ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జిల్లా కేంద్రంలోని సెంట్రల్ డ్రగ్‌స్టోర్ నుంచి జిల్లాలోని ఆస్పత్రులకు వాహనాల ద్వారా డ్రగ్స్, సర్జికల్ ఐటమ్స్ నేరుగా రవాణా చేయనున్నారు. గతంలో ఈ విధానం ప్రారంభించాలని భావించినా అడుగు పడలేదు. ప్రస్తుతం ఆస్పత్రి వాహనం జిల్లా కేంద్రానికి వచ్చి డ్రగ్‌స్టోర్ నుంచి మందులు తీసుకెళ్తోంది. తద్వారా ఆస్పత్రిపై రవాణా భారం పడుతోంది. రానున్న రోజుల్లో ఇందులో మార్పులు చేస్తున్నారు.
డ్రగ్‌స్టోర్ నుంచి వాహనం సమకూర్చి ఆస్పత్రికి డ్రగ్స్ పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, గృహ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) నుంచి జిల్లా ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ కృష్ణయ్యకు ఆదేశాలు అందాయి. త్వరలో విధివిధానాలు ఖరారు చేయనున్నారు. వచ్చే ఏప్రిల్ నుంచి ఈ ప్రక్రియ ను ప్రారంభించాలని, ఇందుకు సంబంధించి రూట్లు ఖరారు చేయాలని శుక్రవారం ఆదేశాలు అందాయి. అయితే.. ఇందుకు వాహనాలు కొనుగోలు చేస్తారా, అద్దెకు తీసుకోవడమా అని ఏపీఎంఎస్‌ఐడీసీ నుంచి వచ్చే ఆదేశాలకనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఈఈ తెలి పారు. ఇందుకు అవసరమయ్యే అదనపు సిబ్బందిని కూడా నియమించే అవకాశాలుంటాయని పేర్కొన్నారు.
జిల్లాలోని ఆస్పత్రులు..
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో జిల్లా వ్యాప్తంగా 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ పరిధిలో ఆసిఫాబాద్, బెల్లంపల్లి, భైంసా, ఖానాపూర్, మంచిర్యాల, నిర్మల్ (సీహెచ్), నిర్మల్ (ఎన్‌సీహెచ్), సిర్పూర్, ఉట్నూర్‌లలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ పరిధిలోకి వచ్చే రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (రిమ్స్) ఉన్నాయి. వీటన్నింటికి సంబంధించి డ్రగ్స్, సర్జికల్ ఐటమ్స్ హైదరాబాద్‌లోని ఏపీఎంఎస్‌ఐడీసీ నుంచి జిల్లా కేంద్రంలోని డ్రగ్‌స్టోర్‌కు పంపిణీ అవుతాయి. ఏటా సుమారు రూ.10 కోట్ల విలువైన 480 రకాల మందులు జిల్లాకు వస్తాయి.
అందులో 320 రకాలు జనరల్ మెడిసిన్స్, 150 రకాలు సర్జికల్ ఐటమ్స్, ఇతరత్రా ఉంటాయి. ఏడాదిలో నాలుగు విడతలుగా ఆస్పత్రులకు మందుల పంపిణీ ఉంటుంది. ఆస్పత్రి నుంచి వాహనం ద్వారా వచ్చే సిబ్బంది డ్రగ్‌స్టోర్ నుంచి మందులు తీసుకెళ్లాలి. అయితే.. సరైన పర్యవేక్షణ లేక పలువురు సిబ్బంది ప్రైవేట్ వైద్యులు, ఆర్‌ఎంపీలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా పేద రోగులకు అందాల్సిన మందులు దుర్వినియోగం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో డ్రగ్‌స్టోర్ నుంచి నేరుగా ఆస్పత్రికి మందులను సరఫరా చేసి దుర్వినియోగాన్ని అరికట్టవచ్చని ఏపీఎంఎస్‌ఐడీసీ భావించింది.
ఇందుకనుగుణంగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే.. అన్ని ఆస్పత్రుల్లో కంప్యూటర్లు, స్కానర్లు ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ అహ్మద్‌బాబు చర్యలు తీసుకుంటున్నట్లు ఈఈ చెప్పారు. పీహెచ్‌సీలలో మందుల కోటా, ఇతర అంశాలను పరిశీలించేందుకు ఈ ఆన్‌లైన్ విధానం తోడ్పడనుంది. ఈ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. ఓ వైపు డ్రగ్స్‌కు సంబంధించి పూర్తి వివరాలు కంప్యూటరైజ్డ్ చేయడం, మరోపక్క మందులను నేరుగా డ్రగ్‌స్టోర్ నుంచే వాహనాల ద్వారా రవాణా చేయడంతో దుబారాకు కళ్లెం పడే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు పలు ఆస్పత్రులకు జిల్లా కేంద్రానికి వాహనం ద్వారా వచ్చి మందులు తీసుకెళ్లేందుకు పెట్రోల్ ఖర్చు భారం కూడా తగ్గుతుంది.
రూట్లు ఖరారు : ఆస్పత్రులకు మందులను డోర్ డెలివరీ చేసేందుకు ఏపీఎంఎస్‌ఐడీసీ డ్రగ్‌స్టోర్ సిబ్బంది రూట్లను ఖరారు చేస్తుంది. ఇప్పటికే కొన్నింటిని రూపొందించింది కూడా. ఒక రూట్‌లో కొన్ని పీహెచ్‌సీలు, కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లు కలిసేలా రూట్‌ను రూపొందించి అందుకనుగుణంగా మందులను ఒకేసారి ఆ వాహనం ద్వారా ఆస్పత్రులకు చేరవేస్తారు. ఇచ్చోడ, నిర్మల్, కడెం, భైంసా, ఉట్నూర్, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, మంచిర్యాల, చెన్నూర్, ఆదిలాబాద్ చుట్టుపక్కల పీహెచ్‌సీలు, ఆస్పత్రులు కలిసేలా రూట్లను రూపొందించారు.
నో వర్రీ.. ఇక డోర్ డెలివరీ
Published Sun, Feb 16 2014 2:23 AM | Last Updated on Fri, May 25 2018 2:14 PM
Advertisement