కలెక్టరేట్‌లోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్న కార్మికులు
చిలకలపూడి (మచిలీపట్నం) : మధ్యాహ్న భోజన పథక కార్మికులు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నిస్తే పోలీసులు విచక్షణారహితంగా ఈడ్చుకువెళుతూ.. తరిమికొడుతూ భయానక వాతావరణాన్ని సృష్టించారు. నాయకులు, కార్మికులు కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని ఈడ్చుకెళ్లి పోలీస్ వ్యాన్‌లోకి ఎత్తిపడేశారు. నాయకులు, కార్మికులను స్టేషన్‌కు తరలిస్తుండగా మిగిలిన కార్మికులు వ్యాన్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వీరిని కూడా రోప్ పార్టీ ద్వారా పోలీసులు తరిమికొడుతూ స్టేషన్‌కు తరలించారు. స్టేషన్ వద్ద ఆందోళన చేస్తుంటే వారిని కూడా బస్టాండ్ వరకు తరిమికొట్టారు. పోలీసుల చర్యతో కార్మికులు ఆగ్రహం.. ఆవేదనతో ఊగిపోయారు. విద్యార్థులకు పట్టెడన్నం పెడుతున్న తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం చేస్తుంటే అణచివేసే ప్రయత్నం చేస్తారా? అని వ్యా ఖ్యానించారు. కార్మికుల హక్కులను కాలరాయాలని చూసే ఏ ప్రభుత్వం మనుగడసాగించలేదన్నారు.
మమ్మల్ని పంపిస్తే.. మిమ్మల్ని పంపిస్తాం..
మధ్యాహ్న భోజన పథకంలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న తమను తొలగించి ఈ పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ‘మమ్మల్ని బయటకు పంపిస్తే.. మిమ్మల్ని కూడా అధికారం నుంచి బయటకు పంపుతాం’ అంటూ కార్మిక నాయకులు నినదించారు. ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మిక యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సీహెచ్ సుప్రజ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలకు అప్పగించకూడదన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలను పెంచాలని, కార్మికుల కనీస వేతనం రూ.5 వేలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. 2003 నుంచి డ్వాక్రా గ్రూపు మహిళలు నిర్వహిస్తున్న ఈ పథకాలను అక్షయపాత్ర, ఏక్తాశక్తి, నవప్రయాస లాంటి సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. ఆశ వర్కర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.కమల మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు బిల్లులు రాక అప్పులు చేసి, పుస్తెలు తాకట్టు పెట్టి పథకాన్ని సజావుగా అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కార్మికుల కంటే కాంట్రాక్టర్లే ముఖ్యమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళా సాధికారిత అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. సీఐటీయూ తూర్పు జిల్లా కార్యదర్శి వై.నరసింహారావు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, హెల్పర్లకు ప్రతి నెలా 5వ తేదీలోపు వేతనాలు చెల్లించాలన్నారు. ధరలకు అనుగుణంగా బడ్జెట్‌లో నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. పథకం అమలు కోసం కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రభుత్వమే పాఠశాలలకు సబ్సిడీ ద్వారా గ్యాస్ సరఫరా చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘ నాయకులు పి.ధనశ్రీ, బి.వెంకటరమణ, ఎల్.లలితకుమారి, ఆర్.విజయలక్ష్మి, సీఐటీయూ నాయకులు బూర సుబ్రహ్మణ్యం, ఎస్.నారాయణ, చిరువోలు జయరావు, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కార్మికులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment