నన్ను అంతం చేసేందుకు కుట్ర పన్నారు: అక్బరుద్దీన్
నన్ను అంతం చేసేందుకు కుట్ర పన్నారు: అక్బరుద్దీన్
Published Sun, Aug 18 2013 12:50 PM | Last Updated on Mon, Oct 8 2018 8:39 PM
నా ప్రత్యర్థులు నన్ను అంతం చేసేందుకు కుట్ర పన్నారని అని మజ్లిస్ ఏ ఇత్తహాదుల్ ముస్లీమీన్(ఎంఐఎం) నాయకుడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. అయితే కుట్రలను తట్టుకుని మరింత శక్తివంతుడిగా మారానని అంతేకాకుండా మరింత పాపులారిటీ వచ్చింది అని ఎంఐఎం వ్యవస్థాపక అధ్యక్షుడు సుల్లాన్ సలావుద్దీన్ ఓవైసీ ఐదవ వర్ధంతి సందర్భంగా హైదారబాద్ పాత బస్తీలోని ఖిల్వాత్ మైదానంలో జరిగిన బహిరంగ సభలో అన్నారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో వివాదస్పద ప్రసంగం కారణంగా అరెస్టైన అక్బరుద్తీన్ మళ్లీ ఓ సభలో కనిపించడం ఇదే తొలిసారి. వివాదస్పద వ్యాఖ్యల నేపథ్యంలో అక్బరుద్దీన్ అదిలాబాద్ జైల్లో 40 రోజులపాటు రిమాండ్ పై ఉన్న సంగతి తెలిసిందే.
ముస్లీంల కొరకు ఎంఐఎం పోరాటం చేస్తోందని.. పోరాటం చేస్తూనే ఉంటుందని అక్బరుద్దీన్ ఆవేశంగా ప్రసంగించారు. ముస్లీం, ఇతర మైనారిటీల రాజ్యంగ హక్కులను పరిరక్షించేందుకు ఎంఐఎం పోరాటం చేస్తుందన్నారు. సమాజంలో అణిచివేతకు గురవుతున్న ముస్లీం,మైనారిటీల ప్రయోజనాలను పరిరక్షించేందుకు గుజరాత్ తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో తాను పర్యటిస్తానని అక్బరుద్దీన్ తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని.. త్వరలోనే ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తానన్నారు. అంతేకాకుండా రానున్న ఎన్నికల్లో వివిధ రాష్ట్రాల్లో తమ పార్టీ తరపున ఎన్నికల్లో అభ్యర్థులను పోటికి నిలుపనున్నట్టు అక్బరుద్దీన్ వెల్లడించారు. ఇటీవల కర్నాటక, మహారాష్ట్ర ఎన్నికల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు విజయం సాధించిన విషయాన్ని పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు తెలిపారు.
రాష్ట్ర విభజనను సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ నాయకులు అంగీకరించాలని ఆయన సూచించారు. అంతేకాకుండా హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా అంగీకరించబోమని, సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు ఉమ్మడి రాజధాని ఏర్పాటును వ్యతిరేకిస్తామని అక్బరుద్దీన్ హెచ్చరించారు. ఈ సభలో పాల్గొన్న ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. మహారాష్ట్రలో తనను పర్యటించకుండా నిషేధం విధించడంపై మండిపడ్డారు. తన పర్యటనపై నిషేధం విధించిన కారణంగా అక్బరుద్దీన్ వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తారన్నారు. మోడీని.. బీజేపీని అడ్డుకుంటాం అంటూ అక్బరుద్దీన్ కార్యకర్తలతో నినాదాలు చేయించారు. ఇటీవల హైదరాబాద్ లో మోడీ 'యస్ వి కెన్', యస్ వి విల్' అంటూ కార్యకర్తలతో నినాదాలు చేయించిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement