
సాక్షి, హైదరాబాద్: మోకిలాలోని హెచ్‌ఎండీఏ ప్లాట్లకు సోమవారం నిర్వహించిన ఆన్‌లైన్ వేలానికి అనూహ్యమైన స్పందన లభించింది. చదరపు గజం అత్యధికంగా రూ.1,05,000, కనిష్టంగా రూ.72,000 చొప్పున ధర పలికింది. సగటున రూ.80,397 చొప్పున ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో విక్రయించినట్టు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. మొత్తం 50 ప్లాట్లపైన హెచ్‌ఎండీఏకు రూ.121.40 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ప్లాట్లకు చదరపు గజానికి రూ.25 వేల చొప్పున కనీసధర నిర్ణయించగా, దానికి మూడురెట్లు వేలంలో డిమాండ్ వచ్చినట్టు అధికారులు తెలిపారు.
నార్సింగి–శంకర్‌పల్లి మార్గంలో ఉన్న మోకిలాలో భూములు హాట్‌కేకుల్లా అమ్ముడుపోవడం విశేషం. హెచ్‌ఎండీఏకు ఇక్కడ 165 ఎకరాల భూమి ఉంది. వీటిలో 15,800 చదరపు గజాల్లో విస్తరించి ఉన్న 50 ప్లాట్లకు సోమవారం ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా అధికారులు వేలం నిర్వహించారు. ఒక్కో ప్లాట్ 300 గజాల నుంచి 500 గజాల వరకు ఉంది. ఇటీవల కోకాపేటలో నియోపోలీస్ రెండో దశ భూముల తరహాలోనే మోకిలాలోనూ హెచ్‌ఎండీఏ ప్లాట్లకు భారీ డిమాండ్ రావడం గమనార్హం. ఈ లే అవుట్‌లో త్వరలో రెండోదశ ప్లాట్లకు కూడా ఆన్‌లైన్ వేలం నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.
చదవండి: ఆర్టీసీ బస్సుల్లో సీటు బెల్టులు