విశాఖ ఏయూ కన్వెన్షన్ హాల్లో జరిగిన సదస్సులో మాట్లాడుతున్న హోంమంత్రి మేకతోటి సుచరిత. చిత్రంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు
సాక్షి, విశాఖపట్నం : ఇకపై రాష్ట్రంలో మహిళలెవ్వరూ పోలీస్‌స్టేషన్ వరకూ వెళ్లకుండానే భద్రత కల్పించేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. గురువారం విశాఖ ఏయూ కన్వెన్షన్ హాల్లో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ‘మహిళా మిత్ర’ సేవలను డీజీపీ గౌతమ్ సవాంగ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితతో కలసి ఆమె ప్రారంభించారు. అనంతరం ‘ఉమెన్ సేఫ్టీ ఇన్ సైబర్ స్పేస్’ అవగాహన సదస్సులో మాట్లాడారు. వేధింపులకు గురవుతున్న మహిళలు పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారన్నారు. అలాంటి వారు తమ సమస్యలను విన్నవించుకోవడానికి ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ఒకరిద్దరు ‘మహిళా మిత్ర’ పోలీసులను నియమిస్తున్నట్లు తెలిపారు.
చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఎలాంటి సమస్య ఉన్నా.. మహిళా మిత్రలకు చెప్పిన క్షణం నుంచి దోషులకు శిక్ష పడే వరకు వారు మీకు రక్షణగా ఉంటారని పేర్కొన్నారు. సోషల్ మీడియా ద్వారా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో సైబర్ మిత్ర పేరుతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహిళలకు ఎలాంటి సైబర్ సమస్యలున్నా 9121211100కు వాట్సాప్ చేయాలని సూచించారు. మెసేజ్ చేసిన కొన్ని నిమిషాల్లోనే సైబర్ పోలీసులు ఫోన్ చేసి సమస్య తెలుసుకుంటారన్నారు. త్వరలో సైబర్ నేరాలను నియంత్రించడానికి ‘సైబర్ మిత్ర’ యాప్ కూడా రూపొందిస్తామని, ఒక క్లిక్‌తోనే నేరుగా డీజీపీకి సమాచారం వెళ్తుందని తెలిపారు.
సైబర్ నేరగాళ్లను నిరోధించాలి..
సోషల్ మీడియాలో లైంగిక వేధింపులను ఎదుర్కోవడానికి సైబర్ వారియర్స్‌లా పనిచేయాలని మహిళలకు డీజీపీ గౌతమ్ సవాంగ్ పిలుపునిచ్చారు. వలంటీర్‌గా బాధ్యతలు తీసుకుని అందరికీ అవగాహన కల్పించాలని ఏయూ కళాశాల విద్యార్థినులను కోరారు. భయంతో, పిరకితనంతో ఆత్మహత్యలు చేసుకోవద్దని, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లను హ్యాక్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లను పూర్తిగా నిరోధించాలన్నారు. రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. మహిళలంతా స్వేచ్ఛగా పోలీసుస్టేషన్‌కి వెళ్లి తమ సమస్యలను చెప్పుకునే విధంగా పోలీస్ మిత్రలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ ఆర్‌కే మీనా, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఏయూ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి, డీఐజీ రంగారావు, జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వాసవి మిత్ర గ్రూప్ కీర్తి, ప్రొఫెసర్ వల్లి కుమారి, ఏయూ విద్యార్థినులు పాల్గొన్నారు.
దాడి ఘటనపై విచారణకు ఆదేశించాం: హోం మంత్రి
ఎన్‌ఎమ్‌సీ బిల్లుకు వ్యతిరేకంగా బుధవారం విజయవాడలో జరిగిన ధర్నాలో జూనియర్ డాక్టర్లపై పోలీసులు చేయిచేసుకోవడంపై విచారణకు ఆదేశించామని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. ‘మహిళా మిత్ర’ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ధర్నాలు, ర్యాలీలు చేయదలుచుకుంటే ముందుగా అనుమతి తీసుకోవాలని, శాంతియుతంగా చేపట్టే నిరసనలకు ప్రభుత్వం అనుమతిస్తుందని చెప్పారు. హింసాత్మక ఘటనలకు పాల్పడవద్దని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment