ఇక మాకు నవ వసంతం
వైఎస్సార్‌సీపీ ప్లీనరీ నిర్ణయాలపై అభిమానుల్లో ఆనందం
ఆ తొమ్మిది పథకాల ప్రకటనే కడుపు నింపింది..
దశలవారీ మద్య నిషేధం మహిళలకు సంతోషకరం
ఎన్నికల కోసమే ఎదురు చూస్తున్నామని వెల్లడి
త్వరలో మంచి రోజులు ఖాయమంటున్న దివ్యాంగులు
సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లీనరీలో వైఎస్ జగన్ హామీలు.. కార్యకర్తలు, అభిమానుల్లో ఉత్సాహం నింపాయి. రెండవ రోజైన ఆదివారం వైఎస్సార్ ప్రాంగణం జనసందోహంతో కిక్కిరిసింది. యువత కేరింతలు.. రైతుల్లో ఆనందం.. మహిళల్లో నూతనోత్తేజం వెరసి కదనోత్సాహం ఉప్పొంగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని నలుమూలల నుంచి తరలి వచ్చిన వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానుల సందడితో ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన తొమ్మిది పథకాలే రాష్ట్ర ప్రజల బంగారు భవితకు భరోసా అంటూ అభిమానగణం ఆనందపడింది.
ఇక ఎన్నికలు వస్తే అధికార పక్షానికి చుక్కలు చూపించి తమ అభిమాన నేత జగన్‌మోహన్‌రెడ్డికి పట్టం కట్టేందుకు సిద్ధమని పేర్కొంది. ప్లీనరీ సమావేశాల్లో దివ్వాంగులు మేము సైతం అంటూ సందడి చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న ప్రేమ ముందు సమస్యలు చాలా చిన్నవని పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడికి చెందిన స్వాతిపత్రిరాజా, కంతేరుకు చెందిన లక్ష్మణ్‌రెడ్డి అన్నారు. పింఛన్ మొత్తం పెంచుతానని జగన్ హామీ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ‘ప్లీనరీలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన తొమ్మిది సంక్షేమ పథకాలే ఆయన విజయానికి రక్షగా నిలుస్తాయి. ఆ పథకాలే అమలైతే రామ రాజ్యం వచ్చినట్లే. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా వైఎస్ జగన్ పథకాలు ప్రకటించారు. రైతుకు ఎంతో న్యాయం జరుగుతుంద’ని తిరుపతికి చెందిన విరుపాక్ష జయచంద్రారెడ్డి అన్నారు.
మా ఆవేదన అర్థం చేసుకున్నారు..
పచ్చని సంసారాల్లో మద్యం చిచ్చురేపుతోంది. నిన్నటి వరకూ రోడ్ల పక్కన ఉన్న మద్యం దుకాణాలు ఇప్పుడు ఇళ్ల మధ్యకు వచ్చాయి. ఇళ్ల మధ్య షాపులు వద్దంటే కేసులతో భయపెడుతున్నారు. బెల్టు దుకాణాలను నిరోధిస్తానని చెప్పిన చంద్రబాబు మాట తప్పారు. మా ఆవేదనను అర్థం చేసుకున్న జగన్ దశల వారీగా మద్యం నిషేధిస్తానని ఇచ్చిన హామీ చెప్పలేని ఆనందాన్ని నింపింది. కాళ్ల నొప్పులు ఉన్నా రాజన్న బిడ్డను చూసేందుకే వచ్చాం. చంద్రబాబు మూడేళ్ల పాలనలో పచ్చ చొక్కా తొడిగిన వారు దోచుకుతిన్నారు. ఎన్నికల్లో వారికి బుద్ధి చెబుతాం.
– భీంరెడ్డి జయలక్ష్మి, నూతక్కి, గుంటూరు జిల్లా
ఇంతకంటే ఏం కావాలి?
చంద్రబాబు వస్తే డ్వాక్రా రుణాలు మాఫీ అన్నాడు. కానీ రూ.10 వేలు కూడా ఇవ్వలేదు. ప్రతి మహిళను లక్షాధికారి చేస్తానన్న హామీని తుంగలోతొక్కాడు. వైఎస్సార్ సీపీ అధినేత తొమ్మది ప«థకాల్లో వైఎస్సార్ ఆసరా అద్భుతమైన పథకం. ప్రతి మహిళకు వడ్డీలేని రుణాలు అందించి వారికి ఆర్థిక తోడ్పాటు ఇస్తానన్నాడు. ఇంతకంటే ఏం కావాలి? రెండేళ్లుగా డ్వాక్రా మహిళలకు బ్యాంకర్లు రుణాలు కూడా ఇవ్వలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి బతికుంటే మా బతుకులు బాగుండేవి. ఆయన రాజ్యం రావాలంటే జగన్ సీఎం కావాలి. అప్పుడే మాకు న్యాయం జరుగుతుంది.
– పి.రంగమ్మ, కోనరాజుపేట, తూర్పుగోదావరి జిల్లా
జగన్ సీఎం కావడం తథ్యం
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కన్పించిన కళ వైఎస్సార్ సీపీ జాతీయ ప్లీనరీలో కన్పిస్తోంది. ఈ జనాన్ని చూస్తుంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం తథ్యం. ఎవరినీ డబ్బులిచ్చి జనాన్ని తరలించలేదు. అందరూ స్వచ్ఛందంగా వచ్చిన వారే. వైఎస్ జగన్ ప్రకటించిన తొమ్మది సంక్షేమ పథకాలు.. ఆయన ఆదర్శమైన పాలన ఎలా ఉంటుందో చెప్పేందుకు నిదర్శనాలు. ఇప్పుడు అందరి లక్ష్యం జగన్ సీఎం కావడమే.
– బొక్కా వెంకటలక్ష్మి, వెదురేశ్వరం, రావులపాలెం మండలం, తూర్పుగోదావరి జిల్లా
రైతులకిక మంచి రోజులు
నా వయస్సు 75 ఏళ్లు. కాళ్లు నొప్పులు వచ్చాయి. నడవలేని పరిస్థితి. జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకే శరీరంలో సత్తువ తెచ్చుకొని ప్లీనరీకి వచ్చా. చంద్రబాబు రైతుల్ని మోసం చేశాడు. రుణమాఫీ పేరుతో దగా చేశాడు. ఆయన మాటలు నమ్మి రుణాలు కట్టకపోవడంతో బ్యాంకర్లు నోటీసులు ఇచ్చారు. మా బిడ్డలూ రైతులే. వారు పడే కష్టాలు మరెవరూ పడకూడదు. అందుకే రైతుకు న్యాయం జరిగేలా రాజన్న బిడ్డ మంచిగా ఆలోచించి ఏటా పెట్టుబడి ఇస్తానన్నాడు. ఇంతకంటే ఆనందం ఏముంటుంది?
– జి.సోమసుందర్, ద్రాక్షారామం, తూర్పుగోదావరి జిల్లా
పింఛన్‌దారులకు పండుగే
నేను దివ్వాంగురాలిని. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు ఇతరుల సాయంతో ప్లీనరీకి వచ్చా. దివంగత నేత వైఎస్సార్ వల్ల లబ్ధిపొందాం. ఆయన తనయుడుగా జగన్ అంటే ఎనలేని అభిమానం. పింఛన్ సొమ్ము రూ.2 వేలకు పెంచుతానని జగన్ హామీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఆ పింఛన్ సొమ్ముతో నెలంతా గడుస్తుంది. పండుగలాంటి ప్రకటన ఇది.
– మొఘల్ షాలిబేగ్, డోన్, కర్నూటు జిల్లా