
వారం తర్వాత గంటా మంత్రిగా ఉంటారా..!
మంత్రివర్గ విస్తరణపై శాసనమండలిలో సరదా చర్చ
సాక్షి, అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంశంపై శుక్రవారం శాసనమండలిలో సభ్యుల మధ్య కొద్దిసేపు అసక్తికర చర్చ జరిగింది. పాఠశాల విద్యపై సభలో చర్చ జరుగుతున్న సమయంలో... వారం తర్వాత కూడా గంటా శ్రీనివాసరావు మానవ వనరుల (విద్య) శాఖ మంత్రి పదవిలో ఉంటారో లేదోనని పీడీఎఫ్ ఎమ్మెల్సీల పక్ష నాయకుడు బాలసుబ్రమణ్యం ప్రస్తావించినప్పుడు మంత్రి సహా సభలోని పలువురు సభ్యుల ముఖాలలో నవ్వులు విరిశాయి.
సభలో చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి గంటా మాట్లాడుతూ.. పాఠశాల విద్యపై అందరి సలహాలు, సూచనలు తీసుకునేందుకు ఎమ్మెల్సీలతో వారం రోజుల్లో ఒక సమావేశం నిర్వహిస్తానని చెప్పారు. మంత్రి గంటా శ్రీనివాసరావు తనను ఆ శాఖ నుంచి తప్పించి వేరొక శాఖ కేటాయించమని సీఎంను కోరినట్టు ఈ రోజే కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయంటూ వారం రోజుల తర్వాత ఆయన ఈ మంత్రిగా ఉంటారో లేదనని బాలసుబ్రమణ్యం అనుమానం వ్యక్తం చేశారు. దీనికి మంత్రి నవ్వుతూ బదులిస్తూ.. ఈ శాఖ మంత్రిగా తానుంటే తానే సమావేశం నిర్వహిస్తాననని.. లేదు ఎవరుంటే వాళ్లు సమావేశం నిర్వహిస్తారన్నారు.
ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్
ప్రభుత్వ సూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్ అమలు చేయాలని ఆలోచన ఉన్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు శాసనమండలిలో చెప్పారు. పాఠశాల విద్యపై చర్చలో మంత్రి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్ అంశంపై ముఖ్యమంత్రి వద్ద చర్చ జరిగిందన్నారు. టీచర్, పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీలు, ఈ రంగంపై అసక్తి ఉన్న వారి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విద్యార్ధునుల అత్మరక్షణ అవసరమైన అంశాలలో శిక్షణ ఇచ్చేందుకు ఫైలెట్ ప్రాజెక్టు ఒక జిల్లాలో తరగతులు నిర్వహించి, ఫలితాలను బట్టి తదుపరి రాష్ట్రమంతా అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో వంద శాతం మౌలిక సౌకర్యాల కల్పనకు యాన్యూటీ పద్దతిన రూ.4 వేల కోట్లుతో నిధులు ఖర్చు చేసేందుకు ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారన్నారు.
ఏ తప్పు చేయని ఉపాధ్యాయులకు జైలు శిక్షలా?
పదవ తరగత పరీక్షల ఇన్విజిలేషన్ బాధ్యతల నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులను తప్పించాలని.. ఏ తప్పు లేకపోయినా ఉపాధ్యాయులను అనవసరంగా బలిపశువులను చేస్తున్నారని ఎమ్మెల్సీ వై. శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. చేయని తప్పులకు ఉపాధ్యాయులను జైలులో పెడుతున్నారని తప్పుపట్టారు. సభలో ఆయన మాట్లాడడానికి మండలి చైర్మను మైక్ ఇవ్వకపోయినా శ్రీనివాసరెడ్డి గట్టిగా మాట్లాడుతూ, తన అభిప్రాయాన్ని సభ ముందుంచారు. అంతకు ముందుకు పలువురు సభ్యులు పాఠశాల విద్య అంశంపై మాట్లాడారు.