న్యూఢిల్లీ: తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ఈనెల 2న విడుదలై బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. దీంతో ఎంతో చరిత్రాత్మాక నేపథ్యం ఉన్న ఈ సినిమాను పలువురు రాజకీయ ప్రముఖుల చేత వీక్షింపచేయాలని మెగాస్టార్ చిరంజీవి భావిస్తున్నారు. దీనిలో భాగంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు చిరంజీవి బుధవారం ఢిల్లీకి పయనమయ్యారు. ఉప రాష్ట్రపతి కోసం ప్రత్యేకంగా ఆయన నివాసంలో ఈ రోజు సాయంత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్ర ప్రదర్శన జరగనున్నది. వెంకయ్యనాయుడితో కలిసి చిరంజీవి సినిమాను వీక్షించనున్నారు. అనంతరం ‘సైరా’ విశేషాలను వారిరువరు చర్చించుకోనున్నారు.
అదేవిధంగా ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో భేటీ కానున్నట్టు సమాచారం. సైరా సినిమా చూడాలని చిరంజీవి వారిరువురిని కోరనున్నట్టు తెలుస్తోంది. కాగా ఈనెల 5న తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌ను చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చూడాలని ఆమెను చిరంజీవి కోరారు. చిరంజీవి ఆహ్వానం మేరకు గవర్నర్ ప్రత్యేకంగా ఈ సినిమాను వీక్షించారు. అదేవిధంగా సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి దంపతులు మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక చిరంజీతో భేటీ కావడం ఇదే తొలిసారి కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment