చీరాల, న్యూస్‌లైన్ : మండల విద్యాశాఖాధికారి, ఉపాధ్యాయుల మధ్య శుక్రవారం వాగ్వాదం జరిగింది. పాఠశాల సమయానికి తెరవకపోవడంతో ఉపాధ్యాయులకు మెమోలు ఇచ్చానని ఎంఈఓ చెబుతున్నారు. కేవలం 5 నిమిషాలు ఆలస్యమైతేనే మెమోలు ఇచ్చి వేధిస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు ఎంఈఓతో వాగ్వాదానికి దిగారు. జారీ చేసిన నోటీసులు ఉపాధ్యాయులు తీసుకోకుండా తిరస్కరించారు.
వివరాలు..
శుక్రవారం ఉదయం 9గంటల ప్రాంతంలో ఎంఈఓ డి.రత్నకుమారి చీరాల రూరల్ మండలంలోని ఈగావారిపాలెం, గవినివారిపాలెం, కొత్తపాలెం, పుల్లాయిపాలెం, లింగాపురం గ్రామాల్లోని పాఠశాలల తనిఖీకి వెళ్లారు. అయితే ఈ పాఠశాలలు ఉదయం 9 గంటల సమయంలో తెరుచుకోలే దు. ఎంఈఓ వెళ్లిన సమయంలో వాటికి తాళాలు వేసి ఉండటంతో ఆమె 16 మంది ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేశారు. మెమోలు తీసుకునేందుకు ఉపాధ్యాయులు తిరస్కరించారు.
ఉపాధ్యాయ సంఘాల నాయకులు, మెమోలు ఇచ్చిన ఉపాధ్యాయులు చీరాలలోని మండల విద్యావనరుల కేంద్రానికి చేరుకుని రూరల్ మండలంలో కనీసం బస్సు సౌకర్యం కూడా లేదని, తామంతా ఆటోలు లేక ఇబ్బందులు పడుతూ పాఠశాలకు ప్రతిరోజూ వెళుతున్నామని, 20 నిమిషాలు ఆలస్యంగా పాఠశాలకు వెళితే దానిని కూడా తప్పుగా చూపిస్తూ మెమోలు ఇవ్వడం వేధింపుచర్యలేనని ఎంఈఓతో వాగ్వాదానికి దిగారు. ఎంఈఓ మాత్రం తాను వెళ్లిన 9గంటల సమయంలో పాఠశాలకు తాళాలు వేసి ఉండటంతో మెమోలు ఇచ్చానని చెబుతున్నారు.
బస్సులు కూడా లేని గ్రామీణ ప్రాంతాలకు ఆటోల్లో వెళ్లి విధులు నిర్వహిస్తున్నామని, కేవలం 5నిమిషాలు ఆలస్యమైన ఉపాధ్యాయులకు మెమోలు ఇవ్వడం మంచిదికాదని, అవసరమైతే ఒక దఫా హెచ్చరించి సమయానికి రావాలని మౌఖికంగా ఆదేశించాలేగానీ, మెమోలు ఇవ్వడం తప్పన్నారు. ఈ విషయమై ఎంఈఓ, ఉపాధ్యాయులకు గంటపాటు వాగ్వాదం జరిగింది. చివరకు ఎంఈఓ జారీ చేసిన మెమోలను ఉపాధ్యాయులు తీసుకోకుండానే వెళ్లిపోవడం గమనార్హం.
16 మంది ఉపాధ్యాయులకు మెమోలు
Published Sat, Feb 22 2014 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 3:57 AM
Advertisement