'టీడీపీ గుండెల్లో అప్పుడే రైళ్లు.. వెన్నులో చలి'
గుంటూరు: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నవరత్నాల్లాంటి తొమ్మిది కార్యక్రమాలు ప్రకటించిన తర్వాత తెలుగుదేశం పార్టీ గుండెల్లో రైలు పరుగెడుతున్నాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ వెన్నులో చలి పుట్టుకొచ్చిందని, టీడీపీ భవిష్యత్, లోకేశ్ భవిష్యత్ నట్టేట మునిగినట్లేనని ఆ పార్టీ మంత్రులంతా మదనపడుతున్నారని చెప్పారు. ఇప్పుడు ఎక్కడ చూసినా వైఎస్ జగన్ ప్రకటించిన కార్యక్రమాల గురించే అద్భుతంగా చర్చించుకుంటున్నారని, ఇది చూసి ఓర్వలేని చంద్రబాబు, ఆయన మంత్రులు, తాబేదార్లు పాతపద్ధతిలోనే వైఎస్ జగన్ మరోసారి జైలు వెళతారంటూ అవాకులు, చవాకులు పేలుతున్నారని ధ్వజమెత్తారు.
వైఎస్ జగన్ బయట ఉంటే చంద్రబాబు నాయుడికి, ఆయన పార్టీకి పుట్టగతులు ఉండవని, మనుగడ సాగించలేరని ఉద్దేశంతోనే మరోసారి ఆయనను జైలుకు పంపే కుట్రలు చేస్తున్నారా అని నిలదీశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా రెండు రోజులపాటు జాతీయ ప్లీనరీని నిర్వహించిన విషయం తెలిసిందే. యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కేఎస్ జవహర్‌లాంటి మంత్రులంతా ప్లీనరీపై అవాకులు చవాకులు పేలారు. ఈ నేపథ్యంలో సోమవారం మీడియాతో మాట్లాడిన అంబటి నిప్పులు చెరిగారు. 42వంటకాలతో భోజనాలు వండి వార్చి మహానాడుకు రండహో అని పిలిచినా వచ్చిన ఆ కొద్ది మంది కూడా భోజనాలు చేసి ఎటువాళ్లు అటు వెళ్లారని అన్నారు.
కానీ, తాము మాత్రం కేవలం ఆకలి తీర్చే వంటకాలనే చేసినా కనీవినీ ఎరుగని రీతిలో అశేష జనవాహిని ప్లీనరీకి హాజరైందని, ఇది చూసి టీడీపీ అసూయపడిందని చెప్పారు. ప్లీనరీలో వైఎస్ జగన్ ప్రభంజనం చూసి టీడీపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని, వారి భవిష్యత్ ఏమవుతుందో అని ఆందోళన మొదలైందని చెప్పారు. అవినీతి సొమ్ముతో ప్లీనరీ జరిపామని దేవినేని ఉమ ఆరోపణలు చేస్తున్నారని, ఎవరు అవినీతి సొమ్ముతో ఆర్భాటంగా మహానాడు నిర్వహించారో ఆత్మ విమర్ష చేసుకుంటే మంచిదన్నారు. ఇప్పటికే మహానాడుకు వచ్చిన జనాభా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి వచ్చిన జనాభాపై ఇంటెలిజెన్స్‌తో నివేదిక తెచ్చుకున్న టీడీపీ సర్కార్ షాక్‌లోకి వెళ్లిపోయిందని, మున్ముందు అలాంటి షాకులు ఇంకా ఉంటాయన్నారు.
నవరత్నాల్లాంటి కార్యక్రమాలు ప్రకటించి డాక్టర్ వైఎస్‌ఆర్‌లాగా ప్రజలకు బాసటగా ఉంటానని వైఎస్ జగన్ ప్రకటించడంతో టీడీపీకి ముచ్చెమటలు పడుతున్నాయన్నారు. ఎన్టీఆర్ మద్యం నిషేదం చేస్తే చంద్రబాబు మాత్రం సందుసందుకు బార్, ఇంటింటికి బీరులా పరిస్థితి తయారు చేశారని, కానీ, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం మద్యం నిషేధిస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. వైఎస్ జగన్ పాదయాత్ర ప్రకటించడంతోపాటు తండ్రికి మించిన తనయుడిలా 3000 కిలోమీటర్లు పాదయాత్ర ఉంటుందని చెప్పడంతో టీడీపీ కుసాలు కదిలిపోతున్నాయని అన్నారు. అత్యద్భుతంగా వైఎస్ జగన్ పాదయాత్ర ఉంటుందని స్పష్టం చేశారు.
బాబు అవినీతిని రుజువు చేస్తాం.. డేట్, టైం చెప్పండి
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అవినీతిని ముమ్మాటికి రుజువు చేసి తీరుతాం అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. తాము చేసిన ఆరోపణలు నిరూపించాలని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అంటున్నారని దానికి తాము సిద్దం అని చెప్పారు. ఎక్కడ? ఎప్పుడు? చర్చకు రమ్మన్నా తాము సిద్ధం అని సవాల్ విసిరారు. తామెదో గాలికి మాటలు అనలేదని, తాము చెప్పిన ప్రతిమాట నిజమని, అందుకే ఆధారాలతో సహా చంద్రబాబు అవినీతి చక్రవర్తి పేరిట ప్రత్యేక పుస్తకాన్ని విడుదల చేశామని, ఆ పుస్తకంలోని దేన్ని నిరూపించేందుకైనా సిద్ధమన్నారు.
ఎన్‌సీఏఆర్ సంస్థ చేసిన సర్వేలో ఏపీ నెంబర్ అవినీతిలో ఉందని చెప్పిందని ఇంతకంటే ఇంకే రుజువు కావాలని అన్నారు. బాబుకు దమ్ముంటే ఆయన అవినీతిపై విచారణ వేయాలని అది ఏ ఐఏఎస్‌తోనో కాకుండా జ్యుడిషియల్ విచారణ, సీబీఐ విచారణ అయ్యుండాలని సవాల్ విసిరారు. బడ్జెట్ కంటే కూడా ఎక్కువ అవినీతికి పాల్పడిన చరిత్ర చంద్రబాబునాయుడిదని మండిపడ్డారు. రాజధాని భూముల పేరిట, విశాఖపట్నం భూముల పేరిట చంద్రబాబు రెండు లక్షల కోట్లు అక్రమంగా వెనుకేసుకున్నారని స్పష్టం చేశారు.