విజయనగరం క్రైం: మందుల షాపులను జియో ట్యాగింగ్ విధానంలోకి తెస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మందుల షాపులు అన్నింటికీ జియో ట్యాగింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా జియో ట్యాగింగ్ విధానాన్ని అమలు చేసేందుకు ఔషధ నియంత్రణ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 800 వరకు హోల్‌సేల్, రిటైల్ మందులు షాపులు ఉన్నాయి.
అందులో సుమారు 50 మందుల షాపుల చిరునామా అధికారులకు తెలియడం లేదు. దీంతో వాటిని గుర్తించే పనిలో అధికారులు పడ్డారు. జియో ట్యాగింగ్ విధానంలో మందుల షాపులకు సంబంధించిన పూర్తి వివరాలు, షాపులో ఏయే మందులు ఉన్నాయో, షాపు ఎక్కడుందో పూర్తిగా తెలుసుకోవడానికి వీలుంటుంది. మందులు షాపులతోపాటు జిల్లాలోని బ్లడ్ బ్యాంకులు, ఫార్మా కంపెనీల వివరాలు కంప్యూటర్‌లో ఆన్‌లైన్ చేస్తారు.
మందుల షాపుల ఫొటోలు, అందుబాటులో ఉన్న మందులు, ఎక్స్‌పైర్ తేదీలను ఆన్‌లైన్ చేస్తారు. బ్లడ్ బ్యాంకులు జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నాయి వంటి వివరాలు అందుబాటులో ఉంటాయి. అందులో రక్తం నిల్వల వివరాలను ఉంచుతారు. మందులు షాపుల్లో జియో ట్యాగింగ్ విధానాన్ని ఈ నెలాఖరు నాటికి పూర్తిచేసే అవకాశం ఉంది.
జియో ట్యాగింగ్ చేస్తున్నాం..
జిల్లాలోని అన్ని మందుల షాపులనూ జియో ట్యాగింగ్ చేస్తున్నాం. జియో ట్యాగింగ్ విధానం వల్ల మందుల షాపులకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు.
- ఎన్.యుగంధర్‌రావు, విజయనగరం డివిజన్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్
మెడికల్ షాపులకు జియో ట్యాగింగ్
Published Sun, Apr 10 2016 12:18 AM | Last Updated on Sun, Sep 3 2017 9:33 PM
Advertisement
Advertisement