సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) 16 ఏళ్ల క్రితం ముగిసిన గ్రూప్-2 నియామకాలపై మరోసారి మెరిట్ జాబితా రూపొందిస్తోంది. 1999 గ్రూప్-2 నియామకాలకు సంబంధించి ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఈ కొత్త జాబితా తయారీలో తలమునకలైంది. త్వరలోనే ఈ జాబితాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అందిస్తామని, తదుపరి చర్యలు వారు తీసుకోవలసి ఉంటుందని కమిషన్ వర్గాలు వివరించాయి. ఉమ్మడి రాష్ట్రంలో 1999లో దాదాపు 250 పోస్టులకు సంబంధించి అప్పటి ప్రభుత్వం గ్రూప్-2 నోటిఫికేషన్‌ను విడుదల చేసి నియామకాలు కూడా చేసింది.
అయితే ఆ తరువాత అదే నోటిఫికేషన్లో మరో 973 పోస్టులను చేర్చి మెరిట్ జాబితాలోని అభ్యర్థులతో భర్తీచేసింది. మరోసారి 111 పోస్టులను మళ్లీ అదే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేశారు. అయితే ఈ నియామకాల్లో మొదట పోస్టింగ్‌లు పొందిన అభ్యర్థుల్లో కొందరు కోర్టును ఆశ్రయించారు. తాము మెరిట్‌లో ఉన్నా తమకు సరైన పోస్టులు రాలేదని, తరువాత చేపట్టిన నియామకాల్లో తమకన్నా తక్కువ మార్కులు వచ్చిన వారికి మంచి పోస్టులు వచ్చాయని వాదించారు. దీంతో మూడు విడతల పోస్టులను కలిపి కామన్ మెరిట్ జాబితా రూపొందించి నియామకాల్లో జరిగిన తప్పులను సరిదిద్దాలని న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేయడంతో మళ్లీ జాబితా రూపొందిస్తున్నట్లు ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి. అయితే ఇంతకాలం తర్వాత ఇప్పుడు కొత్తగా మెరిట్ జాబితా రూపొందించి మళ్లీ నియామకాలు ఎలా చేపడతారన్న దానిపై సందిగ్ధత నెలకొంది. అప్పట్లో పోస్టింగ్‌లు పొందిన వారు ఇప్పుడు పదోన్నతులపై వేర్వేరు కేడర్లలో ఉంటారు. వారిని ఇపుడు మార్పుచేయడం సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్న అధికారులు 1999 నాటి నోటిఫికేషన్ ప్రకారం అప్పుడున్న పోస్టుల్లోకి వెనక్కి వెళ్లేందుకు ఇష్టపడరని కమిషన్ వర్గాలు పేర్కొంటున్నాయి.
రెండుగా ఏపీ హౌజ్ ఫెడ్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సహకార గృహ నిర్మాణ సంఘాల సమాఖ్య(ఏపీ హౌజ్ ఫెడ్)ను రెండుగా విభజించినట్టు హౌజ్ ఫెడ్ చైర్మన్ గోపాల్‌రెడ్డి తెలిపారు. మంగళవారమిక్కడ హౌజ్ ఫెడ్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు ఏపీ హౌజ్ ఫెడ్, తెలంగాణ హౌజ్ ఫెడ్‌లుగా విభజించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ హౌజ్ ఫెడ్‌కు సంబంధించిన ఆస్తులు, అప్పుల పంపకంతో పాటు సంస్థకు చెందిన భవనంలోని మొదటి, రెండో అంతస్తులు ఏపీ హౌజ్ ఫెడ్‌కు, మూడు, నాలుగో అంతస్తులు తెలంగాణ హౌజ్ ఫెడ్‌కు కేటాయించినట్టు చెప్పారు. జూన్ 2 నుంచి ప్రభుత్వ అనుమతితో ఈ రెండు ఫెడరేషన్లు వేర్వేరుగా కార్యకలాపాలు నిర్వహిస్తాయని చెప్పారు. తెలంగాణ హౌజ్ ఫెడ్ చైర్మన్‌గా కె.నవనీతరావు, వైస్ చైర్మన్‌గా వసంతరావు దేశ్‌పాండేలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌజ్ ఫెడ్ ఎండీ జి.గోపాల్‌నాయక్, ఏపీ హౌజ్ ఫెడ్ వైస్ చైర్మన్ రామ్‌మోహన్‌రావు, హౌజ్ ఫెడ్ జీఎం వసంతరావు, డెరైక్టర్ ఎ. కిషన్‌రావు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.