AP Assembly Winter Session 2019: ‘వాటిపై టీడీపీకి మాట్లాడే హక్కు లేదు’ | Kurasala Kanna Babu - Sakshi
Sakshi News home page

‘వాటిపై టీడీపీకి మాట్లాడే హక్కు లేదు’

Dec 9 2019 11:42 AM | Updated on Dec 9 2019 1:30 PM

Minister Kurasala Kanna Babu Fires On Chandrababu - Sakshi

ప్రత్యేకహోదా, విభజన హామీల గురించి మాట్లాడే హక్కు టీడీపీకి లేదని మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు.

సాక్షి, అమరావతి: ప్రత్యేకహోదా, విభజన హామీల గురించి మాట్లాడే హక్కు టీడీపీకి లేదని మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. పార్టీలు ఇచ్చిపుచ్చుకోవడం గురించి టీడీపీ సభ్యులు మాట్లాడుతున్నారని.. ఈ రాష్ట్రంలో పార్టీలు ఇచ్చి పుచ్చుకోవడం టీడీపీకి తెలిసినట్టుగా ఎవ్వరికీ తెలియదన్నారు. పార్టీలే కాదు, బీ ఫారాలు కూడా ఇచ్చిపుచ్చుకున్నారన్నారు. 2014 నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన వ్యక్తి వైఎస్‌ జగన్‌ ఒక్కరేనని తెలిపారు. ఢిల్లీ, గుంటూరులో దీక్షలు చేశారని, ధర్నాలు, యువభేరీ కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. పార్టీ ఎంపీల చేత కూడా వైఎస్‌ జగన్‌ రాజీనామాలు కూడా చేయించారన్నారు. వైఎస్సార్‌సీసీ ఎంపీలు కన్నా.. టీడీపీ ఎంపీలు అప్పట్లో ఎక్కువ మంది ఉన్నారని, కాని చీమ కుట్టినట్టుకూడా వారికి అప్పుడు లేదన్నారు. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీయే బెటరని అప్పట్లో బల్ల గుద్దినట్టు చంద్రబాబు చెప్పారన్నారు. అప్పట్లో ఆర్థిక మంత్రికి శాలువాలు కప్పి, స్వీట్లు పంచుకున్న చరిత్ర వారిదని.. ఇప్పుడు అదే వ్యక్తులు నీతులు చెప్తున్నారని మండిపడ్డారు.

అలా చేయకపోతే కేంద్రం ఆలోచించేంది..
ఆరోజు నుంచి నేటి వరకూ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా కావాలంటూ మడమ తిప్పకుండా మాట్లాడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ అని అన్నారు. ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పిన చంద్రబాబు.. ఆ తర్వాత రాత్రికి రాత్రి యూటర్న్‌ తీసుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం దెబ్బతీసి, ప్రత్యేకహోదా ఇవ్వకపోయినా సరిపెట్టుకుంటారన్న ఒక మైండ్‌సెట్‌ని క్రియేట్‌ చేసింది చంద్రబాబేనన్నారు. అలా చేయకపోతే ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఉండేదన్నారు.

‘షీలా బీడే కమిటీ ఈ జనవరితో అయిపోయింది. వాళ్లు 89 రికమెండేషన్లు ఇస్తే.. ఈ ప్రభుత్వం వచ్చాక 68 రికమెండేషన్లకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. మేం అవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం ఏ అభ్యంతరాలు పెట్టకుండా 68 సిఫార్సులకు సానుకూలత తెలిపింది. కాని ఆ రోజు టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది. రాజకీయం చేసింది. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన తర్వాత పారిపోయి ఈ రాష్ట్రానికి వచ్చేశారు. హైదరాబాద్‌ 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధాని అయితే... కట్టుబట్టలతో పారిపోయి వచ్చారని’ కన్నబాబు దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ప్రజలు బాధపడే పరిస్థితి  ఏర్పడిందని.. చేసిందంతా చేసి ఇవాళ నీతి కథలు, పిట్ట కథలు చెబుతున్నారని ధ్వజమెత్తారు

నాడు అలా..నేడు ఇలా...
టీడీపీకి ప్రత్యేక హోదాపైన, విభజన హామీలపైన మాట్లాడే హక్కులేదని.. ఐదేళ్ల పాటు ఏమీ చేయకపోగా, ఆరునెలల్లో ఏదో జరిగిపోయిందన్నట్టుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ సీపీ ఎంపీలు రాజీనామాలు చేసినప్పుడే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి ఉంటే ఫలితం ఉండేదని, కాని అలా చేయకుండా మోదీ అన్యాయం చేశారని ఎన్నికల ముందు మాట్లాడి, ఇప్పుడు మళ్లీ మోదీతో జతకట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నలుగురు ఎంపీలను బీజేపీలోకి పంపించి మళ్లీ ఇక్కడ మరోలా మాట్లాడుతున్నారన్నారు. 

ఎన్నిసార్లు నాలుకలు మడతపెట్టారో వారికే తెలియాలి..
ఉద్యోగులకు సంబంధించిన అంశాలను పరిష్కరించడానికి, ఆస్తుల పంపిణీ గురించి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. తెలంగాణ ఇచ్చిన భవనాల్లో ఏదీ కూడా విభజన చట్టంలోని పరిధిలోనిది కాదని.. విభజన చట్టంలో భవనాల్లోని ఒక్క గదిని కూడా అప్పగించలేదని స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలో ఉండగా... విభజన చట్టంలోని భవనాలను ఆక్రమిస్తే ఒక్కసారి కూడా మాట్లాడలేదన్నారు. అక్కడ సచివాలయంలో భవనాలు ఎందుకు వృథాగా పడి ఉన్నాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కార్యాలయం కోసం అభివృద్ది చేసిన దాన్ని కూడా విడిచిపెట్టారని.. ఇప్పుడు అక్కడ ఉండకపోయినా, బూజు పట్టినా.. కరెంటు బిల్లుల రూపేణా కట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఐదేళ్లపాటు వాళ్లు చేసిన నిర్వాకానికి మరో ఐదేళ్ల పాటు కష్టపడితే తప్ప తీరని విధంగా సమస్యలు సృష్టించారన్నారు. మనకు కేటాయించిన భవనాలను తెలంగాణ ప్రభుత్వం ఆక్యుపై చేసినా.. అడగలేకపోయారని.. కారణం ఓటుకు నోటు కేసులో అప్పటి ముఖ్యమంత్రికి ఉన్న బలహీనత అని తెలిపారు. ఢిల్లీతో సంబంధాల విషయంలో ఎన్నిసార్లు నాలుకలు మడతపెట్టారో టీడీపీ వాళ్లకే తెలియాలని ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement