మీకు సగం... మాకు సగం
► కాసుల కోసం రైతులతో బేరసారాలు
► దగదర్తిలో టీడీపీ నేతల రాజీ చర్చలు
► ఆక్రమణకు గురైన సైనికోద్యోగి భూమి రిజిస్ట్రేషన్ రద్దు
► కౌరుగుంట, దామవరంలో వేగవంతమైన భూసేకరణ
సాక్షి టాస్క్‌ఫోర్స్, నెల్లూరు: దగదర్తి మండలంలో భూవ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. భూ అక్రమాల వ్యవహారాన్ని సాక్షి వరుస కథనాల ద్వారా వెలుగులోకి తీసుకురావటంతో అక్రమార్కులు వెనక్కుతగ్గారు. అదేవిధంగా అక్రమాలకు కేంద్రంగా మారిన కావలి ఆర్డీఓ కార్యాలయంపైనా ఏసీబీ అధికారులు నిఘా పెట్టడంతో నిధుల స్వాహాకు బ్రేక్‌పడింది. అయితే విమానాశ్రయం కోసం నిధులు పెద్ద మొత్తంలో మంజూరు అవుతుండటంతో అందులో నుంచి కొంతైనా జేబుల్లో వేసుకునేందుకు అక్రమార్కులు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అందులోభాగంగా భూములు ఉన్న రైతుల వద్దకెళ్లి రాజీ చర్చలు జరుపుతున్నారు.
‘మీ భూ మికి సంబంధించి పరిహారం వచ్చేలా చర్యలు తీసుకుం టాం. అయితే అందుకు కొం త ఖర్చవుతుంది. వచ్చే పరి హారంలో మీకు సగం.. పని పూర్తిచేసినందుకు మేము సగం తీసుకుంటాం’ అంటూ రైతులపై ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దగదర్తి మండల పరిధిలో విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అందు కోసం 1399 ఎకరాల భూమి అవసరం ప్రభుత్వం చెప్పింది కూడా. అందులో భాగంగా విమానాశ్ర యం కోసం భూములను సేకరించమని ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాగానికి ఆదేశాలు జారీ చేసింది. రైతుల ఆధీనంలో ఉన్న భూములకు పరిహారంగా రూ.10 లక్షలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో స్థానిక టీడీపీ నాయకులు కొందరు నిధులను కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
అందులో భాగంగా రైతుల పేరున ఉన్న భూములను వేరొకరి విక్రయించినట్లు రికార్డులు సృష్టించారు. ఈ అక్రమాలను సాక్షి వరుస కథనాలతో బయటపెట్టిన విషయం తెలిసిందే. స్పందించిన కలెక్టర్ దగదర్తి భూముల వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. అందులోభాగంగా కౌరుగుంట సర్వేనంబర్ 283/2లోని మాజీ సైనికోద్యోగికి చెందిన భూమి వేరొకరిపై చేసిన అక్రమ రిజిస్ట్రేషన్‌ను రద్దుచేశారు. అదేవిధంగా ఏపీఐఐసీ పరిశ్రమల ఏర్పాటు కోసం సేకరిస్తున్న భూముల్లోనూ అక్రమాలు జరిగాయి. అందులో సుమలత పేరున జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ కూడా రద్దుచేసినట్లు తెలిసింది.
రైతులతో రాజీ చర్చలు : భూ అక్రమాలపై అధికారయంత్రాంగం, ఏసీబీ అధికారులు దృష్టిపెట్టడంతోపాటు... దగదర్తిలో జరిగిన భూ అక్రమాలపై సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించారు. ఈ విషయంపై మంత్రి కూడా స్పందించి విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. జిల్లా అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టడంతో పాటు భూ సేకరణను కూడా వేగవంతం చేశారు. ఈనెల 10లోపు మొదటి విడత సేకరణ పూర్తిచేయాలని నిర్ణయించారు. భూములు ఉన్నవారికే పరిహారం చెల్లిస్తామని అధికారులు స్పష్టం చేశారు. దీంతో అక్రమార్కులు చేసేది లేక రైతులతో రాజీ ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. ‘మీకు సగం.. మాకు సగం’ అంటూ రైతుల వద్దకెళ్తున్నారు. తమ మాటను కాదంటే ప్రభుత్వం ఇచ్చే డబ్బులు రావని రైతులను బెదిరిస్తూ లొంగదీసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొంత మంది భయంతో ఒప్పుకుంటే.. మరి కొందరు అడ్డు తగులుతుండటం గమనార్హం.