చేపలు ఎండబెట్టేందుకు ‘మైక్రోవోవెన్’..
రూపొందించిన సీఐఎఫ్‌టీ
సాక్షి, విశాఖపట్నం: చేపలను ఎండబెట్టడానికి సరి కొత్త విధానం రాబోతోంది. ఇప్పటిదాకా మత్స్యకారులు వీటిని సాంప్రదాయ పద్ధతిలో ఎండబెట్టే వారు. దీనివల్ల నాణ్యత లోపించడంతో పాటు చేపలు అపరిశుభ్రంగా తయారవుతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు గానూ విశాఖలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషింగ్ టెక్నాలజీ సంస్థ మైక్రోవోవెన్ వాక్యూమ్ డ్రయ్యర్లను రూపొందిం చింది. దీనిపై సీఐఎఫ్‌టీకి చెందిన డాక్టర్ మధు సూదనరావు, పి.విజిల తదితరులతో కూడిన శాస్త్రవేత్తల బృందం ఏడాది పాటు పరిశోధనలు చేసింది. సత్ఫలితాలు రావడంతో వీటిని వినియోగం లోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
ఈ వాక్యూమ్ డ్రయ్యర్ల ద్వారా ఎండిన చేపలు నాణ్యత, పరిశుభ్రతతో పాటు మంచి రుచిని కూడా కలిగి ఉంటాయని, పోషక విలువలు కూడా తగ్గవని సీఐఎఫ్‌టీ శాస్త్రవేత్తలు చెప్పారు. వీటికి గిరాకీ ఎక్కువగా ఉంటుందని, విదేశాలకు కూడా ఎగుమతి చేసుకోవచ్చన్నారు. ఈ మైక్రోవోవెన్ వాక్యూమ్ డ్రయ్యర్ ధర రూ.5 లక్షల వరకూ ఉంటుందని సీఐఎఫ్‌టీ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్.రఘుప్రకాశ్ చెప్పారు.