లీవులు స్వాహా!
నేరస్తుల నుంచి నజరానాలు తీసుకున్నారన్న ఆరోపణలతో ఇప్పటికే అప్రతిష్ఠను మూటకట్టుకున్న జిల్లా పోలీసు శాఖలో.. తాజాగా మరో అవినీతి వ్యవహారం వెలుగు చూసింది. అటు కానిస్టేబుళ్లు.. ఇటు జిల్లా పోలీసు కార్యాలయ ఉద్యోగులు ఏకమై మెడికల్ లీవుల కుంభకోణానికి తెరలేపారు. ఫలితంగా రాష్ట్ర ఖజానాకు లక్షలాది రూపాయల్లో గండిపడింది. పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు శాఖలో గడచిన ఏడాదిన్నరగా చోటుచేసుకుంటున్న ఈ వ్యవహారంపై సాక్షి పరిశోధనాత్మక కథనం.
సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లాలోని 62 పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లు, ఏఎస్సైలు, ఎస్సైలు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లకు సంబంధించిన పాలనాపరమైన అంశాలను ఏలూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఏ-సెక్షన్ విభాగం ఉద్యోగులు చూస్తుంటారు. వారి పదోన్నతులు, బదిలీలు, సెలవులు, మెడికల్ లీవులు, క్రమశిక్షణా చర్యలు ఇలా పాలనాపరమైన అన్ని అంశాలనూ పరిశీలించి సర్వీస్ రిజిస్టర్లలో నమో దు చేస్తుంటారు. సరిగ్గా ఇక్కడే ఆ విభాగం ఉద్యోగులు అక్రమాలకు తెరలేపారు. పోలీసులు అనారోగ్యం సమయంలో ఉన్నతాధికారుల అనుమతితో మెడికల్ లీవులు పెడుతుండటం సహజం. ఈ సందర్భాల్లో ముందుగా తాము పనిచేసే పోలీస్‌స్టేషన్‌లోని రిజిస్టర్‌లో ఈ సెలవులు ఎంట్రీ అవుతాయి. తర్వాత ఈ రిజిస్టర్ డీపీవో కార్యాలయంలోని ఏ-సెక్షన్‌కు వెళ్తుంది. అక్కడి ఉద్యోగులు రిజిస్టర్లను పరిశీలించి సెలవు పెట్టినవారి సర్వీస్ రిజిస్టర్లలో నమోదు చేయాలి. కానీ ఆ విభాగంలోని కొందరు ఉద్యోగులు సర్వీసు నిబంధనలను ఉల్లంఘించి లీవుల వివరాలు నమోదు చేయకుండా సదరు కానిస్టేబుళ్ల నుంచి తృణమో.. ఫణమో పుచ్చుకున్నారన్న ఆరోపణలున్నాయి.
విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు...
తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బి.రాజేంద్రప్రసాద్ (హెచ్‌సీ 902) 4.3.2013 నుంచి 4.5.2013 వరకు 61రోజులు మెడికల్ లీవు పెట్టారు. కొవ్వూరు రూరల్ స్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్న ఏసీహెచ్ శేఖర్ (720) 6.11.2013 నుంచి 21.1.14 వరకు 76 రోజులు మెడికల్ లీవు పెట్టారు. తణుకు ట్రాఫిక్ విభాగం కానిస్టేబుల్ పి.రవికుమార్ (పీసీ 2679) 2.6.2014 నుంచి 23.7.2014వరకు 51రోజుల మెడికల్ లీవు పెట్టారు. జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ కె.నాగేశ్వరరరావు (హెచ్‌సీ 994) 19.4.2013 నుంచి 18.5.2013 వరకు 30 రోజులు మెడికల్ లీవు పెట్టారు.
ఏలూ రు వన్‌టౌన్‌లో కానిస్టేబుల్ బి.భద్రరావు (పీసీ 1047) 12.6.2014 నుంచి 19.8.2014 వరకు మొత్తం 70 రోజుల పాటు మెడికల్ లీవు పెట్టారు. ఇప్పటివరకూ వీరిలో ఏ ఒక్కరి లీవూ జిల్లా పోలీసు కార్యాలయంలోని సర్వీస్ రిజిస్టర్‌లో నమోదు కాలేదు. ఫలితంగా వారు ఆ కాలంలో పనిచేస్తున్నట్టు ఎంచక్కా జీతాలు పొందారు. ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు. ఇలా 2013 మార్చి నుంచి 2014 సెప్టెంబర్ వరకు కేవలం ఏడాదిన్నర కాలంలోనే సుమారు 700 మంది ఉద్యోగుల మెడికల్ లీవులను సర్వీస్ రిజిస్టర్‌లో నమోదు చేయకుండా అవకతవకలకు పాల్పడినట్టు తెలిసింది. ఇలా నమోదు చేయనందుకు ఆ విభాగంలోని సిబ్బంది ఒక్కో ఉద్యోగి నుంచి రూ.3 వేల నుంచి రూ.4 వేలు తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. సర్కారు ఖజానాకు గం డిపడటంతో పాటు పాతిక రూ.లక్షల వరకు చేతు లు మారిన ఈ వ్యవహారంపై జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.