ఎంబీబీఎస్‌.. ఇక అందదా? | Middle class and poor students does not have MBBS education? | Sakshi
Sakshi News home page

ఎంబీబీఎస్‌.. ఇక అందదా?

Published Mon, Jul 17 2017 2:08 AM | Last Updated on Sat, Oct 20 2018 5:44 PM

ఎంబీబీఎస్‌.. ఇక అందదా? - Sakshi

ఎంబీబీఎస్‌.. ఇక అందదా?

సాక్షి, అమరావతి: నీట్‌లో ర్యాంక్‌ సాధించిన పేద, మధ్య తరగతి వర్గాలకు ఎంబీబీఎస్‌ చదువుకునే అవకాశం లేనట్టేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనికి కారణం మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లకు దేశవ్యాప్తంగా నీట్‌ ఉత్తీర్ణులంతా అర్హులేనని పేర్కొనడమే. దీనివల్ల ఎవరైతే ఎక్కువ మొత్తం చెల్లిస్తారో వారికి మాత్రమే సీటు దక్కుతుంది. కన్వీనర్‌ కోటాలో సీటు రాకపోతే మేనేజ్‌మెంట్, ఎన్‌ఆర్‌ఐ కోటాలో ప్రయత్నిద్దామనుకునే ఏపీ విద్యార్థులకు ఇది శరాఘాతమే. ఒకవైపు ఇప్పటికే ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్‌ కోటాలో ‘బి’ కేటగిరీలో ఉన్న 10 శాతం సీట్లను యాజమాన్య కోటాలో కలిపేశారు.

మరోవైపు ఏడాదికి రూ.3.50 లక్షలున్న ఫీజును ప్రస్తుతం రూ.12.12 లక్షలకు పెంచేశారు. ఫీజు రియింబర్స్‌మెంట్‌ కూడా లేదు, దీంతో మేనేజ్‌మెంట్‌ కోటాలో సీటు సాధించే అవకాశం లేక ఏపీ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు ఈ కోటా సీట్లను ఆ రాష్ట్ర విద్యార్థులకే కేటాయిస్తుండగా ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా జరుగుతుండటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌ నేషనల్‌ పూల్‌లో చేరకపోవడం వల్ల వేరే రాష్ట్రాల్లో మన విద్యార్థులకు అవకాశం లేదు. మరో 15 రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో మేనేజ్‌మెంట్, ఎన్‌ఆర్‌ఐ కోటా ఎంబీబీఎస్‌ సీట్లను భర్తీ చేయనున్నారు. దీని కోసం అన్ని నిబంధనలను ప్రైవేటు మెడికల్‌ కళాశాలలు తొంగలో తొక్కుతున్నాయి. దీనికి 371డి ఆర్టికల్‌ అడ్డుపడినా యాజమాన్యాలు బేఖాతరు చేశాయి. ఈ ఆర్టికల్‌ కేవలం ప్రభుత్వ సీట్లు, కన్వీనర్‌ కోటా (‘ఎ’ కేటగిరీ) సీట్లకు మాత్రమేనని; యాజమాన్య, ప్రవాస భారతీయ కోటా సీట్లకు వర్తించదని తేల్చిపడేశాయి. ఏపీ నుంచి నీట్‌లో 32 వేల మంది అర్హత సాధించినా వారిని కాదని ఎంబీబీఎస్‌ సీట్లు అమ్ముకునేందుకు అన్ని రాష్ట్రాల విద్యార్థులు అర్హులేనని చెప్పడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
‘బి’ కేటగిరీ ఎత్తేసి తీరని ద్రోహం
మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రతిభ కలిగిన విద్యార్థుల కోసం ‘బి’ కేటగిరీ సీట్లు కేటాయించారు. కన్వీనర్‌ కోటా సీటును తృటిలో కోల్పోయిన అభ్యర్థుల కోసం ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్‌ కోటాలో 10 శాతం సీట్లు ఈ కేటగిరీలో ఉండేవి. ఈ కోటాలో ఏడాదికి ఫీజు రూ.2.40 లక్షలు ఉండేది. ఈ సొమ్మును కూడా అర్హులైన పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద మొత్తం చెల్లించేవారు. కానీ 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని ఎత్తేసి యాజమాన్య కోటా కిందకు మార్చింది.
భారీగా ఫీజుల పెంపు: రాష్ట్రంలో కన్వీనర్‌ కోటాలో సీటొస్తే మినహా యాజమాన్య కోటాలో సీటు సాధించే అవకాశం లేదు. ఎందుకంటే గత మూడేళ్ల వరకూ యాజమాన్య కోటాలో ఎంబీబీఎస్‌ సీటుకు రూ.3.50 లక్షలు మాత్రమే ఫీజు ఉండేది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ ఫీజుల్ని అమాంతం పెంచేశారు. ప్రస్తుతం ఏడాదికి రూ.12.12 లక్షలు చెల్లించాల్సిందే. అంటే ఐదేళ్ల వ్యవధికి రూ.60.60 లక్షలు వదులుకోవాల్సిందే. 
 
ఏటా కళాశాలలకు రూ.కోట్లలో ఆదాయం
రాష్ట్రంలో 730 యాజమాన్య కోటా సీట్లుంటే ఒక్కో సీటుకు ఏడాదికి రూ.12.12 లక్షలు చెల్లించాలి. అంటే మొత్తం సీట్లకు ఏడాదికి రూ.88.47 కోట్లు అవుతుంది. అంటే ఐదేళ్ల కోర్సు పూర్తయ్యేసరికి రూ.442.35 కోట్లు వసూలవుతాయి. అక్రమ మార్గంలో వెళ్తే ఇంకా ఎక్కువ వసూలు చేసుకోవచ్చు. ఇక ప్రవాస భారతీయ కోటా సీట్ల సంగతి చెప్పనలవి కాదు. యాజమాన్య కోటా సీటుకు చెల్లించాల్సిన ఫీజుకు 5 రెట్లు మించకుండా తీసుకోవచ్చు. అంటే ఏడాదికి గరిష్టంగా రూ.60.60 లక్షలు తీసుకోవచ్చు. రాష్ట్రంలో 343 ప్రవాస భారతీయ కోటా సీట్లున్నాయి. వీటికి ఏడాదికి రూ.207.85 కోట్లు వసూలు చేసుకోవచ్చు. ఐదేళ్లకు రూ.1,039 కోట్లు అవుతుంది. ఇదీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు కళాశాలల్లో ఎంబీబీఎస్‌ సీట్ల వ్యాపారం.
 
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ ప్రైవేటు వైద్య కళాశాలలకు లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. 
► 2014లో ‘బి’ కేటగిరీ సీట్లు 10 శాతం ఎత్తేసి ఆ సీట్లను యాజమాన్య కోటాలో కలిపేశారు
► ఏడాదికి రూ.3.50 లక్షలున్న యాజమాన్య కోటా ఫీజును రూ.11 లక్షలకు పెంచారు. ఏటా 5 శాతం పెంచుకోవచ్చు. ఇప్పుడు రూ.12.12 లక్షలకు చేరింది. 
► 2015లో గీతం కళాశాలకు డీమ్డ్‌ హోదా కల్పించారు. దీంతో కన్వీనర్‌ కోటా 75 సీట్లు కోల్పోవాల్సి వచ్చింది
► పీజీ వైద్య విద్య పూర్తయ్యాక ఏడాదిపాటు ప్రభుత్వ సర్వీసు విధిగా చేయాలి. తాజాగా ప్రైవేటు కళాశాలల్లో చదివినవారు అక్కడే విధిగా ఏడాది సర్వీసు చేసుకోవచ్చని జీవో 99 జారీ చేయించారు.
►ఇప్పుడేమో యాజమాన్య కోటా సీట్లు మన రాష్ట్రానికే ఇవ్వాలి కదా అని మంత్రిని అడిగితే.. ప్రైవేటు వైద్య కళాశాలలు కూడా మనగలగాలి అని నీట్‌ ర్యాంకుల ఫలితాల సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు.
 
మా పరిధిలో ఉండదు
యాజమాన్య కోటా సీట్లను ఆంధ్రప్రదేశ్‌లో అర్హత పొందిన విద్యార్థులకే ఇవ్వాలని నియంత్రించలేం. అది మా పరిధిలో లేదు. ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇస్తేనే మేము ఆదేశించగలం. ఏ రాష్ట్ర విద్యార్థులైనా యాజమాన్య కోటాకు అర్హులేనని ప్రైవేటు కళాశాలలు అంటున్నాయి.
–డా.ఎస్‌.అప్పలనాయుడు, రిజిస్ట్రార్, ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ
 
‘ఎ’ కేటగిరీ:ప్రభుత్వ కళాశాలల్లో ఉండే మొత్తం సీట్లు, ప్రైవేటు కళాశాలల్లో ఉన్న మొత్తం సీట్లలో 50 శాతం కన్వీనర్‌ కోటా
‘బి’ కేటగిరీ: ప్రైవేటు కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్లు 35 శాతం. వీటిని యాజమాన్యాలే భర్తీ చేసుకుంటాయి.
‘సి’ కేటగిరీ: ఎన్‌ఐఆర్‌ కోటాలో 15 శాతం సీట్లు ఉంటాయి. వీటిని కూడా యాజమాన్యాలే భర్తీ చేసుకుంటాయి. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement