శ్రీకాకుళం టౌన్: జిల్లాలోని వంశధార, నాగావళి నదుల్లో 14 ఇసుక రేవుల కేటాయింపు కోసం ఈ-వేలం తేదీలను మైన్స్ అండ్ జియాలజీ అధికారులు సిద్ధం చేశారు. ఎంఎస్‌టీసీ పర్యవేక్షణలో ఆన్‌లైన్ బిడ్లు స్వీకరిస్తామని ప్రకటించినా ఇంతవరకు వేలం తేదీలు మాత్రం ఖరారు కాలేదు. ఈ నెల 15, 16 తేదీల్లో వేలం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ మంత్రివర్గ సమావేశం ఉందన్న సాకుతో రద్దు చేశారు. ముందుగా ఈ-వేలానికి తొలుత 17 రేవులను ఎంపిక చేసిన అధికారులు ఆ తరువాత కోరాడ, మడపాం, పోతయ్యవలస రేవులకు వేలం నిలిపివేశారు.
ఇప్పటికే రేవుల వారీగా దరఖాస్తులను విక్రయించిన ఎంఎస్‌టీసీ అధికారులు ఈ-వేలానికి సర్వం సిద్ధం చేయగా..కాంట్రాక్టర్లు, నిర్మాణ సంస్థలు సన్నద్ధమయ్యారు. ఇంతలోనే మూడు రేవులను రద్దు చేయడం వెనుక ఆంతర్యం అంతు చిక్కడం లేదని దరఖాస్తు దారులంటున్నారు.
అక్రమ తవ్వకాలు
వంశధార నదిపై ఫీజుబులిటీ పొందిన రేవుల్లో సరుబుజ్జిలి మండలం యరగాం, పురుషోత్తపురం, ఆమదాలవలస మండలం చెవ్వాకులపేట, దూసి, పొందూరు మండ లం సింగూరు, కొత్తూరు మండలం సిరుసువాడ, కడుమ, భామిని మండలం సింగిడి, బిల్లుమడ, శ్రీకాకుళం మండలం కళ్లేపల్లి, పొన్నాం, హయాతీనగరం, నరసన్నపేట మండలం బుచ్చిపేట, హిరమండలం మండ లం అందవరం రేవుల్లో ఇసుక తవ్వకాలకు సిద్ధం చేశారు. ఈ రేవుల్లో అత్యధికంగా దూసి రేవుకు 11 మంది దరఖాస్తు చేసుకోగా, చెవ్వాకులపేట, బుచ్చిపేటకు పదిమం ది దరఖాస్తు చేసుకున్నారు.
హయాతీనగరం రేవుకు 9, పురుషోత్తపురం, పొన్నాం, సింగూరు రేవులకు ఎనిమిది వంతున దరఖాస్తులు వచ్చాయి. కళ్లేపల్లిలో 7, అందవరంలో ఆరు, కుడుమ, సింగిడి ఐదు, యరగాం, సిరుసువాడ రేవులకు ఏడు, బిల్లమడ రేవులో అత్యల్పంగా మూడు దరఖాస్తులు వచ్చాయి. అయితే వేలం నిర్వహించకపోవడంతో వీటితో పాటు ఇంకా పరిశీలనలో ఉన్న రేవుల్లో కూడా అక్రమ తవ్వకాలు ఊపందుకున్నాయి. రాత్రివేళ అడ్డూఆపులేకుండా ఇసుక తవ్వకాలు సాగిపోతున్నా అడ్డుకునే నాథుడే లేకుండా పోయాడు.
22వ తేదీతో ముగుస్తున్న పర్యావరణ అనుమతులు
జిల్లాలో ఇసుక తవ్వకాలకు అనుమతులు జాప్యం వల్ల ప్రభుత్వ పనులకు అడ్డంకిగా మారింది. నదుల్లో ఇసుక తవ్వకాలకు పర్యావరణ అనుమతులు సైతం ఈ నెల 22వ తేదీతో ముగుస్తున్నాయి. ఈ-వేలంలో రేవులను దక్కించుకున్న వారే కొత్తగా పర్యావరణ అనుమతులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ అనుమతులు రావాలంటే మరో పది రోజులు పడుతోంది. ఈ-వేలం జరిగిన తర్వాత కూడా పర్యావరణ అనుమతులు రాక పోతే అవి వచ్చినంతవరకు తవ్వకాలకు జరపడానికి వీలుండదు.
తేలని ఈ-వేలం!
Published Sat, Feb 20 2016 12:12 AM | Last Updated on Sun, Sep 3 2017 5:58 PM
Advertisement