'విజయవాడ నడిబొడ్డుకు రండి.. తేల్చుకుందాం'
హైదరాబాద్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జాతీయ ప్లీనరీపై చర్చించడానికి, విమర్షించడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అర్హత లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. మూడంచెల్లో ప్లీనరీని సిద్ధం చేసిన గొప్పదార్శనీకుడు వైఎస్ జగన్ అని అన్నారు. కార్యకర్తల నుంచి నాయకుల వరకు అన్ని అంశాలపై చర్చించుకునే అవకాశాన్ని వైఎస్ జగన్ ఇచ్చారని చెప్పారు. ఇచ్చిన హామీలను అమలుచేయడంలో విఫలమవడంతో వాటన్నింటిని కూడా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఖండించి ప్రజల ముందు ఉంచామని, ఈ మాత్రానికి చంద్రబాబు సర్కార్ ఎందుకు భయపడుతోందని నిలదీశారు.
దేవీనేని ఉమ, జవహర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అసలు వీరికి ఏం అర్హత ఉందని ప్రశ్నించారు. దళితులను వెలివేస్తే మాట్లాడని జవహర్ ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉమామహేశ్వరరావు కృష్ణా, గుంటూరు జిల్లాలలో పాల్పడుతున్న అవినీతి ప్రతిఒక్కరికీ తెలుసన్నారు. వైఎస్ జగన్‌పై అవాకులు, చవాకులు ఆపి దమ్ముంటే బహిరంగ చర్చకు రండి, విజయవాడ నడిబొడ్డున తేల్చుకుందామని సవాల్ విసిరారు.
తమ పార్టీలోని ఏ ఒక్కరు వచ్చైనా సమాధానం చెప్పి తీరుతారన్నారు. రాష్ట్రంలో దళితులను వెలివేస్తుంటే అక్కడకు వెళ్లడం చేతగానీ చంద్రబాబు సర్కార్‌కు ఏం అర్హత ఉందని విమర్శలు చేస్తున్నారని నిలదీశారు. ప్రజా సమస్యలపై వైఎస్ జగన్ నిరంతరం చేస్తున్న పోరాటాన్ని స్వాగతించాలన్నారు. వైఎస్ జగన్ ఇచ్చిన తొమ్మిది వాగ్దానాలను కచ్చితంగా ప్రతి ఇంటికి తీసుకెళతామని స్పష్టం చేశారు. 600 వాగ్దానాలు ఇచ్చి ఆరు కూడా అమలు చేయలేని నిస్సహాయత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిదని ధ్వజమెత్తారు. త్వరలోనే టీడీపీ రథచక్రాలు ఊడగొట్టి పడగొడతామని విశ్వసం వ్యక్తం చేశారు.