూడేళ్లలో మెడికల్‌ కాలేజీలు | Medical colleges in three years | Sakshi
Sakshi News home page

మూడేళ్లలో మెడికల్‌ కాలేజీలు

Published Thu, May 28 2020 4:21 AM | Last Updated on Thu, May 28 2020 4:21 AM

Medical colleges in three years - Sakshi

మచిలీపట్నంలో ఏర్పాటు చేయనున్న మెడికల్‌ కాలేజీ స్థలానికి సంబంధించిన మ్యాప్‌ను పరిశీలిస్తున్న మంత్రులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 16 కొత్త వైద్య కళాశాలల నిర్మాణాన్ని 2023 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతోంది. తద్వారా ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో పేద రోగులందరికీ స్పెషాలిటీ సేవలను అందించొచ్చని భావిస్తోంది. ఇదే సమయంలో ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్యనూ గణనీయంగా పెంచేందుకు కృషి చేస్తోంది. వైద్య కళాశాలలను అనుకున్న సమయానికే పూర్తి చేయాలని, దీనికయ్యే వ్యయం గురించి ఆలోచించకూడదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఇప్పటికే కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి సంబంధించి రెండు నమూనాలను సీఎం ఓకే చేశారని అధికార వర్గాలు తెలిపాయి. కొన్ని వైద్య కళాశాలలకు ఇప్పటికే భూసేకరణ పూర్తి కాగా మరికొన్ని కళాశాలల నిర్మాణానికి భూములు సేకరిస్తున్నారు. 

వైద్య కళాశాలలను నిర్మించాలంటే..
ఒక్కో వైద్య కళాశాల నిర్మాణానికి రూ.450 కోట్లు వ్యయమవుతుందని అంచనా. ఈ మొత్తం కాకుండా సిబ్బందికి వేతనాల రూపంలో ఏడాదికి రూ.132 కోట్లు వ్యయం. 300 పడకలతో ఉండే ప్రతి వైద్య కళాశాలకు అనుబంధంగా నర్సింగ్‌ కాలేజీ ఉంటుంది.
–వైద్య కళాశాల నిర్మాణానికి కనీసం 25 ఎకరాలు, నర్సింగ్‌ కాలేజీకి 5 ఎకరాలు స్థలం అవసరమవుతుంది. 
–ప్రతి వైద్య కళాశాల రోజుకు 1,000 మంది ఔట్‌పేషెంట్‌ రోగులకు వైద్యసేవలు అందించాలనేది లక్ష్యం
–ఇప్పటికే పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్లలో ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలలకు ఆర్థిక సాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది.

అనుకున్న సమయానికే పూర్తి చేస్తాం
కొత్త వైద్య కళాశాలలను అనుకున్న సమయానికే పూర్తి చేస్తాం. 2023 నాటికి అన్ని వైద్య కళాశాలల నిర్మాణాలను పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ఇప్పటికే కొన్ని నమూనాలను ఓకే చేశారు. అత్యాధునిక వసతులతో కొత్త కాలేజీలు నిర్మిస్తాం. త్వరలోనే వీటికి సంబంధించిన టెండర్లకు వెళతాం.
–విజయరామరాజు, ఎండీ, రాష్ట్ర మౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థ 

నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు

రాష్ట్రంలో పేదలందరికీ మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి వైద్య ఆరోగ్య శాఖలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలతో కలిసి ఆయన బుధవారం కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో పర్యటించారు. బందరు మెడికల్‌ కళాశాల స్థలాన్ని పరిశీలించాక స్థానిక జిల్లా ఆస్పత్రిని సందర్శించారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై మెడికల్‌ కళాశాల ఏర్పాటుపై చర్చించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. 
► జూలై 8న వైఎస్సార్‌ చిరునవ్వు పథకం ప్రారంభిస్తాం. దీనికింద రాష్ట్రవ్యాప్తంగా 1 నుంచి ఆరో తరగతి చదివే విద్యార్థులకు ఉచితంగా దంత వైద్యం అందిస్తాం.
► రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 11 మెడికల్‌ కళాశాలలను 27కు పెంచుతాం. 

పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఓ మెడికల్‌ కాలేజీ
► ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకోసం ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏరియా, జిల్లా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. వీటి ద్వారా నిరుపేదలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తాం.
► గుడివాడ ఏరియా ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తాం.
► రాష్ట్రవ్యాప్తంగా సబ్‌ సెంటర్లను వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లుగా తీర్చిదిద్దుతున్నాం. 
► ఆస్పత్రులకు కొత్త భవనాల నిర్మాణంతోపాటు 9 వేల వైద్య పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నాం. 
► త్వరలోనే బందరు మెడికల్‌ కళాశాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. 
ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ఇంతియాజ్, జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement