విజయవాడ, విశాఖపట్నాలలో త్వరలోనే మెట్రోరైలు
త్వరలోనే విజయవాడ, విశాఖపట్నాలలో మెట్రోరైలు నిర్మాణం పూర్తవుతుందని, విశాఖ మెట్రోను పీపీపీ పద్ధతిలో నిర్మించాలని చూస్తున్నామని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చెప్పారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గవర్నర్ ప్రసంగంలో మరికొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి...
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో వ్యవసాయ, అనుబంధ రంగాలు 24.44 శాతం గణనీయ అభివృద్ధిని నమోదు చేశాయి
- రాష్ట్రంలో 28 శాతం లోటు వర్షపాతం ఉన్నా ఈ అభివృద్ధి సాధ్యమైంది
- వ్యవసాయం 3.69%, మత్స్య పరిశ్రమ 42.57%, పశుగణం 14.91%, ఉద్యానవనం 18.33%వృద్ధిరేట్లు సాధించాయి.
- పరిశ్రమలు, సేవా రంగాలు వరుసగా 9.98%, 9.57% వృద్ధిరేట్లు సాధించాయి.
- పెట్టుబడులకు మంచి వాతావరణం ఉండేందుకు ఆకర్షణీయమైన ద్రవ్య ప్రోత్సాహకాలతో కూడిన పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం రూపొందించింది.
- ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్స్, ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్, ఆటోమొబైల్స్, ఏరోస్పేస్, డిఫెన్స్, పర్యాటక, ఇతర రంగాల అభివృద్ధికి విధానాలు రూపొందించింది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవకాశాలు కల్పిస్తున్నాం.
- వివిధ రంగాల్లో కృషికి గుర్తింపుగా రాష్ట్రానికి పలు అవార్డులు వచ్చాయి. అవి.. ఇంధన సామర్థ్య పరిరక్షణకు ఆ రంగంలో ఐదు అవార్డులు, నీటి యాజమాన్యానికి సంబంధించి సాగునీటి రంగంలో ఒకటి, సులభతర వాణిజ్య నిర్వహణకు పారిశ్రామిక రంగంలో ఒకటి, మీకోసం పోర్టల్‌కు సంబంధించి రెవెన్యూ రంగంలో ఒకటి, ఈ-పాలన, ఆర్థిక నిర్వహణకు సంబంధించి ఆర్థికశాఖకు 3 అవార్డులు వచ్చాయి.
- 2016 సంవత్సరానికి సంబంధించి ఆర్‌బీఐ నివేదిక ప్రకారం ప్రైవేటు రంగ పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ అగ్రస్థానంలో ఉంది
- కర్నూలు, ప్రకాశం, రాజమండ్రి, తరుపతి, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో వారసత్వ ప్రదేశాలను పర్యాటకపరంగా అభివృద్ధి చేస్తాం
- తిరుపతి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కడప దర్గా, మహానంది, సింహాచలం, అన్నవరం, విజయవాడ లాంటి పవిత్ర ప్రదేశాలను మతపరమైన పర్యాటక కేంద్రాలుగా రూపొందిస్తాం.
- విద్యుత్ రంగంలో 2014 జూన్ నాటికి 22.5 మిలియన్ యూనిట్ల లోటు ఉండగా ఇప్పుడు విద్యుత్ మిగులు రాష్ట్రంగా రూపొందాం.
- అధికార భాషాసంఘం స్థానంలో తెలుగుభాషా ప్రాధికార సంస్థను ఏర్పాటు చేస్తున్నాం.
- క్రీడారంగంలో నవశకం కోసం 2017-22 క్రీడా విధానాన్ని ప్రకటించాం. జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో ఏపీ యువత పోటీపడి ఫలితాలు సాధించేందుకు అవసరమైన మౌలిక సౌకర్యాల మద్దతు కల్పిస్తున్నాం.
- ఇటీవల ఒలింపిక్స్‌లో పీవీ సింధు ప్రదర్శనను గుర్తించి డిప్యూటీ కలెక్టర్ పదవి ఇస్తామని ప్రతిపాదించగా ఆమె అంగీకరించారు.
- అంటువ్యాధులు రాకుండా దోమలను నివారించేందుకు 'దోమలపై దండయాత్ర' చేపట్టాం.
- అమరావతిలో తొమ్మిది థీమ్ నగరాలను నిర్మించాలని ప్రతిపాదించాం.
- రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు మూలధన లాభాలపై పన్ను మినహాయింపు ఇచ్చినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు
- త్వరలోనే విజయవాడ, విశాఖపట్నాలలో మెట్రోరైలు నిర్మాణం పూర్తవుతుంది. విశాఖ మెట్రోను పీపీపీ పద్ధతిలో నిర్మించాలని చూస్తున్నాం
- విజయవాడ చుట్టూ 110 కిలోమీటర్ల మేర హైస్పీడ్ సర్క్యులర్ సబర్బన్ రైలు నిర్మాణం చేపట్టే చర్యలు ప్రారంభించాం.
- పేదలకు గృహవసతి కోసం.. 4 లక్షల పూర్తికాని ఇళ్లను పూర్తి చేసే పనులు చేపట్టాం. వచ్చే రెండేళ్లలో పది లక్షల ఇళ్లు పూర్తిచ ఏయాలనే లక్ష్యం పెట్టుకున్నాం
- మచిలీపట్నం, భావనపాడు ఓడరేవులకు భూసేకరణ పనులు ప్రారంభించాం. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాల్లో సరిహద్దుల నిర్ణయం ద్వారా గుర్తించిన భూమి కోసం భూసేకరణ వేగవంతం చేస్తున్నాం
- విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం విమానాశ్రయాలు ప్రయాణికుల రద్దీలో అత్యధిక అభివృద్ధి నమోదు చేశాయి.
- భోగాపురం, ఓర్వకల్లు, దగదర్తి వద్ద కొత్త విమానాశ్రయాల పనులు, విజయవాడ, రాజమండ్రి వద్ద విస్తరణ పనులు జరుగుతున్నాయి
- ఫైబర్ గ్రిడ్‌లో భాగంగా 15 ఎంబీపీఎస్ స్పీడుతో ఇంటర్నెట్, వీడియో, అన్నిచానళ్లతో టీవీ, మూడు ఫోన్ సదుపాయాలను నెలకు రూ. 149కే అందిస్తున్నాం
- పెద్దనోట్ల రద్దును ప్రభుత్వం సమర్థిస్తోంది. ఆర్థిక వ్యవస్థ నుంచి నల్లధనాన్ని రాజకీయ నల్లధన వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ఈ చర్య దీర్ఘకాలం కొనసాగుతుంది.
- ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, కాపులు, బ్రాహ్మణుల సంక్షేమం కూడా మా సంక్షేమ ఎజెండాలో భాగం
- అవినీతి అంతం కోసం డిజిటల్ టెక్నాలజీని సమర్ధంగా ఉపయోగించుకుంటున్నాం. నిజాయితీపరులను ప్రోత్సహించి, పటిష్ఠమైన నైతిక వ్యవస్థను అభివృద్ధి చేయాలి.