మిలీనియం బ్లాక్ పరిశీలించిన కలెక్టర్
Published Thu, Jan 16 2014 12:47 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
గుంటూరు మెడికల్, న్యూస్‌లైన్ :గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో ఈనెల 18న ప్రారంభం కానున్న పొదిల ప్రసాద్ జింఖానా మిలీనియం సూపర్‌స్పెషాలిటీ అండ్ ట్రామా సెంటర్‌ను బుధవారం కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ పరిశీలించారు. గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగనున్న నేపథ్యంలో వేదిక ఎక్కడ ఏర్పాటుచేయాలి తదితరాలు అర్బన్ ఎస్పీ జెట్టి గోపీనాథ్, ఇతర అధికారులతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదలకు పూర్తిస్థాయిలో కార్పొరేట్ సూపర్‌స్పెషాలిటీ వైద్యసేవలు అందించేందుకు మిలీనియంబ్లాక్‌ను నిర్మించినట్లు తెలిపారు.
సుమారు ఐదేళ్ళకుపైగా రూ.31 కోట్లతో నిర్మాణ పనులు పూర్తి అయ్యాయని, ఇందులో 240 పడకలు అదనంగా వస్తాయని పేర్కొన్నారు. కొందరు ప్రజాసంఘాల నాయకులు కలెక్టర్‌ను కలిసి మిలీనియంబ్లాక్‌పైజీజీహెచ్ పేరు పెట్టాలని వినతిపత్రం సమర్పించారు. జింఖానా ప్రెసిడెంట్ డాక్టర్ లోకేశ్వరరావు మాట్లాడుతూ గుంటూరు వైద్య కళాశాల పూర్వ వైద్య విద్యార్థులు 250 మంది మిలీనియంబ్లాక్ నిర్మాణం కోసం రూ.20 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో జింఖానా ప్రతినిధులు డాక్టర్ త్రిపురనేని రవికుమార్, డాక్టర్ పుసులూరి వెంకటసుబ్బారావు, జీజీహెచ్ ఇన్‌చార్జి సూపరింటెండెంట్ ఏకుల కిరణ్‌కుమార్, అర్బన్‌ఎస్పీ జెట్టి గోపీనాథ్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement