
వసతి గృహంలో భోంచేస్తున్న విద్యార్థులు
వసతిగృహాల్లో విద్యార్థుల మెనూ డైట్ కంట్రోల్ చేస్తోంది. సంక్షేమ హాస్టళ్లు, అందులో చదివే విద్యార్థులంటే పాలకులకు ఎంత అలుసో.. వారి మెనూ చార్జీలే అద్దం పడుతున్నాయి. మెనూ చార్ట్ చూస్తే పంచభక్ష్యపరమాన్నాలు కనిపిస్తాయి. కంచంలోకి చూస్తే.. పచ్చడి మెతుకులు, నీళ్ల సాంబారు, జావగారే ఆకు కూరలే ఉంటాయి. సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల కోసం రూ.కోట్ల ఖర్చు చేస్తున్నామని పాలకులు గొప్పలు పోతున్నారు. వసతి గృహ విద్యార్థులకు గొప్పగా మోనూ ప్రకటించినా.. మెస్ చార్జీలు మాత్రం పెంచలేదు. ప్రస్తుతం ప్రతి రోజూ ఒక్కో విద్యార్థికి సగటున రూ.25.80 మెస్ చార్జీ ఇస్తుండగా, ప్రభుత్వం ప్రకటించిన మెనూ ప్రకారం రూ.100 వరకూ ఖర్చవుతోంది.
గూడూరు: రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహ విద్యార్థుల కోసం జూలై 1వ తేదీ నుంచి కొత్త మెనూ ప్రకటించింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం విద్యార్థులకు ఇస్తున్న మెనూ చార్జీలకు, అమలు చేయాల్సిన మోనూ ఖర్చుకు పొంతన లేకుండా ఉంది. 2012వ సంవత్సరానికి ముందుగా మెస్ చార్జీలు చాలా తక్కువగా ఉండడంతో అప్పటి మెనూనే అమలు సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. అప్పటి ప్రభుత్వం జీఓ ఎంఎస్ నంబర్ 39 ప్రకారం 2012 డిసెంబరు 7న అప్పటి మెనూను బట్టి 3 నుంచి 7వ తరగతి వరకూ ఉన్న మెస్ చార్జీలు ఒక్కో విద్యార్థికి రూ.430 నుంచి రూ.750కి పెంచారు. 8 నుంచి 10వ తరగతి వరకూ రూ.530 నుంచి రూ.850 వరకూ పెంచారు. ఈ లెక్కన ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.25.80 వంతున అందజేస్తున్నారు.
కానీ అప్పటి మోనూకూ విద్యార్థులకు అందజేసే మెస్ చార్జీలకూ పొంతన లేదు. దీంతో మెనూ ఆచరణ కూడా అంతంత మాత్రంగానే కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలో జీఓ ఎంఎస్ 82 ప్రకారం గత నెల 5వ తేదీ నుంచి మెనూ చార్జీలను నామమాత్రంగా పెంచి, మెనూను మాత్రం ఆచరణకు ఏ మాత్రం సరితూగని విధంగా రకరకాల పౌష్టికాహారాలను చేర్చేశారు. ఈ మెనూ ఈ నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినా..వసతి గృహాల్లో అమలుకు మాత్రం నోచుకోలేదు.
మెనూకు ధరాఘాతం
విద్యార్థుల మెనూకు ధరాఘాతం తగిలింది. గతంలో మెనూలో చికెన్ అసలు లేకుండా ఉంటే, ప్రస్తుతం ఆది, మంగళ, శుక్రవారాల్లో చికెన్ వేయాల్సి వస్తోంది. ప్రస్తుతం చికెన్ ధర కిలో రూ.200 పలుకుతోంది. వేరుశనగ ముద్ద కూడా మెనూలో లేదు. ప్రస్తుతం టిఫిన్‌తో రోజూ వేరుశనగ ముద్ద కచ్చితంగా ఇవ్వాల్సి వస్తోంది. గతంలో పాలు మెనూలో లేకుంటే ప్రస్తుతం ఒక్కో విద్యార్థికి ప్రతి రోజూ ఉదయం 100 ఎంఎల్ పాలు అందజేయాల్సి వస్తోంది. ఉదయం టిఫిన్‌లో పూరీని జోడించడం, రోజుకోక ఆకుకూర, వేరుశనగ పప్పు పచ్చడి తదితరాలను మెనూలో అదనంగా చేర్చారు. కోడిగుడ్డు ధర కూడా ప్రస్తుతం రూ.5 కుపైగానే ఉంది. ఇలా ధరాఘాతంతో వసతి గృహాల్లో మెనూ అంతంత మాత్రంగానే అమలవుతోంది. గతంలో మాదిరిగానే ప్రతి రోజూ స్కూల్ నుంచి రాగానే బెల్లంతో కలిపిన రాగి మాల్ట్‌ను అందజేయాల్సి ఉంది.
పెంచింది గోరంత..మెనూ కొండంత
మెనూ చార్జీలను కూడా ప్రభుత్వం పెంచింది గోరంత అయితే.. మెనూ అమలు కొండంతగా ఉంది. వసతిగృహాల్లోని విద్యార్థులకు ప్రస్తుతం జీఓఎంఎస్ 82 ప్రకారం గత నెల 5న విడుదల చేసిన ఉత్తర్వుల మేరకు 3 నుంచి 7వ తరగతి వరకూ ఒక్కో విద్యార్థికి రూ.750 నుంచి రూ.1000కి పెంచారు. 8 నుంచి 10వ తరగతి వరకూ రూ.850 నుంచి రూ.1,250కి పెంచారు. దీంతో ఒక్కో విద్యార్థికి సగటున రోజుకు రూ. 36.29 అవుతోంది. గతంలో ఉన్న మెస్ చార్జీలకూ, ప్రస్తుతం పెంచిన చార్జీలకూ వ్యత్యాసం రూ.10 మాత్రమే. కానీ గతంలో ఉన్న మెనూకూ, ప్రస్తుతం అందజేయాల్సిన మెనూకూ మాత్రం భారీ వ్యత్యాసం ఉంది.
భారీగా అప్పులు చేయాల్సి వస్తోంది
వసతి గృహాల వార్డెన్‌లు అవి సజావుగా సాగేందుకు ప్రతి నెలా అప్పులు చేయక తప్పడం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అప్పులు చేసి హాస్టళ్లను నడిపిస్తున్నట్లు వార్డెన్లు వాపోతున్నారు. అదనంగా మెనూలో చేర్చిన చికెన్‌తో పాటు, కోడిగుడ్లు అందించాలంటే 100 మంది విద్యార్థులు ఉన్న వసతి గృహాలకు పెరిగిన ధరలతో నెలకు రూ.30,000 వరకూ పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది.
వారాల వారీగా మెనూ
ఆదివారం ఉదయం: 100 ఎంఎల్ పాలు, పూరీలో బంగాళాదుంప కర్రీ, శనగ ముద్ద
మధ్యాహ్నం: ఫ్రైడ్ రైస్, పెరుగు, గోంగూర పచ్చడి, చికెన్ కర్రీ
రాత్రి: అన్నం, వంకాయ కూర, పాలకూర పప్పు, మజ్జిగ, అరటి పండు.
సోమవారం ఉదయం: పాలు, పెసలప్పు కిచిడీ, వేరుశనగ పచ్చడి, కోడిగుడ్డు, వేరు శనగముద్ద
రాత్రి: అన్నం, దోసకాయకూర, తోటకూర పప్పు, మజ్జిగ
మంగళవారం ఉదయం: పాలు, పులిహోర, కోడిగుడ్డు, వేరుశనగ ముద్ద
రాత్రి : ఫ్రైడ్‌రైస్, చికెన్ కర్రీ, గోంగూర పప్పు, మజ్జిగ, అరటి పండు
బుధవారం ఉదయం: పాలు, ఇడ్లీ, వేరుశనగ పచ్చడి, కోడిగుడ్డు, వేరుశనగ ముద్ద
రాత్రి: అన్నం, బంగాళాదుంప కూర, గోంగూర పచ్చడి, మజ్జిగ, అరటి పండు
గురువారం ఉదయం: పాలు, గోధుమ రవ్వ ఉప్మా, వేరుశనగ పచ్చడి, కోడిగుడ్డు, వేరుశనగ ముద్ద
రాత్రి: అన్నం, సొరకాయకూర, తోటకూరపప్పు, మజ్జిగ, అరటి పండు
శుక్రవారం ఉదయం: పాలు, పొంగలి, వేరుశనగ పచ్చడి, కోడిగుడ్డు, వేరుశనగ ముద్ద
రాత్రి: ఫ్రైడ్‌రైస్, చికెన్ కర్రీ, గోంగూర పచ్చడి, మజ్జిగ, అరటి పండు
శనివారం ఉదయం: పాలు, ఇడ్లీ, కోడిగుడ్డు, వేరుశనగ ముద్ద
రాత్రి: అన్నం, కూరగాయల కర్రీ, గోంగూర పచ్చడి, మజ్జిగ, అరటిపండు
Comments
Please login to add a commentAdd a comment